
రుషికుల్య తీరంలో తాబేళ్ల సంద
కూర్మాల కుంభ మేళా!
లక్షలాది తాబేళ్ల రాకతో పులకించిన ఒడిశా తీరం. వారం రోజుల్లో రుషితుల్య బీచ్‌కు 7 లక్షలు. 24 ఏళ్ల తర్వాత ఇది ప్రపంచ రికార్డు అంటున్న నిపుణులు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభ మేళాకు కోట్లాది మంది భక్తజనం ఎగసిపడ్డారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 66 కోట్ల మంది పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఇన్ని కోట్ల మంది భక్తులు తరలి వచ్చి స్నానాలు చేయడం ఓ ప్రపంచ రికార్డు. ఇటు ఒడిశా తీరంలో కూర్మాలు (తాబేళ్లు) కూడా కుంభ మేళాకు ధీటుగా పోటెత్తాయి. లక్షలాదిగా ఇవి ఖండాలు, సముద్రాలు దాటుకుని వచ్చాయి. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ కూర్మాలు కుంభ మేళాను తలపించేలా సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించాయి. ఇంతకీ ఈ తాబేళ్లు స్రుష్టించిన ఆ వరల్డ్ రికార్డు ఏమిటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథనం చదవండి..!
రుషికుల్య తీరంలో తాబేళ్ల సందడి
ఏటా నవంబరు/ డిసెంబరు నుంచి మార్చి నెల వరకు దేశంలోని తూర్పు కోస్తా తీర ప్రాంతాలకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. ఇవి మన దేశ (హిందూ మహా ) సముద్ర జలాల నుంచే కాదు.. ఎక్కడో ఉన్న అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాలను దాటుకుంటూ వస్తాయి. ఇలా వేల కిలోమీటర్లు ఈదుతూ ఈ తీరాలకు చేరుతుంటాయి. అలా అవి ఒడిశాలోని గంజాం జిల్లా రుషికుల్య, కేంద్రపార జిల్లా గహిర్‌మాత తీర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, క్రుష్ణా, బాపట్ల జిల్లాలకు ఇవి తరలి వస్తుంటాయి. సముద్రంలోంచి ఇవి బయటకు వచ్చి ఇసుకలో గోతుల్లా తవ్వి అందులో గుడ్లు పెడతాయి. అవి 45 నుంచి 60 రోజుల్లో పొదిగాక పిల్లలు పుడతాయి. ఇలా 50-60 రోజుల పాటు గుడ్లు పెట్టే ప్రక్రియను కొనసాగిస్తాయి. ఒక్కో తాబేలు 80 నుంచి100 వరకు గుడ్లు పెడతాయి.
మార్గమధ్యంలోనే సంపర్కం..
తమ ప్రాంతం నుంచి గుడ్లు పెట్టడానికి పయనమయ్యే తాబేళ్లు మార్గమధ్యలోనే సంపర్కానికి సిద్ధమవుతాయి. తమ ప్రయాణంలో సముద్రంలో తేలియాడుతూ అవి పరస్పరం సంపర్కం జరుపుకుంటాయి. అనంతరం కొద్ది రోజులకు ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టే దశకు వచ్చినప్పడు తీరానికి చేరుకుని ఇసుక తిన్నెల్లో గోతులు తవ్వి గుడ్లు పెడతాయని విశాఖపట్నంలోని ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ ఐ) జూనియర్ శాస్త్రవేత్త గుమ్మడి వేంకట అంకినీడు ప్రసాద్ *ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్* ప్రతినిధికి చెప్పారు. ఈ తాబేళ్లు డిసెంబర్-జనవరి నెలల్లో సంపర్కంలో చురుగ్గా పాల్గొంటాయి.
గహిర్‌మాత తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు
ఒంటరిగా వస్తాయి.. పిల్లలతో వెళ్తాయి..
ఈ తాబేళ్లు ఆయా దేశాల తీర ప్రాంతాల నుంచి ఎంతో శ్రమకోర్చి తూర్పు కోస్తా తీరాలకు పయనమవుతాయి. అవి ఒంటరిగా బయలుదేరి మార్గమధ్యలో జంటలతో జతకడతాయి. గుడ్లు పెట్టి పొదిగాక పిల్లలతో కలిసి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ఇలా పుట్టిన పిల్లలు కొంతకాలం తర్వాత అవి ఎక్కడ పుట్టాయో మళ్లీ అక్కడకే గుడ్లు పెట్టడానికి రావడం విశేషం! ఈ తాబేళ్లకు మనుషులకంటే ఎక్కువ జ్క్షాపక శక్తిని కలిగి ఉంటాయనడానికి ఇదే నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తీరంలో గుడ్లు పెడుతున్న తాబేళ్లు
ప్రపంచ రికార్డు స్రుష్టించాయిలా..
ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరాలకు వచ్చి గుడ్లు పెట్టడం, ఆ తర్వాత వెళ్లిపోవడం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. అయితే ఈసారి అసాధారణంగా వచ్చిన తాబేళ్ల సంఖ్యే ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒడిశాలోని రుషికుల్య, గహిర్‌మాత తీర ప్రాంతాలకు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అంటే వారం రోజుల వ్యవధిలో 6,98,718 తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టినట్టు ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఇప్పటివరకు తాబేళ్లు రాలేదని గడచిన 24 ఏళ్ల రికార్డులను బట్టి తేల్చారు. 2001లో రుషికుల్య తీరానికి 7,41,00 వేల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వచ్చిన సంఖ్యే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఈ ఏడాది కేవలం వారం రోజుల్లోనే 6,98,718 తాబేళ్ల రాకతో ఇప్పడు సరికొత్త ప్రపంచ రికార్డుకు ఆస్కారం ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో మరో మూడు లక్షల తాబేళ్లు అక్కడకు వచ్చే అవకాశం ఉందని సముద్ర అధ్యయన నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. 2023 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు 6,37,000, 2022 మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు 5,50,317 తాబేళ్లు రుషికుల్య తీరానికి వచ్చినట్టు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి.
అక్కడికే ఎక్కువగా ఎందుకొస్తాయి?
ఒడిశాలోని రుషికుల్య, గహిర్‌మాత తీర ప్రాంతాల్లో అలల తాకిడి తక్కువగా ఉంటుంది. తాబేళ్ల సంరక్షణపై జనానికి అవగాహన కల్పిస్తారు. అందువల్ల అక్కడి స్థానికులు తాబేళ్ల ప్రశాంతతకు భంగం కలగనీయరు. అంతేకాదు.. అక్కడ అనుకూల వాతావరణ పరిస్థితులతో పాటు ఒడిశా ప్రభుత్వం ఈ తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆ తీర ప్రాంతాల్లో గతంకంటే ఎక్కువ విస్తీర్ణంలో సంరక్షణ ఏర్పాట్లు చేసింది. అక్కడ మెరైన్ శాంక్చురీని విస్త్రుతం చేసింది. ఇంకా ఆ పరిసరాల్లో మత్స్యకారులు చేపలవేట నియంత్రణ చర్యలు తీసుకుంటుంది. ఫలితంగా ఈసారి రికార్డు స్థాయిలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వచ్చాయని ఒడిశా అధికారులు చెబుతున్నారు.
విశాఖ తీరంలో తాబేళ్ల సంరక్షణ కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ?
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని తీర ప్రాంతాలకు కూడా ఏటా ఆలివ్ రిడ్లే తాబేళ్లు వస్తుంటాయి. ప్రధానంగా విశాఖపట్నం ఆర్కే బీచ్, జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్, చేపలుప్పాడ, పెదనాగమయ్యపాలెం, అనకాపల్లి జిల్లా పూడిమడక, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లా హోప్ ఐలండ్, పశ్చిమ గోదావరి జిల్లా చినమైనవానిలంక, బాపట్ల వంటి తీర ప్రాంతాల్లో తాబేళ్లు గుడ్లు పెడుతుంటాయి. దీంతో అటవీ శాఖ అధికారులు ఆయా చోట్ల తాబేళ్ల సంరక్షణ చర్యలు చేపట్టారు. ఇటీవల విశాఖ జిలా్లలో 262 నెస్ట్‌ల్లో 26,630 గుడ్లు, విజయనగరంలో 213 నెస్్టల్టో 23,632, బాపట్లలో ఐదు చోట్ల 607, మైనవానిలంక వద్ద 4,400, హోప్ ఐలండ్‌లో 85 గుడ్లను పొదగడానికి వీలుగా అధికారులు సంరక్షించారు. ఇలా ఈ రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 2.5 లక్షల తాబేళ్ల గుడ్ల భద్రతకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నందున వీటిని అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. ఇప్పుడు లక్షల సంఖ్యలో అవి గుడ్లు పెట్టడానికి వస్తుండడంతో వీటి మనుగడపై జంతు, పర్యావరణ ప్రేమికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.