
డబ్బు ఒక్కటే జీవితం కాదు..!
జీవితానికి డబ్బు అవసరమే కానీ అదొక్కటే జీవితం కాదని ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్, రచయిత, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ సుధామూర్తి అన్నారు.
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులు వేవ్స్ 2025 పేరిట నిర్వహించిన వార్షిక సమావేశానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్, రచయిత, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం సాయంత్రం వైజాగ్ బీచ్‌రోడ్డు ఏయూ కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆమె స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సుధామూర్తి తన ప్రసంగంలో ఏమన్నారంటే?
అదుపు తప్పే సంపాదన ప్రమాదకరం..
జీవితంలో డబ్బు అవసరమే.. కానీ ఎంత కావాలన్నది మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. చాలా డబ్బు ఉంటే ఏమవుతుంది? డబ్బు ఒక్కటే జీవితం కాదు.. అధికంగా డబ్బుంటే చాలా ప్రమాదం. డబ్బుని మనసు కంట్రోల్ చేయాలి. అదుపు తప్పిన సంపాదన కుటుంబాన్ని ఛిద్రం చేస్తుంది. పిల్లలను పాడు చేస్తుంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో డబ్బు చాలా పాత్రలు పోషిస్తుంది. లైఫ్‌లో చాలా సంఘటనలు జరుగుతాయి. వాటిని మనం ఊహించలేం. కుంగుబాటును ఎదుర్కోవడమే జీవితమంటే.. మీ సృజనాత్మకతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
వేదికపై ఏయూ పూర్వ విద్యార్థుల ప్రముఖులతో సుధామూర్తి
జీవితంలో అనుభవాలే టీచర్లు..
యూనివర్సిటీల్లో విద్య నేర్పడానికి అధ్యాపకులుంటారు.. కానీ జీవితంలో నేర్చుకోవడానికి టీచర్లుండరు. అనుభవాలే టీచర్లు. వృద్ధాప్యానికి వయసుతో పనిలేదు. నేర్చుకోవడం, ప్రశ్నించడం మానేస్తేనే వృద్ధాప్యంలోకి వచ్చినట్టు. నేర్చుకుంటున్నంత సేపూ వారు యువతీ యువకులే. నా విద్యార్థులు విజయాలు సాధిస్తుంటే నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది. విద్యార్థులకు విద్యాలయమే దేవాలయం. విద్యార్థులు తప్పులు చేయకుండా క్రష్ చేస్తే చెరుకు నుంచి రసం తీసినట్టు.. మా ఉపాధ్యాయులకు నేనెప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను.
చాట్ జీపీటీ నాలెడ్జికి ప్రత్యామ్నాయం కాదు..
ప్రతి ఒక్కరికీ ఒక టైమ్ వస్తుంది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. చాట్ జీపీటీ నాలెడ్జికి ప్రత్యామ్నాయం కాదు.. ఎదగడానికి కష్టపడి పనిచేయాలి. నా జీవితంలోనూ చాలా ఫెయిల్యూర్స్ చూశాను. ప్రతి వైఫల్యం నుంచి ఒక గెలుపు సాధించుకోవాలి. ఒక్కో మెట్టు ఎక్కడానికి అపజయాన్ని మలచుకోవాలి. లక్ష్యం నిర్దేశించుకుని దాన్ని అధిగమించడానికి కృషి చేయాలి. మీరెవరైనా కొత్తగా వర్క్ ప్లేస్‌కు వెళ్తే.. మీపై చాలా అంచనాలుంటాయి. ఉద్యోగంలో నాలెడ్జి అవసరం. కొత్త అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. గ్రూప్ వర్కింగ్ హాబిట్ అలవరచుకోవాలి. సహనం కూడా చాలా అవసరం.
హాజరైన పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు
మహిళలు మంచి హెచ్‌ఆర్ మేనేజర్లు..
ప్రతి విజయవంతమైన మహిళ వెనక భర్త ఉంటాడు.. ఫ్యామిలీ సపోర్టు లేకపోతే మహిళలు ఎదుగలేరు. మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. మహిళలు కుటుంబంలో మంచి హెచ్‌ఆర్ మేనేజర్లు.
