ఎమ్మెల్యే  జీతం కథ విందామా...
x

ఎమ్మెల్యే జీతం కథ విందామా...

ఏపీ ఎమ్మెల్యే జీతం ఎంత? ఢిల్లీ ఎమ్మెల్యే జీతం ఎంత? తీసుకుంటున్న జీతానికి తగిన విధంగా పనిచేస్తున్నరా?


అది ఒక చిన్న పల్లెటూరు. ‘రాజుపాలెం.’ ఆ ఊరిలో దాదాపు అందరూ వ్యవసాయం చేసే రైతులే. చదువు రాని వారు కాస్త ఎక్కువ మందే ఉన్నారు. అలాగే బాగా చదువుకున్న వారు కూడా ఉన్నారు. అంటే వ్యవసాయ పట్ట భద్రులు కూడా వ్యవసాయాన్ని ఎంతో సంతోషంగా చేస్తున్నారు. అక్కడ బోగోలు రాజయ్య అనే రైతు ఉన్నాడు. రాజకీయాలంటే ఆయనకు పెద్దగా అవగాహన లేదు. కానీ.. తన ఊరి MLA గారి గురించి మాత్రం తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉండేవాడు. ‘‘MLA గారు ఎంత జీతం తీసుకుంటారు?’’ అని తరచూ అందరినీ అడిగేవాడు.

ఒక రోజు రాజయ్య తన పొలం పనులు పూర్తయ్యాక ఇంటికి వస్తున్నాడు. దారిలో తన స్నేహితుడు నారు వెంకట నారాయణ కనిపించాడు. నారాయణ రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు బాగా తెలుసుకునే వాడు. గ్రామానికి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఆయనతో కలిసి మా ఊరికి ఏమైనా పనులు చేయిస్తున్నారా? ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు. ఎప్పుడు మా ఊరు వస్తారు అని అడిగే వాడు.

‘‘నారాయణన్నా.. MLA గారి జీతం ఎంత ఉంటుందో తెలుసా?’’ అని అడిగాడు రాజయ్య.

నారాయణ నవ్వి,‘‘రాజయ్యా.. MLA గారి జీతం అంటే ఒకటే అనుకుంటున్నావా? అది చాలా రకాలుగా ఉంటుంది. అసలు జీతం, నియోజకవర్గ భత్యం, ప్రయాణ ఖర్చులు, ఇంకా చాలా ఉంటాయి" అని చెప్పాడు.

రాజయ్యకు ఆశ్చర్యం వేసింది. "అంటే.. చాలా డబ్బులు వస్తాయా?’’ అని అడిగాడు.

నారాయణ: ‘‘అలా చెప్పలేము. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ. మన ఆంధ్రప్రదేశ్‌లో, MLA గారి జీతం అన్ని అలవెన్స్ లు కలుపుకుని రెండు లక్షల ముప్పై వేల వరకు ఉందని తెలుసు. కానీ.. అది ప్రజల కోసమే కదా, ప్రజల పనులు చేయడానికి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అందరి దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆయన జీతం డబ్బులు కూడా ఉపయోగిస్తారు." అని వివరించాడు.

రాజయ్యకు కాస్త అర్థమైంది. "అవునా, అంటే MLA గారు ప్రజలకు నిజంగా సేవ చేస్తాడా?" అని అన్నాడు.

నారాయణ: ‘‘ఖచ్చితంగా..! ఓటు వేసి మనం ఎన్నుకున్నాం కాబట్టి, వారు మన సేవకులు. కానీ.. వారు కూడా మనుషులే కదా, వారి ఖర్చులు వారికి ఉంటాయి. అందుకే ప్రభుత్వం జీతం ఇస్తుంది." అని చెప్పాడు.

రాజయ్య: ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యే జీతాలు ఎంత ఉంటాయి?

నారాయణ: ఓ అదా.. త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో నెల జీతం కేవలం 20లు మాత్రమే ఉంది. అదే కేరళలో అయితే 70వేల వరకు తీసుకుంటున్నారు. దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం అందరి కంటే జీతాలు ఎక్కువ. అక్కడ ఎమ్మెల్యే జీతం రెండు లక్షల యాభై వేలు.

రాజయ్య ఇంటికి వెళ్తూ ఆలోచనలో పడ్డాడు. "ఓటు వేసేటప్పుడు మనం ఎవరిని ఎన్నుకుంటున్నామో తెలుసుకోవాలి. వారు మనకోసం పనిచేస్తారా లేదా అని చూడాలి. జీతం ఎంత అని కాదు, వారు మనకు ఎంత సేవ చేస్తారు అనేది ముఖ్యం." అనుకున్నాడు.

