ఎమ్మెల్సీలకు అవమానంపై దద్దరిల్లిన శాసనమండలి
x

ఎమ్మెల్సీలకు అవమానంపై దద్దరిల్లిన శాసనమండలి

వైసీపీ సభ్యుల నిరసనతో హోరెత్తిన మండలి


ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజుకు వరుస అవమానాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు చేసిన ఆందోళనతో శనివారం శాసన మండలి దద్దరిల్లింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. శాసనసభా నాయకుడైన సీఎం చంద్రబాబునాయుడు మండలికి వచ్చి దీనికి సమాధానం చెప్పాలని, చైర్మన్‌ను బేషరతుగా క్షమాపణలు కోరాలని డిమాండ్‌ చేశారు. మండలిలో ఉన్న మంత్రులు సమాధానం చెప్పకుండా దాట వేయడంతో ప్రతిపక్ష స­భ్యు­లు పెద్దపెట్టున నినాదాలుచేశారు.

ఈ అంశంపై ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కి మధ్య సభలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.
సభ ప్రారంభంలోనే వైసీపీ సభ్యులు నల్లకండువాలు వేసుకుని వచ్చి నిరసన వ్యక్తంచేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాలలో ఎమ్మెల్సీల పట్ల వివక్ష చూపుతున్నారని, శాసనమండలిలో భోజనం, కాఫీ సరఫరాలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మధ్య తేడా చూపుతున్నారని శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు సహా అందరూ అంగీకరించారు.
ప్రభు­త్వ తీరుపై చైర్మన్‌ మోషేన్‌రాజు కూడా తీవ్ర అసహనం వ్య­క్తం చేశారు. చైర్మన్‌కు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో మండలిని వాయిదా వేసి ఈ సమస్యను చర్చించాలని కొందరు, టీ బ్రేక్ లో మాట్లాడుకోవాలని కొందరు చేసిన సూచనలపై ఏకాభిప్రాయం రాలేదు. దీంతో సభలో మధ్యాహ్నం 12 గంటల వరకు నిరసనలు, అరుపులు కేకలు, ప్లకార్డుల ప్రదర్శన కొనసాగింది.
సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని, సభ్యులు, ఛైర్మన్ హక్కులను కాపాడాలని నినదించారు.
దళితుడైనందున చైర్మన్‌ను అవమానిస్తారా?: బొత్స
‘‘అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలి చైర్మన్‌ను ఆహ్వానించకపోవడం అన్యాయం. అసెంబ్లీ ప్రాంగణంలో ఏ కార్యక్రమం జరిగినా అసెంబ్లీ స్పీకర్‌తో పాటు మండలి చైర్మన్‌ను ఆహ్వానించాలి. గౌరవించాలి.. కానీ కావాలనే పిలవడం లేదు. ఇలా జరగడం తొలిసారి కాదు.. ఇది చాలా తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. సభా గౌరవానికి సంబంధించిన అంశం. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అంటూ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకూ చైర్మన్‌ను ఆహ్వానించలేదు. లోక్‌సభ స్పీకర్‌ పాల్గొన్న ఆ కార్యక్రమంలో మా లాంటి వారిని పిలిచారా? లేదా? మా సభ్యులను పిలిచారో లేదా అనేది కాదు.. మండలి చైర్మన్‌గా మిమ్మల్ని పిలవాలి కదా? ఎందుకు పిలవలేదు? ఇటీవల జరిగిన ప్రజాప్రతిని«ధుల క్రీడా పోటీలకూ చైర్మన్‌కు పిలుపు లేదు. ప్రభుత్వం తరçఫున అధికారికంగా జరిగే కార్యక్రమాలకు చైర్మన్‌ను పిలవకుండా పదేపదే అవమానిస్తున్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన వారు సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారనే కదా.. కావాలని అవమానిస్తున్నారు. అసెంబ్లీ, మండలి విప్‌ల భవనాల ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను పిలిచి మండలి చైర్మన్‌ను పిలవకపోవడం అన్యాయం. కనీసం శిలాఫలకంపైనా మండలి చైర్మన్‌ పేరు కూడా వేయలేదు.’’ అంటూ శిలాఫలకం ఫొటో చూపిస్తూ బొత్స తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మండలి చైర్మన్‌ను భాగస్వామ్యం చేయకపోవడం చాలా తప్పు అని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనని, క్షమాపణ చెప్పాల్సిందేనని నిలదీశారు. ఈ ఘటనలకు ఎవరు బాధ్య­త వహిస్తారని, రెండు సభలకు నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మండలికి రావాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘ఈ ఆలోచన ఏంటి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చూశామా? మనల్ని మనమే కించపరుచుకుంటే.. ఎలా? ఇదేనా సభాధ్యక్షుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం’’ అంటూ బొత్స అసహనం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలు
చైర్మన్‌ విచారం వ్యక్తం చేయడంతో ఆయనకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. షేమ్‌..షేమ్‌.. సభానాయకుడు వచ్చి వివరణ ఇవ్వాలి.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ మండలిని హోరెత్తించారు. ఈ దశలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేశ్‌ మాట్లాడుతూ ‘‘చైర్మన్‌ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు లేవనెత్తిన అంశం చాలా సున్నితమైనది. ఈ అంశంలోకి కులాలను తీసుకురావడం సరికాదు. ఏం జరిగిందో తెలుసుకుని చక్కదిద్దే యత్నం చేద్దాం. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో స్పీకర్, కార్యదర్శితో మాట్లాడి తెలియజేస్తున్నాం. దీనికి కమిటీ ఉంది. ప్రివిలేజ్‌ కమిటీని అడగండి. మీరు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సరికాదు’’ అంటూ చెప్పుకొచ్చారు. తానిప్పుడే కార్యదర్శితో మాట్లాడానని, విప్‌ల భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించని విషయం తనకు తెలియదు కానీ.. తిరుపతి కార్యక్రమానికి మిమ్మల్ని (చైర్మన్‌ను) పిలిచారని చెప్పారని మంత్రి అచ్చెన్న వ్యాఖ్యానించడంతో చైర్మన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘మంత్రి చెబుతున్న ఈ విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నా.. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇది ముమ్మాటికీ సభను తప్పుదోవ పట్టించడమే. ఏం జరిగిందో సభలో పెట్టండి చర్చిద్దాం. వ్యవస్థ గురించి మాట్లాడేందుకు సిద్ధమైతే కావాలంటే వేరొకర్ని చైర్మన్‌ స్థానంలో కూర్చొబెడదాం’’ అంటూ చైర్మన్‌ పేర్కొన్నారు.
ప్రివిలైజ్‌ కమిటీలో చర్చిద్దామన్న మంత్రులు..క్షమాపణ చెప్పాల్సిందేనన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
మండలిలో ఏ వ్యవహారాలు జరిగినా ప్రభుత్వానికి, సీఎంకు సంబంధాలు ఉండవు. అసెంబ్లీ, మండలిలో ఏ కార్యక్రమం జరిగినా సీఎంకు సంబంధం ఉండదు. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయడం సరికాదు. ఈ అంశాన్ని ప్రివి­లైజ్‌ కమిటీలో పెట్టి మాట్లాడదాం. జరిగిన తప్పు మళ్లీ జరగకుండా చూసుకుందాం’’ అంటూ మంత్రులు అనగానే ప్ర­తి­పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన అవమానాలకు బాధ్యత వహిస్తూ సభానాయకుడు మండలికి వచ్చి చైర్మన్‌కు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో చేసేది లేక మండలిని శనివారానికి వాయిదా వేశారు.
‘చాలా అవమానకరంగా ఉంది’ : మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు
‘ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి..ఈ అంశంపై నేను చర్చించడం బాగుండదు. కావాలంటే ప్యానల్‌ స్పీకర్‌ను కూర్చోబెడతాను. ఇది నాకు చాలా ఎంబరాసింగ్‌గా ఉంటుంది’ అంటూ చైర్మన్‌ మోషేన్‌ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడం బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు.
Read More
Next Story