ఇంటర్వ్యూ కోసం బయలుదేరి మృత్యువు ఒడికి చేరింది
x

ఇంటర్వ్యూ కోసం బయలుదేరి మృత్యువు ఒడికి చేరింది

కూతురి మరణ వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌తో తిరిగి వస్తుందనుకుంటే శవమై వచ్చిందని బోరున విలపిస్తున్నారు.


హోమిని కల్యాణి ప్రస్తుతం ఇంజనీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఫైనల్‌ ఇయ్యర్‌లో ఉండగానే ఉద్యోగం సంపాదించాలని పట్టుబట్టింది. జాబ్‌లో సెటిల్‌ అయిన తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని పరితపించింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్‌ బయలు దేరింది. జాబ్‌ తప్పకుండా వస్తుందని, మీరేమి దిగులు పడొద్దని తల్లిదండ్రులకు చెప్పింది. కూతురుకి జాబ్‌ వస్తుందనే సంతోషంలో వారు ఉన్నారు. కానీ కల్యాణిని దురదృష్టం వెంటాడింది. యముడు ఆమెను వెంటాడాడు. మృత్యువు పగబట్టింది. ఇంటర్వ్యూకెళ్లి జాబ్‌తో సంతోషంగా తిరిగి రావలసిన ఆ యువతి డ్రైవర్‌ చేసిన తప్పుకు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కూతురి మరణాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేక గుండెలు బాదుకుంటున్నారు. కూతురి భవిష్యత్‌ను ఎంతో ఉన్నతంగా ఉంటుందని కలలు కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూతురైనా ఓ కొడుకులా తన కుటుంబానికి అండగా ఉంటుందని ఆశ పడిన ఆ తల్లిదండ్రులను శోక సముద్రంలో మునిగి పోయారు. అత్యంత బాధాకరమైన ఈ దుర్ఘటన విశాఖపట్నం మర్రిపాలెంలో చోటు చేసుకుంది.

విశాఖపట్నం మర్రిపాలెం పార్వతీనగర్‌కు చెందిన రాఘవదాస్‌ రైల్వే ఉద్యోగి. ఆయన భార్య లక్ష్మి గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరిని ఇంజనీరింగ్‌ చదవించాలని ఆశపడ్డారు. పెద్ద కుమార్తె మేఘన ఇటీవలె ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం ఇంటి వద్దే ఉండి ప్రిపేర్‌ అవుతోంది. రెండో కుమార్తె హోమిని కల్యాణి. దువ్వాడలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ మార్చి నాటికి కల్యాణికి కూడా ఇంజనీరింగ్‌ పూర్తి అవుతుంది. అయితే ఆఖరి సంవత్సరంలో ఉండగానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించాలని పట్టుబట్టింది. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్‌ అయింది. ఇంటర్వ్యూ కోసం బుధవారం హైదరాబద్‌కు బయలు దేరింది. బుధవారం రాత్రి ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో కావేరి ట్రావెల్స్‌ బస్సు ఎక్కింది.
అక్కడ నుంచి బయలుదేరి బస్సు రాజమండ్రి గామన్‌ వంతెన వద్దకు రాగానే అదుపు తప్పింది. డ్రైవర్‌ తప్పితం కారణంగా బస్సు పల్టీలు కొట్టింది. ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలి.. జాబ్‌ను ఎలా సంపాదించాలనే ఆలోచనల్లో ఉన్న కల్యాణి.. ఆ ఇంటర్వ్యూకి హాజరు కాకుండానే మృత్యువు ఒడికి చేరింది. బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది వరకు తీవ్రంగా గాయపడగా.. కల్యాణి మాత్రం అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదంలో కల్యాణి బాడీ ఇరుకొన్ని పోయింది. దీంతో ఆమె శరీరం నుజ్జునుజ్జవ్వడం అందరిని కలిచి వేసింది. స్పాట్‌లోనే ప్రాణాలు విడిచిన కల్యాణి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమర్టం అనంతరం కల్యాణి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు గురువారం అప్పగించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంతో తిరిగి వస్తుందని కలలు కన్న తల్లిదండ్రులకు కుమార్తె శవమై రావడంతో ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. కుటుంబమంతా శోక సముద్రంలో మునిగి పోయింది. రాజమండ్రి సమీపంలోని గామన్‌ వంతెన ప్రమాదం కల్యాణి కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
Read More
Next Story