
శ్రీశైలం భక్తుల్ని వణికిస్తున్న చిరుత పులి!
పాతాళగంగ వైపు పోవాలంటేనే భక్తులు హడలెత్తుతున్నారు..
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో చిరుతపులి సంచారం స్థానికులను వణికిస్తోంది. శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారి సమీపంలోని జనావాసాల్లోకి గురువారం అర్ధరాత్రి చిరుత ప్రవేశించడం కలకలం రేపింది.
సీసీ కెమెరాకు చిక్కిన చిరుత పాతాళగంగ మెట్ల వైపు సత్యనారాయణ అనే వ్యక్తి రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం అడవికి, కృష్ణా నదికి దగ్గరగా ఉండటంతో క్రూర మృగాల భయం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఆయన అప్రమత్తంగా ఉండి తన ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఒక చిరుతపులి ఆయన ఇంటి ప్రాంగణంలోకి దర్జాగా వచ్చి తిరుగుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రెండోసారి రావడంతో భయం భయం సత్యనారాయణ ఇంటికి చిరుత రావడం ఇది రెండోసారి. పాతాళగంగ మార్గంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట చిరుతపులి జనావాసాల్లోకి రావడంపై భక్తులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే స్థానికులు గజగజ వణికిపోతున్నారు.
అటవీ శాఖ హెచ్చరికలు - సూచనలు
ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ కొన్ని కీలక సూచనలు చేశారు:
రాత్రి వేళల్లో శివారు ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దు.
పిల్లలను బయటకు పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇళ్ల చుట్టూ వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేసుకోవాలి.
పొదలు, చెత్తాచెదారం లేకుండా ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
చిరుతపులిని పట్టుకోవడానికి వెంటనే బోనులు ఏర్పాటు చేయాలని, రాత్రిపూట గస్తీ పెంచాలని అటవీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

