
కర్నూలు జిల్లా గిరిజన తండాలో ‘షైనింగ్ స్టార్’
ఎవ్వరూ పట్టించుకోని ఓ మారు మూల గిరిజన గ్రామంలో విద్యా కుసుమాలు పూయించిన టీచర్ కథ.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని ఒక మారుమూల సుగాలి గిరిజన గ్రామం జెఎం తండా. ఇది కల్యాణి కుమారి జీవితంలో ఒక మలుపు తిరిగిన చోటు. ఈ గ్రామం సుగాలి తెగకు చెందిన దాదాపు 100 కుటుంబాలతో ఉంది. చాలా మంది అక్షరాస్యులు. వలస కార్మికులు. మామిడూరు కల్యాణి కుమారి ఒక సెకండరీ గ్రేడ్ టీచర్. పత్తికొండ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ నుంచి 2017 సెప్టెంబర్‌లో బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగానే బదిలీ జరిగింది. కానీ ఆమె కెరీర్‌లో జరిగిన ఒక గొప్ప మార్పుకు నాంది పలికింది. ఆమె గతంలో పనిచేసిన స్కూలుకు తిరిగి వెళ్లే అవకాశం లేని పరిస్థితుల్లో ఆమెకు ఈ గ్రామంలోని పాడుబడిన మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూలును పునరుద్ధరించడం తప్ప మరో మార్గం లేదు. ఇది ఆమె జీవితంలో ఒక సవాలుగా మారింది. కానీ ఆమె అంకితభావం దాన్ని అవకాశంగా తీసుకుని ముందుకు సాగింది.
ఇద్దరి నుంచి 50 మందికి..
ఆ స్కూలు పరిస్థితి హృదయవిదారకం. 2017లో ఆమె చేరినప్పుడు నామమాత్రంగా రిజిస్టర్ లో పేర్లు ఉన్న వారు 14 మంది విద్యార్థులు. కేవలం ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌గా స్కూలుకు వచ్చేవారు. భవనం పాడుపడి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేక, జిల్లా అధికారులు స్కూలును మూసివేయాలని భావిస్తున్నారు. గ్రామస్తులు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం లేక, పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు, లేదా పనులకు పంపిస్తున్నారు. అప్పట్లో స్కూలు చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. నేను, నా భర్త కలిసి పిచ్చి మొక్కలు తొలగిస్తుంటే వీళ్లెవరు పిచ్చొళ్లు అన్నట్లుగా మావైపు చూసుకుంటూ స్థానికులు వెళ్లే వారు అని కల్యాణి కుమారి చెప్పారు.
ఈ పరిస్థితిని మార్చడానికి మానవీయ కోణంతో కల్యాణి ప్రయత్నించారు. ఆమె ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడి, వారి హృదయాలను గెలుచుకున్నారు. ‘‘తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపడానికి సంశయిస్తున్నారు. చాలా మంది అక్షరాస్యులు. నేను వారి దృక్పథాన్ని మార్చాలనుకున్నాను. ప్రభుత్వ స్కూళ్లు నాణ్యమైన విద్యను అందించగలవని నిరూపించాలనుకున్నాను’’ అని ఆమె చెప్పారు.
'మా తోలి అడుక్కు' ప్రోగ్రామ్‌తో..
స్కూలును బాగుచేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలు అద్భుతం. తన సొంత డబ్బుతో బుక్స్, స్టేషనరీ కొని పిల్లలకు అందించారు. ‘స్టార్ ఆఫ్ ది వీక్’ అనే ప్రోగ్రామ్ ప్రారంభించి, హోంవర్క్, అటెండెన్స్, డిసిప్లిన్, హైజీన్ వంటి పారామీటర్ల ఆధారంగా విద్యార్థులను రివార్డ్ చేసేవారు. పుట్టిన రోజుల్లో స్వీట్స్ బదులు సబ్బులు ఇచ్చి హైజీన్‌ను ప్రోత్సహించారు. మనబడి నాడు-నేడు స్కీమ్‌లో స్కూలును చేర్చి, రెనోవేషన్ చేయించారు. ఇది ప్రభుత్వ సహాయంతో జరిగినా ఆమె అంకితభావమే కీలకం. ఫలితంగా 2017లో 14 మంది నుంచి 2020-21 నాటికి 53 మందికి, తర్వాత 55 మందికి ఎన్‌రోల్‌మెంట్ పెరిగింది. 24 మంది విద్యార్థులు గురుకుల స్కూళ్లలో, ఒకరు జవహర్ నవోదయ విద్యాలయంలో అడ్మిషన్ పొందారు. స్కూలు డ్రాపౌట్స్ లేకుండా, 100 శాతం ఎన్‌రోల్‌మెంట్ సాధించింది.
స్థానికుల సహకారం ఆమె విజయానికి మూలం. ఆమె డోర్ టు డోర్ క్యాంపెయిన్‌తో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపడం ప్రారంభించారు. పెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహించి, కమ్యూనిటీని ఇన్‌వాల్వ్ చేశారు. స్వచ్ఛ ఆంధ్ర ఇనిషియేటివ్‌లో గ్రామస్తులు పాల్గొన్నారు. 'మా తోలి అడుక్కు' ప్రోగ్రామ్‌తో (తెలుగులో "మా మొదటి అడుగు" అని అర్థం. ఇది గిరిజన పిల్లలకు విద్యా అవకాశాలను అందించడం, వారి మొదటి అడుగులను స్కూలు వైపు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుంది.) అట్టడుగు పిల్లలకు స్లేట్స్, పెన్సిల్స్ అందించారు. గ్రామస్తులు, స్థానిక నాయకులు ఆమె ప్రయత్నాలను ప్రశంసించారు. పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాం బాబు స్కూలును సందర్శించి, రిసోర్సెస్ అందించి, ఆమెను సన్మానించారు.
