కొత్త లేబర్ కోడ్‍లు: ఏపీలో కార్మికుడికి జరిగే మేలు ఏమిటీ?
x

కొత్త లేబర్ కోడ్‍లు: ఏపీలో కార్మికుడికి జరిగే మేలు ఏమిటీ?

2026 నుంచి అమలు చేసేలా రాష్ట్ర కార్మిక శాఖ కసరత్తు, PFలో జరిగే మార్పు ఏమిటీ?


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్స్ అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుంకట్టింది. 2026 జనవరి నుంచి ఈ మార్పులు అమల్లోకి తెచ్చేలా రాష్ట్ర కార్మిక శాఖ సమాయత్తమైంది. ఈ మార్పులపై రాజకీయ, కార్మిక వాదనలు పక్కనపెడితే, ఒక సాధారణ కార్మికుడి దృష్టిలో నిజంగా కొత్తగా ఏమి వస్తోంది? ఇప్పటివరకు ఉన్న హక్కుల్లో ఏమి మారుతోంది? అన్న ప్రశ్నలు కీలకంగా మారాయి.
పాత చట్టాలు ఎందుకు మార్చాల్సి వచ్చింది?
ఇప్పటివరకు దేశంలో ఎన్నడూ ఆచరణకు నోచుకోని 29 వేర్వేరు లేబర్ చట్టాలను కలగలిపి నాలుగు కోడ్స్ కిందకు తీసుకువచ్చారు. ఒకే అంశంపై వేర్వేరు చట్టాలు ఉండడం, కేంద్ర–రాష్ట్ర నిబంధనల మధ్య స్పష్టత లేకపోవడంతో వాటిని మార్చామని కేంద్రం చెబుతోంది. ఒక కార్మికుడికి వర్తించే చట్టాలు ఏవో తెలియని పరిస్థితి ఉందని, ఆ గందరగోళాన్ని తగ్గించేందుకు, చట్టాలను సమీకరించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్రం చెబుతోంది.
ఉదాహరణకు విశాఖపట్నం ఫ్యాక్టరీ కార్మికుని పీఎఫ్ ఎలా మారుతుంది?
విశాఖపట్నంలోని ఒక ఫార్మా యూనిట్‌లో పనిచేసే కార్మికుడికి నెల జీతం ₹20,000 అనుకుందాం. ఇప్పటివరకు వేతనంలో బేసిక్ తక్కువగా చూపించి, మిగతా మొత్తం అలవెన్సులుగా చూపించే విధానం ఉంది.
కొత్త కోడ్‍ల ప్రకారం, బేసిక్ వేతనం కనీసం 50 శాతం ఉండేలా నిర్వచనం స్పష్టమవుతుంది. దీని ఆధారంగా పీఎఫ్ లెక్కింపు జరుగుతుంది.

