జగన్ హయాంలో జైలుకు వెళ్ళిన టీడీపీ నేతలు వీరే!
x

జగన్ హయాంలో జైలుకు వెళ్ళిన టీడీపీ నేతలు వీరే!

చంద్రబాబు దగ్గరనుంచి చింతమనేని ప్రభాకర్ వరకు అనేకమంది నేతలు జైలుకు వెళ్ళాల్సివచ్చింది. వీరిలో కొందరు నేతలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లు ఆరోపణలున్నాయి.


జగన్ ఓడిపోవటానికి ప్రధాన కారణాలలో కక్షసాధింపు రాజకీయాలు ఒకటి. ఏపీలో కీలకనేతల అరెస్ట్ పర్వం, కక్షసాధింపు పర్వం ఒక అసిధారా వ్రతంలాగా సాగింది. కొన్ని అవినీతి ఆరోపణలు కాగా మరికొన్ని పెట్టుడు కేసులు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దగ్గరనుంచి చింతమనేని ప్రభాకర్ వరకు అనేకమంది తెలుగుదేశం నేతలు వివిధ కేసులపై జైలుకు వెళ్ళాల్సివచ్చింది. వీరిలో కొందరు నాయకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు నేతలను రెండు మూడు సార్లు కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

కోడెల శివప్రసాద్

2019 మేలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షనేతలపై మొట్టమొదటి కేసు మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌పై నమోదు అయింది. అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఆయన తన క్యాంప్ కార్యాలయానికి, గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్‌కు తరలించారన్న ఆరోపణలపై తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో 2019 ఆగస్ట్ 25న కేసు నమోదు అయింది. ఆ తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రస్థాయిలో చోటుచేసుకున్నాయి. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక, కేసు నమోదయిన 20 రోజులకే, సెప్టెంబర్ 16న కోడెల హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

చింతమనేని ప్రభాకర్

వైసీపీ హయాంలో జరిగిన మొదటి టీడీపీ నేత అరెస్ట్ చింతమనేని ప్రభాకర్‌ది. ప్రభాకర్‌ను వైసీపీ ప్రభుత్వం రెండు మూడు సార్లు అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. మొదటి అరెస్ట్ 2019 సెప్టెంబర్ 11న జరిగింది. దళితుడిపై దౌర్జన్యం చేశారని ఎస్టీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. ఆ కేసులో చింతమనేని 64 రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తదితర కారణాలపై వేర్వేరు కేసుల్లో ఆయన జైలుకు వెళ్ళాల్సివచ్చింది.

కింజరాపు అచ్చెన్నాయుడు

అచ్చెన్నాయుడును 2020 జూన్ 11 న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు విషయంలో జరిగిన కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందని ఆరోపణ. అరెస్ట్ ముందు రోజే ఆయనకు సర్జరీ జరిగిందని చెప్పినా పోలీసులు కనికరించలేదు. 12 గంటలపాటు కార్లలో తిప్పి ఏసీబీ కోర్టుకు తీసుకెళ్ళారు. ఆయన ఆసుపత్రిలో చేరేందుకు కోర్ట్ అనుమతి ఇవ్వటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బాగా బ్లీడింగ్ కావటంతో మరోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. 70 రోజుల రిమాండ్ తర్వాత హైకోర్టులో బెయిల్ రావటంతో ఆగస్ట్ నెలాఖరున విడదలయ్యారు.

ఆయనను రెండోసారి పంచాయతీ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సర్పంచ్ గా పోటీ చేస్తున్న అప్పన్న అనే నాయకుడిని బెదిరించారనే ఆరోపణపై అరెస్ట్ చేసి శ్రీకాకుళం జైలుకు తరలించారు. వారంరోజులు జైలులో ఉన్నతర్వాత బెయిల్ రావటంతో బయటకు వచ్చారు. ఆ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలను చూసి కంటతడి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, అప్పుడు చంద్రబాబును అడిగి హోమ్ మంత్రిత్వ శాఖ తీసుకుంటానని, ఎవర్నీ వదిలిపెట్టనని అన్నారు.

రఘురామకృష్ణంరాజు

జగన్ ప్రభుత్వంలో అరెస్టయిన మిగిలిన నేతలంతా టీడీపీవారు కాగా, ఈ రఘురామకృష్ణంరాజు మాత్రం సొంతపార్టీ ఎంపీ. 2019 ఎన్నికల తర్వాత ఈయనకు, జగన్‌కు మధ్య అంతరం ఏర్పడింది. దానితో ఈయన పార్టీలోనే ఉంటూ రోజూ విమర్శలు గుప్పించటం మొదలుపెట్టి జగన్ ఆగ్రహానికి గురయ్యారు.

