
’చట్టాలు చేసేవాళ్లు చట్టం కంటే ఎక్కువ కాదు‘
ఛైర్మన్ మోషేనురాజు చర్యలు చట్టవిరుద్ధమని, ఆర్టికల్ 14కి, వెడ్నెస్‌బరీ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాపై ఏపీ శాసనమండలి ఛైర్మన్ చర్యలు చట్టవిరుద్ధమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ 2024 నవంబర్ 23న ఇచ్చిన రాజీనామా లేఖపై శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజు ఏడాది పాటు నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టడాన్ని తప్పుపట్టింది. ఈ చర్యలు చట్టవిరుద్ధమని, రాజ్యాంగం అధికరణ 14కి, వెడ్నెస్‌బరీ సూత్రాలకు విరుద్ధమని న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ తేల్చిచెప్పారు.
వైసీపీ కోటా ఎమ్మెల్సీగా గెలిచిన జయమంగళ వెంకటరమణ 2024 నవంబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు. కానీ శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజు దీనిపై ఏడాది దాటినా నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల సెప్టెంబర్ 8న ఆయనకు నోటీసు జారీ చేసి 2025 నవంబర్ 28న విచారణకు హాజరు కావాలంటూ మోషేనురాజు ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ జయమంగళ హైకోర్టును ఆశ్రయించారు. ఇది వరకే దీనిపైన విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తీర్పును గురువారం వెల్లడించింది.
కోర్టు కీలక అభిప్రాయాలు
- రాజీనామాలపై ఛైర్మన్ వివరణ తీసుకున్న తర్వాత 15 రోజుల్లో లేదా గరిష్ఠంగా నెలలోపు తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి.
- విచక్షణాధికారం పేరుతో సహేతుక సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం అధికార దుర్వినియోగమే.
- ఛైర్మన్ చర్యలు 33వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి, రాజ్యాంగ నమ్మకానికి విరుద్ధం.
- “చట్టాలు చేసేవాళ్లు చట్టం కంటే ఎక్కువ కాదు” అని కోర్టు గట్టిగా హెచ్చరించింది.
కోర్టు ఆదేశాలు
- జయమంగళ వెంకటరమణ రాజీనామాపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేసి నిర్ణయం ప్రకటించాలి.
- రాజీనామా స్వచ్ఛందమా కాదా అని విచారించే అధికారం ఛైర్మన్‌కు ఉందని, దాన్ని కోర్టు నిరోధించలేదని స్పష్టం చేసింది.
గతంలోనూ హైకోర్టు ఆగ్రహం
- కేసులో కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు ఛైర్మన్ మోషేనురాజుపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
- రూ.10 వేలు జరిమానా విధించి, ఏపీ న్యాయవాదుల సంఘం గ్రంథాలయానికి జమ చేయాలని ఆదేశించింది. ఆ సొమ్ము ఇప్పటికే చెల్లించారు.
ఈ తీర్పు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. శాసనమండలి ఛైర్మన్ పదవీ బాధ్యతల నిర్వహణలో నిష్పక్షపాతం, సకాల నిర్ణయాలు తప్పనిసరని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.

