విజయవాడ గాంధీహిల్ గురించి తెలుసుకుందామా..
మహాత్మ గాంధీ పేరు వినగానే ఏపీలో విజయవాడలోని గాంధీ హిల్ గుర్తుకు వస్తుంది. ఈ కొండపై నుంచి చూస్తే విజయవాడ నగరమంతా ఎటు చూసినా కనిపించి కనువిందు చేస్తుంది.
మహాత్మా గాంధీ స్మారకార్థం దేశంలోని ఆరు ప్రాంతాల్లో గాంధీ స్మారక సంస్థ మహాత్మా గాంధీ స్మారక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయన అడుగు జాడలను కొనసాగించేందుకు విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన స్మారక కేంద్రాన్ని గాంధీ హిల్ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలోకి ఈ గాంధీ హిల్ వచ్చింది. విజయవాడ రైల్వే జంక్షన్‌కు పశ్చమం వైపున 18 ఎకరాల విస్తీర్ణం గల కొండపై గాంధీ స్మారక కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహాత్మా గాంధీ 1921లో విజయవాడ నగరానికి వచ్చి ఆలిండియా కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. గాంధీజీ బోధనలను నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ కొండపై స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
1962లో శంకుస్థాపన
ప్రస్తుతం గాంధీ హిల్‌గా పిలవబడుతున్న ఈ కొండపై గాంధీ స్మారక కేంద్రాన్ని 1962 నవంబరు 9న అప్పటి ప్రధాని లాలబహుదూర్ శాస్త్రీ దీనికి శంకుస్థాపన చేశారు. 1968 అక్టోబరు 6న అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ గాంధీ హిల్‌ను ఆవిష్కరించారు. అప్పటి నుంచి దీనిని గాంధీ కొండగా ప్రసిద్ధి చెందింది. నగరంలో పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
52 అడుగుల స్థూపం
గాంధీ కొండపై 52 అడుగుల ఎల్తైన స్థూపాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా రెంటచింతల నుంచి ఎర్ర మార్బుల్ రాయిని ఈ స్థూపానికి ఉపయోగించారు. స్థూపంపై మహాత్మా గాంధీ చిత్రాన్ని అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. స్థూపం దిగువ భాగంలో చుట్టూ గాంధీ బోధనలను లిఖించారు. స్థూపాన్ని చూడగానే గాంధీజీ ఆశయాలు కళ్లముందు కనిపిస్తాయి. కొండపై ఎల్తైన శిఖరం వద్ద ఈ స్థూపాన్ని నిర్మించడం వల్ల అక్కడ నుంచి విజయవాడ నగరాన్ని సందర్శకులు చూసి ఆనందిస్తుంటారు.
గాంధీ స్మారక గ్రంధాలయం ఏర్పాటు
గాంధీ కొండపై మహాత్మా గాంధీ స్మారక గ్రంధాలయాన్ని ఏర్పాటు చేశారు. గాంధీజీ రచనలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. గాంధీజీ జీవితాన్ని ఈ గ్రంధాలయం ఆవిష్కరిస్తుంది. వేల సంఖ్యలో ఉన్న సాహితీ గ్రంధాలు మహాత్మా గాంధీ గురించి తెలసుకోవడానికి ఉపయోగపడుతాయి. పక్కనే నూతన గ్రంధాలయ నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
కొండ చుట్టూ రైలు తిరుగుతుంది
గాంధీ హిల్‌పై మధ్య భాగంలో చుట్టూ ఒక చిన్న రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్‌పై రైలు బోగీలు ఏర్పాటు చేశారు. దీనిని టాయ్ ట్రెయిన్ అంటారు. ప్రధానంగా చిన్న పిల్లలను దీనిలో ఎక్కించి కొండ చుట్టూ తిప్పుతారు. ఈ టాయ్ ట్రెయిన్‌ను 1969లో ఏర్పాటు చేశారు. పెద్దలు కూడా దీనిలో ఎక్కి కొండ చుట్టూ తిరుగుతూ నగరం ప్రకృతి అందాలను తిలకించొచ్చు. చిన్న పిల్లలైతే కేరింతలు కొడుతుంటారు.
గాంధీ హిల్‌ను సందర్శించిన వారసులు
మహాత్మా గాంధీ వారసులు రెండేళ్ల క్రితం గాంధీ హిల్‌ను సందర్శించారు. గాంధీజీ మనుమడు చరిత్రకారుడు అయిన ఆచార్య రాజమోహన్ గాంధీ దంపతులు గాంధీ హిల్‌ను సందర్శించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నగర వాసులు తమ తాతగారిని ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ ప్రాంతం చూస్తే తెలుస్తోందని వ్యాఖ్యానించారు. 2019 సెప్టెంబరు నెలలలో గాంధీ మునిమనమడు ఆనంద్ గోఖని గాంధీ హిల్‌ను సందర్శించారు. తాతకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రైవేటు వారికి మెయింటెనెన్స్
గాంధీ కొండ స్మారక ప్రదేశాన్ని సందర్శకులు సందర్శించినప్పుడు వారికి కావలసిన వసతులు కల్పించే బాధ్యతను ప్రైవేటు వ్యక్తుల చేతికి ప్రభుత్వం అప్పగించింది. దీంతో కొండపైకి వెళ్లాలంటే టికెట్ తీసుకోవలసి ఉంటుంది. టికెట్ ద్వారా వచ్చిన సంపాదనతో వేలంలో పాడిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన సొమ్మును కాంట్రాక్టరు తీసుకుంటారు. గాంధీ హిల్ మెయింటెనెన్స్‌ను మునిసిపల్ కార్పొరేషన్ తీసుకోవాలని మరింత ఆహ్లాదకరంగా పూల మొక్కలు, సుగంధ మొక్కలు, నీడ చెట్లను ఎక్కువుగా నాటి సందర్శకులకు మంచి వాతావరణాన్ని కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్శకులు కోరుతున్నారు.
Next Story