రఘురామకృష్ణంరాజును 2021 మే 14న పుట్టినరోజునాడే అరెస్ట్ చేశారు. అతనిపై దేశద్రోహం వంటి నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేసిన సీఐడీ పోలీసులు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ, చివరికి మే 14న హైదరాబాద్ లోని ఇంటికి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని, కులాలమధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపణ. దానికి ముందు రాజ్ జగన్‌కు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టుకు ముందే, తనకు ప్రాణహాని ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే, కేంద్రం ఆయనకు రక్షణ కల్పించింది. ఎంపీకి రక్షణగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నాకూడా, వారిని తోసేసి ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ బాస్ సునీల్ కుమార్ తనను చిత్రహింసలు పెడుతూ జగన్‌కు ఫోన్‌వో లైవ్ లో చూపించారని రఘురామ ఆరోపించారు. ఆయన బెయిల్ కోసం దేశంలోనే అత్యుత్తమ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీమ్ కోర్ట్‌లో వాదించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసుకోసం మరో అత్యుత్తమ న్యాయవాది దుష్యంత్ దవేను నియమించుకుంది. రఘురామను ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని మే 17న సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. మే 21న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

జేసీ ప్రభాకరరెడ్డి

అనంతపురం జిల్లాలో వైసీపీని ఢీకొట్టగల సత్తా ఉన్న కుటుంబం జేసీ బ్రదర్స్‌ది. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఏనాడూ జగన్‌ను లెక్కచేసేవాళ్ళు కాదు. పైగా జగన్మోహన్ రెడ్డి అసలు రెడ్డే కాదని, తాము పెద్ద రెడ్లము అని దివాకర్ చులకనగా మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురయ్యారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న జేసీ ప్రభాకరరెడ్డి, అతని భార్య, కుమారుడు అస్మిత్ రెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

జేసీ బ్రదర్స్‌కు చెందిన దివాకర్ ట్రావెల్స్ సంస్థ బీఎస్ 3 వాహనాలను బీఎస్4 గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు ఆరోపణలు. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. 154 బస్సులను నాగాల్యాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణ. ప్రభాకరరెడ్డి, అస్మిత్ రెడ్డి 54 రోజులపాటు కడప జైలులో గడిపి విడుదలయ్యారు.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి

పట్టాభి రెండు సార్లు జైలుకు పంపారు. అతను తరచూ ప్రెస్ మీట్‌లలో అగౌరవంగా సంబోధిస్తూ, పరుష పదజాలంతో దూషించి జగన్ ఆగ్రహానికి గురయ్యాడు. అతనిని 2021 అక్టోబర్ 20న ఇంటి తలుపులు పగలగొట్టి మరీ ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారు. 23న విడుదల అయ్యారు. రెండోసారి 2023 ఫిబ్రవరి 20న గన్నవరం గొడవల విషయంలో అరెస్ట్ జరిగింది. అర్థరాత్రి 2 గం. వరకు 200 కి.మీ తిప్పారని, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో 35 నిమిషాలు చిత్రహింసలు పెట్టారని, ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి కొట్టారని పట్టాభి బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. 2023 మార్చి నాలుగున విడుదలయ్యారు. నాడు తన అరెస్ట్ వెనక ఉన్నాడని చెప్పబడుతున్న ఎస్‌పీ జాషువాకు ఫలితాల మరుసటి రోజు పట్టాభి పుష్పగుఛ్ఛం ఇవ్వటానికి వెళ్ళారు, ఆయన లేకపోవటంతో అక్కడివారికి అందించి వచ్చారు.

దేవినేని ఉమామహేశ్వరరావు

కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన ఘటనలకు సంబంధించి ఎస్సీఎస్టీ అట్రాసిటీతో సహా పలు కేసులు నమోదయ్యాయి. 2021 జులై 27న అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. 2021 ఆగస్ట్ 5 న విడుదలయ్యారు.

చంద్రబాబు నాయుడు

వైసీపీ ప్రభుత్వం చేసిన కీలక అరెస్ట్ చంద్రబాబునాయుడుది. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలెప్‌మెంట్ అక్రమాల ఆరోపణపై 2023 సెప్టెంబర్ 9న నంద్యాల పర్యటనలో ఉన్న బాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడనుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించగా కోర్ట్ ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్కడనుంచి రాజమండ్రి జైలుకు తరలించారు. 52 రోజుల తర్వాత ఆయనకు సుప్రీమ్ కోర్ట్ బెయిల్ మంజూరు చేయటంతో అక్టోబర్ 31న విడుదలయ్యారు. ఈ అరెస్ట్ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవటానికి రాజమండ్రి జైలుకు వెళ్ళి కలిసి కూటమికి శ్రీకారం చుట్టటం ఏపీ రాజకీయ ముఖచిత్రంలో పెను మార్పుకు కారణమయింది.

పై నేతలే కాకుండా టీడీపీ నాయకుడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్‌ను ఎంపీడీవోను దూషించారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. టీడీపీ నేత భూమా అఖిల ప్రియ దంపతులను టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అరెస్ట్ చేసి కర్నూలు జైలుకు పంపారు. వారిద్దరూ వారం రోజుల తర్వాత బెయల్ రావటంతో విడుదల అయ్యారు. వీరే కాకుండా రెడ్డి సామాజికవర్గానికే చెందిన నెల్లూరు నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన రెడ్డప్పగారి మాధవిలను కూడా, జైలుకు పంపలేదుగానీ, వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు హోమ్ మంత్రి పదవిలో ఉన్న ఎస్‌సీ నేత వంగలపూడి అనితను కూడా పోలీసులు అరెస్ట్ చేసిఉన్నారు.

ఇక ఇప్పుడు కూటమి పాలన మొదలయింది. ఈ అరెస్టయిన నేతలంతా తమను అరెస్ట్ చేసిన, చిత్రహింసలు పెట్టిన పోలీస్, సీఐడీ అధికారులపై ప్రతీకార చర్యలు తీసుకుంటారా లేక ఊరుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదంతా కాకుండా, పోలీస్, సీఐడీ అధికారులు నిమిత్తమాత్రులు కాబట్టి, వారిని నడిపించిన సూత్రధారిని టార్గెట్ చేస్తారా అనేది వేచి చూడాలి.

Read More
Next Story