జేసీ ప్రభాకర్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది: కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి హత్యకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటిదాకా పలుసార్లు తనను చంపేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. తన అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో చంపారని, అదే పద్ధతిలో తనను కూడా హతమార్చేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాలకు ఎస్పీ జగదీష్ సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు.
ఈ కుట్రల్లో భాగంగా తనపై ఇప్పుడు మూడు హత్యాయత్నం కేసులు నమోదు చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతోనే తనను తాడిపత్రికి ఎస్పీ జగదీష్ అనుమతించడం లేదని, తనకు తన కుటుంబ సభ్యులకు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందన్నారు. ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా, తన ఇంటిపై దాడి జరిగిందని, అక్రమ కేసుల్లో వేధిస్తున్నారని తెలిపారు. ఎస్పీ జగదీష్ సహకారంతోనే తనను చంపేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.