ఏయూ వందేళ్లు మనుగడ గొప్ప విషయం
సర్వేపల్లి రాధాకృష్ణ ఏయూ నుంచే రాష్ట్రపతి అయ్యారు. ఈ విశ్వవిద్యాలయం ఎందరో గొప్పవారిని, మేధావులను అందించింది. ఈ యూనివర్సిటీ వందేళ్లు ఉన్నతంగా మనుగడ సాగించడం గొప్ప విషయం. ఏయూ గ్లోబల్ యూనివర్సిటీ కావడానికి సమయం పడుతుంది. విద్యార్థులు మెరికల్లా తయారవ్వాలంటే అధ్యాపకుల కృషి కూడా అవసరం. విద్యే మీ ఆయుధం కావాలి. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు చదువుకున్న విద్యాలయాలకు, మాతృభూమికి కృతజ్ఞతగా ఉండండి. గౌరవించండి. విద్యార్థులు నేర్చుకోవడానికి నిరంతరం తపించాలి. నైతిక విలువలతో ఉండాలని విద్యార్థులకు నేనిచ్చే సందేశం.’ అని డాక్టర్ సుధామూర్తి తన ప్రసంగాన్ని ముగించారు. తొలుత ఏయూ వ్యవస్థాపక ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి సుధామూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రముఖులు ఏమన్నారంటే..
పూర్వ విద్యార్థుల సమావేశంలో పలువురు ప్రముఖులు మాట్లాడారు. జీఎమ్మార్ సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ విశాఖపట్నం రైజింగ్ పవర్ హౌస్ లాంటిదని, ఐటీ, డేటా సెంటర్లకు హబ్‌గా మారుతోందని చెప్పారు. వందేళ్లుగా దేశానికి, ప్రపంచానికి విద్యావంతులను, మేథావులను అందించడంలో ఏయూ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు సలహాదారుగా పనిచేసిన ఏయూ పూర్వ విద్యార్థి దేవ హెచ్ పురాణం మాట్లాడుతూ.. ‘జో బైడెన్ ఎక్కడ చదువుకున్నావని అడిగితే ఏయూ అని గర్వంగా చెప్పాను. ఈ విశ్వవిద్యాలయం నాకు గొప్ప జీవితాన్నిచ్చింది. తిరిగి ఈ యూనివర్సిటీకి ఏదైనా ఇవ్వాలని సంకల్పించాను. ఆ దిశగా నేను ముందుకెళ్తున్నాను.’ అని పేర్కొన్నారు. ఆయన ఏయూకి రూ.70 లక్షల చెక్‌ను అందజేశారు. ఇప్పటివరకు ఆయన ఏయూకి రూ.2.70 కోట్లు ఇచ్చారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుః ఏయూతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం మామూలు విషయం కాదని, ఎందరో ప్రయోజకుల్ని చేసిందని, మరెందరో మేథావులను అందించిందని కొనియాడారు. సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘ఏయూలో చదివిన వారెందరికో మంచి గుర్తింపు నిచ్చింది. నాకూ అలాంటి గుర్తింపునే తెచ్చి పెట్టింది. పేద పిల్లల చదువుల కోసం పూర్వ విద్యార్థులంతా కలిసి చేయూతనిద్దాం’ అని పిలుపునిచ్చారు.
ఆంధ్ర యూనివర్సిటీలో అ‘పూర్వ’ ఆనందం!
ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల వేడుకలను జరుపుకుంటున్న సమయంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి దేశ విదేశాల నుంచి హాజరైన వేలాది మంది ఏయూ పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. ఈ కార్యక్రమం తిలకించేందుకు వేదికతో పాటు ప్రాంగణం వెలుపల ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అలుమ్ని అసోసియేషన్ (ఏఏఏ)ను 2005లో స్థాపించారు. ఈ కార్యక్రమంలో ఏయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు కేవీవీ రావు, ప్రధాన కార్యదర్శి ఆకుల చంద్రశేఖర్, ఏయూ వీసీ జీపీ రాజశేఖర్, పలువురు ప్రొఫెసర్లు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు విదేశీ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. మడగాస్కర్, బంగ్లాదేశ్.. మొజాంబిక్ తదితర దేశాల సంప్రదాయ నృత్యాలు, భారతీయ లంబాడీ నృత్యం. కోలాటం, భరత నాట్యం.. జానపద గేయాలు ఆకట్టుకున్నాయి.
Next Story

