అరకులో చలి పండుగ చూసొద్దామా?
x

అరకు 18 అరకు బెలూన్ ఫెస్టివల్లో హాట్ ఎయిర్ బెలూన్ల విహారం

అరకులో చలి పండుగ చూసొద్దామా?

జనవరి 31 నుంచి మూడు రోజులు ఉత్సవం. ఏడెనిమిది రాష్ట్రాల గిరిజన కళల ప్రదర్శన. బెలూన్ ఫెస్టివల్కు పేరు మార్పు.. రూ.కోటి ఖర్చు.


అరకు.. ఈ పేరు వింటేనే పర్యాటక ప్రియులకు చెప్పలేనంత ఉత్సాహం.. అక్కడ అందాలు చూడాలని ఒక్కటే ఉబలాటం. అరకు అంటేనే ఓ అద్భుతం.. అరకు ఉత్సవమంటే ఇంకెంతో అబ్బురం. 'చలి' పేరుతో ఈనెల 31 నుంచి మూడు రోజుల పాటు అందాల అరకులో పండుగ జరగనుంది. ఇందుకు అరకు డిగ్రీ కాలేజీ మైదానం వేదిక కానుంది. ఎముకలు కొరికే చలిలో చలి పండుగ జరగడం ఓ విశేషం. ఆ చలి పండుగ వింతలు, విశేషాలను కళ్లారా ఆస్వాదించాలంటే ఈ కథనం చదవాల్సిందే మరి!

తొలిసారి అరకు ఉత్సవన్ను 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు (2018, 2019ల్లో) బెలూన్ ఫెస్టివల్ పేరిట ఈ ఉత్సవ్ జరిగింది. ఆ బెలూన్ ఫెస్టివల్కు మన దేశంతో పాటు దాదాపు 15 ఇతర దేశాల నుంచి 20కి పైగా హాట్ ఎయిర్ బెలూన్లతో ఆపరేటర్లు తరలి వచ్చారు. ఆ ఫెస్టివల్కు ఈ హాట్ ఎయిర్ బెలూన్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ అరకు ఉత్సవ్ను తిలకించడానికి లక్షలాది మంది పర్యాటకులు పోటెత్తారు. అప్పట్లో ప్రభుత్వం అరకు బెలూన్ ఫెస్టివల్క రూ.10 కోట్ల వరకు వెచ్చించింది.

అరకులో మంచు సోయగం

అరకులో మంచు సోయగం

ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఉత్సవ్ జోలికి వెళ్లడం మానేసింది. ఇలా గడచిన ఐదేళ్లూ అరకు ఉత్సవ్ జాడ లేకుండా పోయింది. ఇటీవల టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అరకు బెలూన్ ఫెస్టివలు ఉవ్విళ్లూరింది. ఈ సంగతి తెలుసుకున్న దేశ విదేశాల్లోని హాట్ ఎయిర్ బెలూన్ నిర్వాహక సంస్థలు అరకు ఫెస్టివల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపారు. గత డిసెంబరులోనే దీనిని నిర్వహించాలని భావించి అందుకు అవసరమైన ఏర్పాట్లకు సిద్ధమయింది. ఇందుకు రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని పర్యాటక శాఖ ప్రతిపాదించింది. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో అరకు బెలూన్ ఫెస్టివల్ను ఉపసంహరించుకుంది.

అరకు చలి పండుగగా పేరు మార్పు..

అరకు బెలూన్ ఫెస్టివల్ స్థానంలో ప్రభుత్వం 'చలి' పేరిట ఇప్పుడు అరకు ఉత్సవు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అరకు డిగ్రీ కాలేజీ మైదానంలో చలి పండుగను నిర్వహించనుంది. దీనికి రూ.కోటి మాత్రమే వెచ్చించనుంది. అయితే ఈ ఫెస్టివలు దేశీయ హాట్ ఎయిర్ బెలూన్ ఆపరేటర్లు ఒకరిద్దరికి మాత్రమే అవకాశం కల్పించారు. ఇప్పటికే హాట్ ఎయిర్ బెలూన్ నిర్వహణలో శిక్షణ పొందిన స్థానిక గిరిజన యువకులు అరకు పద్మాపురం గార్డెన్స్ నుంచి వీటిని ఎగురవేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరితో పాటు మరో నాలుగైదు హాట్ ఎయిర్ బెలూన్లు వచ్చి చేరనున్నాయి. అందువల్ల ఈ ఏడాది జరగనున్న అరకు చలి ఫెస్టివల్ హాట్ ఎయిర్ బెలూన్ల సంఖ్య నాలుగైదుకే పరిమితం కానుంది.

అరకులోయలో పారా గ్లైడింగ్

అరకులోయలో పారా గ్లైడింగ్

చలి కాలంలో 'చలి' పండుగ..

