ఢిల్లీ ని మించిన మద్యం కుంభకోణం ఏపీలో జరిగిందా?
గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభ కోణం జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందా? జరిగితే అది ఎలా జరిగింది? కొనుగోలులో కోట్లు కొట్టేశారని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా నిబంధనలు రూపొందించినందుకు ఢిల్లీ లోని కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వం కుంభ కోణానికి పాల్పడిందని భావించిన కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రంగంలోకి పలువురిపై కేసులు నమోదు చేసింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, ఆంధ్రప్రదేశ్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిలు ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. రాఘవరెడ్డి అప్రువర్ గా మారారు. కవితకు ఇటీవల బెయిల్ వచ్చింది. ఇదే తరహాలో కొనుగోలులో దోపిడీకి జగన్ ప్రభుత్వం పాల్పడిందని ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
మద్యం కుంభకోణం దర్యాప్తు ఊహించిందే...
ఆంధ్రప్రదేశ్ లో ఊహించని మద్యం కుంభకోణం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ మద్యం కుంభకోణం జరిగినట్లు ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. గతంలో సీఐడీ నమోదు చేసిన కేసు నీరు గారిందని, అందుకే సిట్ వేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. సిట్ అధిపతిగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు ను ప్రభుత్వం నియమించింది. ఇందులో మరో ఐపీఎస్ అధికారి ఎల్ సుబ్బరాయుడు, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్ శ్రీహరిబాబు, ఒంగోలు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారి కొల్లి శ్రీనివాస్, డోన్ డీఎస్పీ పి శ్రీనివాసరావు, సీఐ లు కే శివాజీ, సీహెచ్ నాగశ్రీనివాస్ లు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రస్తుత ప్రభుత్వానికి వీర విధేయులనే ప్రచారం ఉంది. సిట్ కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు. అంటే వారే కేసు దర్యాప్తు చేసి కోర్టుకు పంపించవచ్చు. అరెస్ట్ లు కూడా వారే స్వయంగా చేసి కోర్టుకు హాజరు పరచవచ్చు.
టార్గెట్ ఎవరు?
మద్యం కుంభకోణం కేసులో ప్రధానంగా టార్గెటెడ్ వ్యక్తులు ఉన్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇప్పటికే ప్రభుత్వం టార్గెట్ చేసింది. అధికారంలోకి కూటమి రాగానే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్దం కేసులోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ దిశగా దర్యాప్తు సాగినా పెద్దిరెడ్డి కారకుడని పోలీసులు నిర్థారించలేక పోయారు. చిత్తూరు జిల్లా అడవిలో భూములు కొనుగోలు చేసి ఫామ్ హౌస్ కట్టారని ఆరోపణలు రావడంతో అటవీ భూములు ఎంత ఆక్రమించారో తేల్చాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఒకపక్క దర్యాప్తు జరుగుతుండానే మద్యం కుంభకోణం అంటూ మరో అంశం తెరపైకి వచ్చిది. మద్యం కొనుగోళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని, లావాదేవీలన్నీ వీరు, వీరి బినామీలతోనే జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది.
విజయసాయిరెడ్డికి చుట్టుకుంటుంటుందా?
ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వి విజయసాయిరెడ్డి కూడా మద్యం కుంభ కోణం జరగటానికి బాధ్యుడనే ఆరోపణలు వచ్చాయి. ఆయనను కూడా విచారించి కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అల్లుడి ద్వారా మద్యం వ్యాపారంలో విజయసాయి పావులు కదిపారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ను కూడా మద్యం కుంభ కోణంలో బాధ్యుడిని చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈయన కూడా తనకు అనుకూలురైన వారి నుంచి మద్యం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. వైఎస్సార్సీపీ లో తిరుపతి నుంచి నాయకత్వం వహిస్తున్న మరికొందరు మాజీ ఎమ్మెల్యేలను కూడా ఈ కుంభకోణంలో ఇరికించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ని కూడా టార్గెట్ చేసినట్లు తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
మిథున్ పై హవాలా కేసు నమోదు చేసే ఆలోచనలో ప్రభుత్వం..
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని హవాలా కేసులో అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వైఎస్సార్సీపీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మద్యం కుంభ కోణానికి సంబంధించి జరిగిన లావాదేవీల్లో హవాలా కూడా జరిగిందని ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. ఈ కథ నడిపింది మిథున్ రెడ్డిగా ప్రభుత్వం భావిస్తోంది. హవాలా నెట్ వర్క్ ద్వారానే మాజీ సీఎం వైఎస్ జగన్ కు మిథున్ రెడ్డి దోపిడీ నిధులు చేర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుమారు 3వేల కోట్ల వరకు జగన్ కు ముట్టి ఉంటాయనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి.
పాత బ్రాండ్స్ కాదని కొత్త బ్రాండ్స్
జగన్ ప్రభుత్వంలో అప్పటి వరకు ఉన్న పాత బ్రాండెడ్ మద్యం కంపెనీల నుంచి కాకుండా కొత్తగా ఏర్పాటైన మద్యం కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు సీఐడీ పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఎన్ జే, అదాన్, లీలా, ఎన్వీ, బీ9, సోనా, మూనక్ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు గత ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం రూ. 15,843 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిపింది. అదాన్ కంపెనీ 2019 డిసెంబరులో ఏర్పాటైంది. గ్రేసన్స్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ 2020లో ఏర్పాటైనట్లు పోలీసులు చెబుతున్నారు. మొత్తం 26 కంపెనీలు కొత్తగా ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్ కు రూ. 20,356 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఏడు కంపెనీలకు చెందిన 38 మద్యం బ్రాండ్స్ కు కొత్తగా అనుమతులు ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది.
మద్యం కుంభ కోణానికి సంబంధించి ప్రస్తుత ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా 2024 సెప్టెంబరు 23న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీఐడీ వారు దర్యాప్తును నత్తనడకన సాగిస్తున్నారనే కారణాలు చెప్పి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.