
ఆటోడ్రైవర్ల సేవలో ప్రారంభం..2,9లక్షల మంది ఖాతాల్లో 436 కోట్లు జమ
డబ్బులు ఖాతాలో పడ్డాయో లేవో చూసుకోవాలని డ్రైవర్లను సీఎం చంద్రబాబు కోరారు. డబ్బులు పడ్డాయంటూ బ్యాంక్ మెసేజీలను చూపించిన లబ్దిదారులు.
ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు రూ. 15 వేలు చొప్పున రాష్ట్రంలోని 2,90,669 మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ. 436 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. విజయవాడ బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమం జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ బీజేపి అధ్యక్షులు మాధవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2,64లక్షల మంది ఆటోడ్రైవర్లకు, 20,072 ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు.
కూటమి పాలనలో ప్రజల కష్టాలు తీరాయి. సంక్షేమం దరిచేరింది. ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేసి బుకింగ్ లు వచ్చేలా చేస్తాం. ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తాం. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల భవిష్యత్తు కోసం పనిచేస్తాం. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తామని, ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు అన్నారు.
మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి పది మందికి చెప్పండి. ప్రజలంతా ఆనందంగా ఉండటమే కూటమికి కావాల్సింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్ధిక సాయం డ్రైవర్ల ఖాతాల్లో పడ్డాయి. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా ఇవాళ ఆటో డ్రైవర్లు, మాక్సీ క్యాబ్, క్యాబ్ డ్రైవర్లకు పండుగ. గతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డబ్బులన్నీ రిపేర్లకే సరిపోయేవి. జరిమానాలు కూడా వేసి వేధించారు. 2024లో జరిగిన ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఈ స్ట్రైక్ రేట్ ఇంకా పెరగాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.
2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లు జమ చేశాం. ఏ ఒక్కరికి డబ్బులు జమ కాకపోయినా రిపోర్టు చేస్తే ఆర్హతను బట్టి ఖాతాలో వేస్తాం. స్త్రీశక్తి పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మహిళలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి ఇవాళ వేదిక వరకూ వచ్చాను. వారి కుటుంబం కష్ట సుఖాలను తెలుసుకున్నాను. గత పాలకులు అస్సలు పట్టించుకోకపోవటంతో రోడ్లన్నీ గుంతలు పడ్డాయి.
రాష్ట్రంలో 23 వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లను తయారు చేశాం. అన్నా క్యాంటీన్లలో రూ.5కే ఆహారం పెడుతున్నాం. మధ్యాహ్నం పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూడా గత పాలకులు నడవనీయలేదు. విజయవాడలో 90 శాతం వాహనాలు సీఎన్జీ ఇంధనంతోనే నడుస్తున్నాయి. వచ్చే రోజుల్లో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.
గతంలో పెద్ద ఎత్తున జరిమానాలు విధించేవారు... జరిమానాలు భారంగా కాకుండా చూస్తాం. ఆటో, మాక్సి, క్యాబ్ డ్రైవర్లు క్రమశిక్షణగా ఉండాలి. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించవద్దు... ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. క్రమశిక్షణగా ఉండి, ప్రజలకు సౌకర్యం కల్పించండి. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని సీఎం సూచించారు. ఆటోలను దశలవారీగా ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్ర పునర్నిర్మాణం, సుపరిపాలను కేవలం 16 నెలల్లోనే తెచ్చాం. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలో అందరికీ ఉచిత ఆరోగ్య భీమా కల్పించాం. 25 లక్షల వరకూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Next Story