ఆంధ్రప్రదేశ్లో అతి శీతల ప్రాంతం పూర్వ విశాఖ జిల్లా మన్యం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతంలో శీతాకాలంలో కొన్ని రోజుల్లో 0 డిగ్రీలకు కూడా రాత్రి ఉష్ణోగ్రతలు క్షీణిస్తుంటాయి. మరికొన్ని రోజుల్లో 5-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దానికి తోడు తుంపర్లను తలపించేలా మంచు బిందువులు కురుస్తూ, ఆహ్లాదాన్ని పంచుతాయి. దీంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి మార్నాడు ఉదయం పది గంటల వరకు బూతద్దం పెట్టి వెతికినా భానుడు కానరాడు. దీంతో అక్కడున్న వారికి వణికించే చలి గిలి పుట్టిస్తుంటుంది. అందుకే అత్యంత రమణయతతో కూడిన ప్రకృతి సోయగాలు, లోయలు, తూర్పు కనుమల పర్వత శ్రేణులు, పచ్చని చెట్లు, పాముల్లా ఒంపులు తిరిగే రోడ్లు, ఆకాశాన్ని తాకడానికి పోటీ పడుతున్నట్టు కనిపించే సిల్వర్ ఓక్ చెట్లు, అందులో గుబురుగా ఉండే కాఫీ తోడలు, జలజల పారే సహజ జలపాతాలు.. ఇలా ఒకటేమిటి లెక్కకు మిక్కిలి అందాలన్నీ అరకు ప్రాంతానికి సొంతం. అందుకే ఈ శీతాకాలం సీజనులో అరకు అందాలను ఆస్వాదించడానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు తెగ ఎగబడుతుంటారు. అలాంటి చల్లటి చలితో కూడిన ఆహ్లాదకర వాతావరణం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో అరకు చలి పండుగకు పర్యాటక శాఖ సన్నద్ధమయింది. దీనికి అల్లూరి సీతారామరాజు (ఏఎస్సార్) జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

'చలి' పండుగలో ఏమంటాయి?

ఈ చలి ఫెస్టివల్కు వచ్చే వారి కోసం జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రత్యేక రవాణా ఏర్పాట్లు, వసతుల కల్పన వంటివి సిద్ధం చేశాయి. దేశం నలుమూలల నుంచి వివిధ గిరిజన తెగల ఉత్పత్తుల స్టాళ్లు, ట్రైబల్ ఫ్యాషన్ షో, ట్రైబల్ ఫుడ్ కోర్టు, పారా గ్లైడింగ్, మారథాన్, సైక్లింగ్, రోజ్ ఫ్లవర్ షో, బస్తర్ బ్యాండ్, అరకు థింసా నృత్యం, వెదురు ఉత్పత్తులు వంటివి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఇంకా ఏడు ఐటీడీఏల నుంచి వచ్చే గిరిజనులు తమ సంప్రదాయ జానపద నృత్యంతో పాటు వారి కళలను ప్రదర్శిస్తారు. హెలి టూరిజానికి కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అరకులో గిరిజనుల సాంస్కృతిక ప్రదర్శన

అరకులో గిరిజనుల సాంస్కృతిక ప్రదర్శన

తొలిరోజు 31న ఐదు కిలోమీటర్ల మారథాన్ రన్, వివిధ రష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో కార్నివాల్, పద్మాపురం గార్డెన్స్లో ఫ్లవర్ షో, రెండో రోజు సైకిల్ ప్రొఫెషనల్స్ 20 కిలోమీటర్ల మేర సైక్లింగ్, ఫ్యాషన్ షో, టాలెంట్ షో, మూడో రోజు వెస్ట్రన్ డ్యాన్స్, పాటలు, వినోదం, బాణసంచా వంటివి ఉంటాయి. ఇంకా ఈ ఉత్సవ్ సందర్భంగా ఫోటోగ్రఫీ, పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలు, సంగీత విభావరి వంటివి కూడా ఉంటాయని ఏఎస్సార్ జిల్లా పర్యాటక అధికారి గరికిన దాస్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికితో చెప్పారు. చలి ఉత్సవ్ మూడు రోజులు అరకు ప్రాంతమంతా విద్యుద్దీప కాంతులతో జిగేల్మంటూ వెలుగులీనుతూ కనిపిస్తుంది. హాట్ ఎయిర్ బెలూన్లలో ఎగరడానికి గతంలో టిక్కెట్టు ధ ర ఒక్కొక్కరికీ రూ.1,500 నుంచి 3 వేల వరకు, పారా గ్లైడింగ్కు రూ.2 వేల వరకు వసూలు చేశారు. ఈసారి వీటి టిక్కెట్టు చార్జి అంతకంటే కాస్త తక్కువే ఉంటుందని చెబుతున్నారు.

చలి పండుగ వేళ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్..

అరకు చలి ఉత్సవ్ సమయం సమీపిస్తున్న తరుణంలో బుధవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూసింది. అందువల్ల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్సవు ప్రారంభించేందుకు అడ్డంకిగా మారుతుంది. అందువల్ల జిల్లా యంత్రాంగమే అరకు చలి పండుగను నిర్వహించాల్సి ఉంటుందన్న మాట!

Read More
Next Story