తెలంగాణా-ఏపీ ‘మద్యబంధం’ బలపడిందా ?
x

తెలంగాణా-ఏపీ ‘మద్యబంధం’ బలపడిందా ?

ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని మొత్తం షాపుల్లో సుమారు 40 శాతం దుకాణాలను తెలంగాణా వ్యాపారులు దక్కించుకున్నారు.


రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలాగున్నా మద్యబంధం మాత్రం చాలా బలంగా పెనవేసుకుపోయింది. మద్యబంధం అంటే లిక్కర్ వ్యాపార బంధమని అర్ధంచేసుకోవాలి. ఎలాగంటే ఏపీలో సుమారు 3396 మద్యం షాపులకు 88 వేల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. టెండర్ల ద్వారా నాన్ రీఫండబుల్ మొత్తమే సుమారు రు. 1800 కోట్లు ప్రభుత్వానికి దక్కింది. మొత్తం 3396 షాపులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అత్యధిక ధరలు కోట్ చేసిన వారికి షాపులను సోమవారం ప్రభుత్వం కేటాయించింది. కేటాయిపులన్నీ పూర్తయిన తర్వాత బయటపడిన విషయం ఏమిటంటే మొత్తం షాపుల్లో సుమారు 40 శాతం తెలంగాణా, కర్నాటక, ఒడిస్సా, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, తమిళనాడు వ్యాపారస్తులు దక్కించుకున్నారు. ఇందులో కూడా తెలంగాణా వ్యాపారులకు ఎక్కువ షాపులు దక్కాయి. అందుకనే ఏపీ-తెలంగాణా మధ్య మద్యబంధం బాగా బలపడినట్లయ్యింది.


ముఖ్యంగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నంద్యాల జిల్లాల్లోని షాపులు తెలంగాణా వ్యాపారస్తులకు దక్కాయి. కారణం ఏమిటంటే పై జిల్లాలకు ఖమ్మం, నల్గొండ, భద్రాచలం జిల్లాలతో సరిహద్దులు ఉండటమే కాకుండా దశాబ్దాలుగా వ్యాపార సంబంధాలతో పాటు బంధుత్వాలు కొనసాగుతుండటమే. ఇదే సమయంలో 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నపుడు ఏపీలోని షాపులన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించింది. అప్పుడు జనాలందరికీ నచ్చిన బ్రాండ్లు కాకుండా తమిష్టం వచ్చిన బ్రాండ్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇంతేకాకుండా మద్యంధరలు కూడా ఎక్కువగా నిర్ణయించింది. దాంతో ధరలు ఎక్కువని, నచ్చిన బ్రాండ్లు లేవన్న కారణంతో చాలామంది ఏపీ-తెలంగాణా సరిహద్దు జిల్లాల ప్రజలు ఏపీ నుండి రెగ్యులర్ గా తెలంగాణాలోకి వచ్చి పార్టీలు చేసుకోవటమే కాకుండా మద్యం బాటిళ్ళు కొనుక్కుని ఏపీకి తీసుకెళ్ళేవారు. ఆ పరిస్ధితి నుండి ప్రభుత్వం మారగానే ఇపుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం మార్కెట్లోకి అన్నీ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.


మందుబాబులందరికీ నచ్చిన బ్రాండ్లను అందుబాటులోకి తెస్తున్న కారణంగా చాలామంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏపీలో వైన్ షాపులను దక్కించుకునేందుకు పెద్దఎత్తున పోటీలు పడ్డారు. పొరుగురాష్ట్రాల వాళ్ళల్లో అత్యధిక షాపులను తెలంగాణా వ్యాపారస్తులే దక్కించుకున్నారు. ఏ రాష్ట్రం వాళ్ళయినా టెండర్లు వేసుకుని షాపులు దక్కించుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వం కల్పించటంతో వ్యాపారులు చాలామంది పోటీలుపడి మరీ టెండర్లువేసి షాపులు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని వత్సవాయిలో మూడు షాపులకు టెండర్లు పిలిచారు. 96వ నెంబర్ షాపుకు 132, 97వ షాపుకు 120, పెనుగంచిప్రోలులో 81వ షాపుకు 110 దరఖాస్తులు వచ్చాయి.


విచిత్రం ఏమిటంటే పై షాపులకు వచ్చిన వందలాది దరఖాస్తుల్లో ఏపీ వ్యాపారస్తులకు కాకుండా మూడుషాపులూ తెలంగాణా వ్యాపారులకే దక్కాయి. 96వ నెంబర్ షాపు ఖమ్మంజిల్లాలోని ఖానాపూర్ కు చెందిన చెరుకుపల్లి సత్యనారాయణ, 97వ షాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బండి అనూష, 81వ నెంబర్ షాపు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లోని తల్లపల్లి రాజు దక్కించుకున్నారు. అలాగే ఏలూరు జిల్లా కుక్కునూరులోని 121వ షాపుకు 108 దరఖాస్తులు అందితే విలీనమండలమైన వేలేరుపాడు(ఖమ్మంజిల్లా)కు చెందిన కామినేని శివకుమారి దక్కించుకున్నది. విజయవాడలోని 14, 18 నెంబర్ షాపులను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన రాహుల్ శివ్ హరే, అర్పిత్ శివ్ హరే దక్కించుకున్నారు. మచిలీపట్నంలోని ఒక షాపును కర్నాటకకు చెందిన మహేష్ బాతే సొంతం చేసుకున్నారు. బందరులోని మరో షాపును ఢిల్లీ వ్యాపారి లోకేష్ చంద్ దక్కించుకున్నారు.


శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని కొన్ని షాపులను ఒడిస్సా వ్యాపారులు దక్కించుకున్నారు. కర్నూలు జిల్లాలోని 10 షాపులను తెలంగాణా వ్యాపారులు దక్కించుకున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని మొత్తం షాపుల్లో సుమారు 40 శాతం దుకాణాలను తెలంగాణా వ్యాపారులు దక్కించుకున్నారు. తెలంగాణాతో పోలిస్తే ఏపీలో మధ్యం ధరలు తక్కువగా ఉండటం, ఏపీలో అధికారపార్టీ తెలుగుదేశంపార్టీ తెలంగాణాలో కూడా బలపడాలని నిర్ణయించటం లాంటి అనేక కారణాలతో ఏపీ షాపుల్లో తెలంగాణా వ్యాపారులు పాగా వేశారు. తెలుగుదేశంపార్టీ నేతలే ఎక్కువ షాపులను దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణాలోని తమ పార్టీ నేతలు లేదా మద్దతుదారులతో టెండర్లు వేయించి షాపులు దక్కేట్లు ఏపీ నేతలు చక్రంతిప్పారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ఏపీ-తెలంగాణా మధ్య మద్యబంధం బలోపేతం అవటం సంతోషమే కదా.

Read More
Next Story