లేడీ అఘోరీని బలవంతంగా తెలంగాణా దాటించిన పోలీసులు
ఎక్కడినుండి వచ్చిందో తెలీని లేడీ అఘోరి(Lady Aghori) దాదాపు 15 రోజులు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.
కొద్దిరోజులుగా తెలంగాణాలో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీని పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటించారు. ఎక్కడినుండి వచ్చిందో తెలీని లేడీ అఘోరి(Lady Aghori) దాదాపు 15 రోజులు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు పోలీసులు లేడీ అఘోరీను తెలంగాణా(Telangana) సరిహద్దులు దాటించి మహారాష్ట్ర(Maharashtra)లో వదిలిపెట్టారు. మామూలుగా జనాలకు అఘోరా(Aghora)లు అంటే నెగిటివ్ భావమే ఉంది. అఘోరాలను ఎక్కువమంది జనాలు అరుంధతి(Arundhati) లాంటి సినిమాల్లో మాత్రమే చూసుంటారు. అదికూడా శ్మశానాలు, నెగిటివ్ పాత్రల్లో చూడటంతో జనాల్లో చాలామందికి అఘోరాలంటే వ్యతిరేకభావం పెరిగిపోయింది. సినిమాల్లో కాకుండా అఘోరాలను జనాలు చూసేది కుంభమేళా సమయంలో మాత్రమే. అలాంటి అఘోరా అందులోను లేడీ అఘోరీ తెలంగాణాలో ప్రత్యక్షమవ్వటంతో జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తెలంగాణాలోకి అడుగుపెట్టిన అఘోరీ తెలుగు స్వచ్చంగా మాట్లాడటంతో జనాలు మరింతగా షాకయ్యారు. ఎందుకంటే అఘోరాలు ఉత్తరభారతానికి సంబంధించిన వాళ్ళే అన్న భావనలో జనాలుంటారు.
అఘోరాలను జనాలు ఎక్కువగా కాశీ(Kasi) లాంటి ఉత్తరాధిలోని పుణ్యక్షేత్రాల్లోనే చూడగలరు. ధక్షిణాదిలో అఘోరాల ఉనికి చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి అఘోరా అందులోను లేడీ అఘోరీ పైగా తెలుగు మాట్లాడుతున్న అఘోరీ ప్రత్యక్షమవ్వటంతో జనాలందరిలో ఉత్సుకత పెరిగిపోయింది. అఘోరీ గురించి వివరాలు ఆరాతీస్తే లేడీ అఘోరీ మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం కుసనపల్లి గ్రామానికి చెందినదిగా తెలిసింది. ఇంటినుండి ఎప్పుడు వెళ్ళిపోయిందో, ఇంటి నేపధ్యం ఏమిటో ? ఇంతకాలం ఎక్కడ గడిపిందో ? అఘోరాగా ఎందుకు మారిందో ? ఇపుడు సడెన్ గా ఎందుకు తెలంగాణాలో ప్రత్యక్షమైందో కూడా ఎవరికీ తెలీదు. రావటం రావటమే సికింద్రాబాద్(Secunderabad) లోని ముత్యాలమ్మ దేవాలయం(Mutyalamma Temple)కు వెళ్ళింది. ఈ దేవాలయంకే ఎందుకు వెళ్ళిందంటే ఈమధ్య కొంతమంది దేవాలయంపై దాడిచేసి అమ్మవారి విగ్రహం చేతులు విరగొట్టిన విషయం తెలిసిందే. అమ్మవారి విగ్రహంపై దాడిచేసి చేతులు విరగొట్టడం అప్పట్లో పెద్ద సంచలనమైంది.