దీంతో, నెలకు పీఎఫ్ కి కట్టే మొత్తం పెరుగుతుంది. చేతికి వచ్చే జీతం కొద్దిగా తగ్గవచ్చు. కానీ రిటైర్మెంట్ తర్వాత లభించే మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది.
2026లో EPFO 3.0ను ప్రారంభించేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ఈ అప్‌గ్రేడ్ ద్వారా
– పీఎఫ్ ఉపసంహరణలు వేగంగా జరగడం
– ఉద్యోగుల పెన్షన్ స్కీమ్–1995 కింద పెన్షన్ ఫిక్సేషన్ సులభతరం కావడం
– ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్–1976 కింద బీమా క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరించటం అన్న లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది.
ఇది కొత్త హక్కు కాదు, ఉన్న పీఎఫ్‌ను కొత్త విధంగా లెక్కించే ప్రయత్నం మాత్రమే.
ఇంకో ఉదాహరణ చూద్దాం.. శ్రీ సిటీలోని ఒక ఎలక్ట్రానిక్స్ యూనిట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడిని తీసుకుంటే, ఇప్పటివరకు అతడికి పీఎఫ్, ఇన్సూరెన్స్ పూర్తిగా అందని సందర్భాలు ఉన్నాయి.
కొత్త కోడ్‍ల ఉద్దేశం ప్రకారం... కాంట్రాక్ట్ కార్మికులను కూడా సోషల్ సెక్యూరిటీ పరిధిలోకి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించే అవకాశం ఉంటుంది
అంటే – ఇది ఇప్పటివరకు పూర్తిగా అమలుకాని హక్కును క్రమబద్ధం చేయాలన్న ప్రయత్నంగా చూడవచ్చు.
విజయవాడలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసే ఉద్యోగికి రోజుకు 8 గంటల పని దినం ఉంది. కొత్త కోడ్‍ల ప్రకారం అది రోజుకు ఇన్ని గంటలు చేయాలనే దానికన్నా వారానికి 48 గంటలు చేయాల్సి ఉంటుంది. నాలుగు రోజులు ఎక్కువ గంటలు పనిచేసి, మూడు రోజులు సెలవు తీసుకునే విధానం సాంకేతికంగా సాధ్యం అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది తప్పనిసరి కాదు. అదనపు పని చేస్తే అదనపు డబ్బు (ఓవర్‌టైమ్ చెల్లింపులు) నిబంధనలు కొనసాగుతాయి.
గిగ్ వర్కర్ కి ఎలా లాభమంటే...
ఉదాహరణకు గుంటూరులో ఉండే రామచంద్ర ఫుడ్ డెలివరీ బాయ్. యాప్ ద్వారా పనిచేసే గిగ్ వర్కర్. ఇప్పటివరకు సంప్రదాయ కార్మిక చట్టాల పరిధిలోకి రాలేదు.
కొత్త కోడ్‍లలో:
గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లను గుర్తించారు. సోషల్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ రూపొందించారు. ఇది వెంటనే లాభంగా మారుతుందా? అన్నది రాష్ట్ర స్థాయిలో అమలు విధానంపై ఆధారపడి ఉంటుంది.
ఆదాయపన్ను: నెల జీతంపై ప్రభావం ఉంటుందా?
ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగికి ఆదాయపన్ను విషయమై పెద్ద మార్పు ఉండదు. పన్ను చట్టాలు వేరు, లేబర్ కోడ్‍లు వేరు. కానీ వేతన చట్రం మారితే , పన్ను కట్టాల్సిన ఆదాయం లెక్కలో స్వల్ప తేడా రావచ్చు.
సెలవులు, భద్రత, ఆరోగ్యం వంటి నిబంధనలు, జాగ్రత్తల ఎప్పటి మాదిరే ఉంటాయి.
కొత్త కోడ్‍లలో –
భద్రత, ఆరోగ్యం, మహిళా కార్మికుల రక్షణ, ప్రమాదాల నివారణ వంటివన్నీ ఒకే చట్టంలో పొందుపరచడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ కార్మికుడికి నేరుగా కనిపించే మార్పులు చూస్తే... పీఎఫ్ లెక్కల్లో స్పష్టత, సోషల్ సెక్యూరిటీ పరిధి విస్తరణ ప్రయత్నం, వర్కింగ్ అవర్స్‌లో సౌలభ్యం, చట్టాల భాషలో ఏకరీతి ఉంటుంది. అయితే ఈ మార్పులు చట్టంలో ఉండటం వేరు, అమల్లోకి రావడం వేరు అన్న విషయం కూడా స్పష్టమే.

కొత్త లేబర్ కోడ్‍లు ఆంధ్రప్రదేశ్ కార్మికుడి జీవితంలో ఒక్కసారిగా పెద్ద మార్పులు తీసుకురావడం కన్నా, ఇప్పటివరకు విడివిడిగా ఉన్న వ్యవస్థను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ మార్పుల ఫలితం చివరకు రాష్ట్ర ప్రభుత్వ అమలు విధానంపైనే ఆధారపడి ఉంటుంది.
2026 సమీపిస్తున్న వేళ, లేబర్ సంస్కరణలు కీలక మలుపులో నిలిచాయి. ఒకవైపు ప్రభుత్వం అమలును వేగవంతం చేస్తోంది. మరోవైపు ట్రేడ్ యూనియన్లు ఈ మార్పులు కార్మిక రక్షణలను బలహీనపరుస్తున్నాయని వాదిస్తూ ఎదురుదాడికి సిద్ధమవుతున్నాయి.
Read More
Next Story