ఆ రోజు నుంచి రాజయ్య రాజకీయాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. ఓటరు రాజు అయితే, నాయకుడు ప్రజల సేవకుడు అని అర్థం చేసుకున్నాడు.

రాజయ్య అలా అనుకోవడంలో అర్థం ఉంది. కానీ నేడు ఓటు వేయించుకున్న తరువాత నాయకుడు రాజు అవుతున్నాడు. ఓటు వేసిన తరువాత ఓటరు సేవకుడిగా మారుతున్నాడు.

అదెలా అనుకుంటున్నారా? ఓటు వేయించుకునే ముందు ఊరూరా నాయకుడు తిరిగి బ్రతిమాలో.. బామాలో ఓట్లు వేయించుకుంటాడు. ఆ తరువాత ఓటరు తనకు ఏదైనా సాయం కావాల్సి వస్తే నాయకుడి చుట్టూ తిరుగుతూ కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నాయకుడు రాజు అయ్యాడు. ఓటరు సేవకుడిగా మారాడు.

దేశ రాజధాని ఎమ్మెల్యే జీతం రూ. 30వేలు

దేశ రాజధాని ఢిల్లీలో ఎమ్మెల్యే జీతం రూ. 30వేలు. నియోజకవర్గ అలవెన్స్ లు రూ. 25వేలు. తన సెక్రటేరియట్ నిర్వహణ కోసం రూ. 15వేలు, టెలిఫోన్ ఖర్చుల కింద రూ. 10వేలు, కన్వేయన్స్ కింద రూ. 10వేలు ప్రభుత్వం ఇస్తుంది.

అమరావతి ఎమ్మెల్యే జీతం ఎంత?

ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి రాజధానిలో ఎమ్మెల్యే జీతం రూ. 1.25 లక్షలు. అకామిడేషన్ కోసం అక్కడి పరిస్థితులను బట్టి రూ. 25 వేల నుంచి 50 వేల వరకు ఇస్తారు. ఎమ్మెల్యే గారు చదువుకునేందుకు పుస్తకాలు, మాగజైన్స్ కొనుగోలుకు రూ. 20వేలు, కారు, భవన నిర్మాణానికి అడ్వాన్స్ గా రూ. 10 నుంచి 20 లక్షల వరకు ప్రభుత్వం ఇస్తుంది. ఇవి కాకుండా నియోజకవర్గ అలవెన్స్ లు, కార్య నిర్వహణ అలవెన్స్ లు ఉంటాయి. ట్రైన్ లో ప్రయాణం చేసేందుకు రైల్వే శాఖ ఏసీ ఫస్ట్ క్లాస్ కూపన్స్ ఇస్తుంది. 70,920 కిలో మీటర్ల వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అలాగే విమాన ప్రయాణం, రోడ్డు ప్రయాణానికి కూడా చార్జీలు ప్రభుత్వం పే చేస్తుంది. కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుంది.

ఏపీ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ రిమువల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ -1953 ప్రకారం 2016 వరకు జీతాలు ఉండేవి. 2016 మార్చి 30న అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే జీతాల పెంపు బిల్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిని ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆమోదించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యేగా నాడు ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే జీతాల పెంపును వ్యతిరేకించారు. మనంతకు మనం జీతాలు పెంచుకోవడం కాదని, ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలంటే రెఫరెండం నిర్వహించాలని అన్నారు. ఆయన మాటలను తోసి పుచ్చిన శాసన సభ బిల్లును ఆమోదిస్తూ తీర్మానం పాస్ చేసింది.

చట్ట సభలకు వెళ్లని ఎమ్మెల్యేలు

ప్రజల సమస్యలు చర్చించి, ప్రజలకు మంచి చేయడం కోసం నిర్వహించే చట్ట సభలు కొందరు ఎమ్మెల్యేల దృష్టిలో ఎందుకూ పనికి రాని సభలుగా మారాయి. తమ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయనో, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు. అధికార పక్షం ఏక పక్షంగా బిల్లులు పెట్టి ఆమోదించి చట్టాలు చేస్తుందనే విమర్శలు ఉన్నా.. తమ తరపున చెప్పదలుచుకున్నది ఒక్క నిమిషమైనా సభలో ఎమ్మెల్యే వివరిస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

విద్యావేత్త డాక్టర్ నూకసాని గురునాథం ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ చట్ట సభలకు విలువలు తీసుకు రావాల్సిన ఎమ్మెల్యేలు ఆ సభలకు విలువలు లేకుండా చేస్తున్నారన్నారు. సభను గౌరవించడం లేదంటే చట్టాలను కూడా వారు గౌరవించడం లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ రెండు రోజులు సభకు హాజరై లక్షల్లో జీతం తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో చెప్పటం విశేషం.

Read More
Next Story