పై ఘటనకు సంబంధించి హిందుత్వ సంఘాలకు పోలీసులకు రెండుమూడు రోజులు పెద్ద గొడవలే అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ వేడి చల్లారుతోంది. ఇలాంటి సమయంలో లేడీ అఘోరీ నేరుగా ముత్యాలమ్మ దేవాలయంకు వెళ్ళి పూజలు చేసింది. ఎప్పుడైతే అఘోరీ దేవాలయంలో పూజలు చేస్తోందని తెలియగానే జనాలతో పాటు మీడియా కూడా అక్కడ వాలిపోయింది. మీడియాను చూసిన లేడీ అఘోరీ దేవాలయంపైన దాడిచేసినా హిందువులు ఎందుకు సహించి ఊరుకుంటున్నారని సూటిగా ప్రశ్నించింది. అలాగే మశీదులపైన దాడిచేసి కూల్చేసినపుడే హిందువులు గొప్పొళ్ళని ఒప్పుకుంటానని చేసిన ప్రకటన సంచలనమైంది. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అఘోరీ ఒంటిపైన ఒక్క నూలుపోగు కూడా లేదు. మెడలో రుద్రాక్షలు మాత్రమే ధరించిన ఈ లేడీ అఘోరీ ఒంటికి బూడిద పూసుకున్నారు. జుట్టును తలపైన ముడేసింది. విచిత్ర వేషధారణతో కనిపిస్తుండటంతో జనాలంతా అఘోరీ ఎక్కడ తిరుగుతుంటే అక్కడ పెద్దఎత్తున గుమిగూడేవారు. దాంతో ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తింది.
కొండగట్టు, వేములవాడ దేవాలయాలను దర్శించుకున్న లేడీ అఘోరీ మళ్ళీ ముత్యాలమ్మ దేవాలయంకు చేరుకున్నది. మశీదులను కూల్చకపోతే తాను ఈ దేవాలయంలోనే ఆత్మార్పణ చేసుకుంటానని చేసిన ప్రకటన జనాలు, మీడియాలో ఉత్సుకతను నింపగా పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. లేడీ అఘోరీ మీద ఎవరెప్పుడు దాడులు చేస్తారో అని హడలిపోయిన పోలీసులు అఘోరీకి నలుగురు పోలీసులను ఎస్కార్టుగా ఉంచారు. దాంతో పోలీసుల రక్షణ మధ్యనే అఘోరీ నగరంలో తిరిగింది. అఘోరీ ఎక్కడ తిరిగినా గుమిగూడిన జనాలను కంట్రోల్ చేయలేక పోలీసులు నానా అవస్తలు పడ్డారు. ఇక లాభంలేదని అనుకున్న పోలీసులు లేడీ అఘోరీని ఆమె స్వంత ఊరు కుసనపల్లికి తీసుకెళ్ళి గృహనిర్భందంలో ఉంచారు. నాలుగురోజుల పాటు లేడీ అఘోరీని పోలీసులు ఇల్లుదాటి బయటకు వెళ్ళనివ్వలేదు. లేడీ అఘోరీని చూడాలని, కలిసి మాట్లాడాలని జనాలు, మీడియా ఎంత ప్రయత్నించినా పోలీసులు అనుమతివ్వలేదు. ఇంటిదగ్గర కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ మొదలైపోయింది.
తెలంగాణాలోనే అఘోరీ ఉంటే సమస్యలు మరింత పెరగటం ఖాయమని అర్ధమైన పోలీసులు భారీ ఎస్కార్ట్ ఏర్పాటు చేసి తెల్లవారుజామునే ఎవరి కంటా పడకుండా అఘోరీని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో పోలీసులు తెలంగాణా సరిహద్దులు దాటించి మహారాష్ట్ర(Maharashtra)లో వదిలిపెట్టేశారు. తెలంగాణా పోలీసు(Telangana Police)లు మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడి విషయాన్ని వివరించి అక్కడ ఒక వాహనం ఏర్పాటుచేయించి అందులో కూర్చోబెట్టి అక్కడినుండి గుర్తుతెలీని ప్రాంతానికి పంపేసి ఊపిరిపీల్చుకున్నారు. మరి మహారాష్ట్రలో లేడీ అఘోరి ఎక్కడ తిరుగుతున్నదో తెలీదు.