క్యాష్ తో కొడదాం..
క్యాష్ తో కొట్టడం ద్వారా రఘురామకృష్ణంరాజు పోటీకి ఎటువంటి అడ్డంకులు లేకుండా పోతాయనే ఆలోచనకు చంద్రబాబు, రఘురామ వచ్చినట్లు సమాచారం.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డ్రామాకు ఎప్పుడు తెరపడుతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు సహనాన్ని రఘురామ పరీక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తనకు ఉండి టిక్కెట్ కన్ఫామ్ చేసినట్లు పార్టీ ప్రకటించిందని చెప్పారు. తీరా కనుక్కుంటే ఇంకా పరిష్కారం కాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఈరోజు మీడియాలో రావడం చూసి అందరూ ఉండి టిక్కెట్ రఘురామకు ఇచ్చారనుకున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదని తెలిసి ఆయన అభిమానులు కాస్త నీరసపడినా ఇతర పార్టీల వారు మాత్రం నవ్వుకుంటున్నారు.
ఈ వ్యవహారం చంద్రబాబు, రఘురామ మధ్యనే..
క్యాష్ తో కొడితే సరిపోతుందని అటు చంద్రబాబు, ఇటు రఘురామ వ్యూహం రూపొందించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును ఒప్పించి ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా శాంతింపజేస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. అందుకు అయ్యే ఖర్చు రఘురామ భరించేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మంతెన రామరాజుకు అయిన ఖర్చును రఘురామ భరిస్తానని చెప్పారు. అదే విధంగా ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షరాలుగా వున్న సీతామహాలక్ష్మిని ఎలాగైనా ఒప్పించి ఆమెకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఆమె కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం, ఆమెకు మద్దతు దారులు కూడా ఎక్కువగానే ఉ:డటం వల్ల ఎన్నికల సమయంలో వారిని దూరం చేసుకోవడం మంచిది కాదనే ఆలోచనకు వచ్చారు. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి వర్మకు అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానని రఘురామ చెప్పడంతో పరిస్థితి ఒక కొలిక్కి వచ్చింది.
ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అందువల్ల బుధవారం రఘురామకృష్ణంరాజుకే టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రకటించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నందున ఈ వ్యవహారం కాస్త మరుగున పడింది. ప్రత్యేకించి పుట్టిన రోజు జరుపుకోకపోయినా ఎన్నికల సభలోనూ పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. క్యాష్ వ్యవహారం చంద్రబాబుకు, రఘురామకు మధ్య మాత్రమే ఇప్పటి వరకు ఉంది. టిక్కెట్ ప్రకటించే ముందు ఈ వ్యవహారం సెటిల్ చేయడం మంచిదని, తరువాత ఎవరి నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు.
సోమవారం రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన భార్య ద్వారా తన పేరుతో ఉండి శాసనసభ్యుని పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఎలాగైనా తనకు టిక్కెట్ అందుతుందనే నమ్మకంతోనే ఆయన టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాడని పలువురు నాయకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు జగన్ పై పోరాటం చేస్తూ మనకు సహకరించినందున రఘురామకు మనం టిక్కెట్ ఇవ్వాల్సిందేననే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. రఘురామ పోరాటం టీడీపీకి బాగా ఉపయోగపడిందనే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ వారిలో ఉంది. అందుకే అటు రామరాజును చల్లార్చి, అందరూ కలిసి పనిచేస్తే రఘురామ విజయం తధ్యమని చంద్రబాబు పార్టీ వారికి చెప్పినట్లు తెలిసింది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పి నరసింహరాజుతో పాటు కాంగ్రెస్ నుంచి వేరుశనగ గోపాలకృష్ణ పోటీ చేస్తున్నారు.