'షైనింగ్ టీచర్'గా గుర్తింపు..
ఆమెను 'స్ఫూర్తిదాయక ఉపాధ్యాయురాలు' లేదా 'షైనింగ్ టీచర్'గా గుర్తించడానికి కారణాలు ఆమె 8 సంవత్సరాల అంకితభావం. సింగిల్ టీచర్‌గా స్కూలును జిల్లాలో ఉత్తమమైనదిగా మార్చడం. విద్యార్థుల విజయాలు, కమ్యూనిటీ డెవలప్‌మెంట్. స్కూలు మార్చిన తర్వాత, దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వ్యాధులపై 'దోమ పుట్ట వద్దు – దోమ కుట్ట వద్దు' అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. "ఒక్క దోమ కాటు జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. మెడికల్ ఖర్చులు భారీగా ఉంటాయి. పిల్లలు ఇది అర్థం చేసుకుంటే, వారు తమ కుటుంబాలకు సందేశం అందిస్తారు. తమను తాము రక్షించుకుంటారు," అని ఆమె చెప్పారు. ఇది తల్లిదండ్రులు, గ్రామస్తులు, స్థానిక నాయకుల నుంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది.
'మా తోలి అడుక్కు' కేవలం స్టేషనరీ అందించడం లేదా ఎన్‌రోల్‌మెంట్ పెంచడం కాదు. ఇది ఒక మారుమూల గిరిజన గ్రామంలో విద్య ద్వారా ఆత్మవిశ్వాసం, ఆశను నింపిన చొరవ. కల్యాణి మాటల్లో... "విద్య అంటే టెక్స్ట్‌బుక్స్ మాత్రమే కాదు, జీవితాలను రక్షించడం, భవిష్యత్తును రూపొందించడం." ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆమె పిల్లలను స్కూలుకు తీసుకు రావడం మాత్రమే కాక, గ్రామస్తులను విద్య విలువను అర్థం చేసేలా చేసింది. ఈ కార్యక్రమం ఆమె అంకితభావానికి, మానవీయ దృక్పథానికి నిదర్శనం. ఇది సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించింది.
2025 సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆమెకు ప్రత్యేక గౌరవం లభించింది. సెప్టెంబర్ 7, 2025న వచ్చిన మీడియా కవరేజ్ ఆమె ప్రయత్నాలను మరింత హైలైట్ చేసింది.
మంచి పనులు చేసిన వారికి ఆగస్ట్ 15న అవార్డులు ఇస్తున్నామని, మీ పనితీరును మీడియా ద్వారా వివిధ పత్రికల్లో చూశామని, మీరు అవార్డుకు దరఖాస్తు చేయాలని మునిసిపల్ కమిషనర్ సూచించారు. దాంతో ఆమె అవార్డుకు దరఖాస్తు చేశారు. సాధారణంగా టీచర్లకు ఈ కార్యక్రమంలో అవార్డులు ఇచ్చే అవకాశం లేదు. అయినా ఆమెకు ఈ అరుదైన గౌరవం దక్కింది.
విద్యామంత్రి లోకేష్ ఇంటికి పిలిపించి అభినందించారు...
కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్ చూసి విద్య శాఖ మంత్రి లోకేష్ స్పందించారు. ట్విటర్ లో ఆమె గురించి ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూసిన కలెక్టర్ డీఈవో ద్వారా టీచర్ కు ఫోన్ చేయించి మాట్లాడారు. ఆమె 8 ఏళ్ల కాలంలో ఆ స్కూలు బాగు కోసం తీసుకున్న చర్యల గురించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నారు. కలెక్టర్ ఆమె గురించి విద్యాశాఖ మంత్రికి మరింత సమాచారం అందించారు. దీంతో ఆ టీచర్ తో స్వయంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడాలని తన నివాసానికి జూలై 2న పిలిపించారు. స్కూలును అత్యున్నతంగా తీర్చి దిద్దటంలో మీ పాత్ర గురించి చెప్పాలని టీచర్ కల్యాణి కుమారిని మంత్రి అడిగారు. ఆమె మంత్రిని కలిసిన టెన్షన్ లో ప్రత్యేకంగా తాను చెప్పేదేముంది సార్ అందరు టీచర్ల లాగే తానూ అక్కడ పనిచేశాను, అని చెప్పారు. కాదమ్మా... మీరు అక్కడికి వెళ్లిన తరువాత మొదట చేసిన పని ఏమిటి అన్న ప్రశ్న నుంచి మొదలు పెట్టి జరిగినదంతా చెప్పారు. ఆమె చెప్పిన విషయాలన్నీ మంత్రి ప్రత్యేకంగా రాసుకున్నారు. అది నా జీవితంలో ఎంతో విలువైన రోజుగా భావిస్తున్నానని కల్యాణి ‘ది ఫెడరల్’ ప్రతినిధికి చెప్పారు.
మంత్రి నారా లోకేష్ ఆమెను 'షైనింగ్ టీచర్' అవార్డుతో సన్మానించారు. "సింగిల్ టీచర్‌గా ఇంత ఎన్‌రోల్‌మెంట్ పెంచడం చరిత్రాత్మకం," అని లోకేష్ ప్రశంసించారు. 2022లో 75వ అజాదీ కా అమృత్ మహోత్సవ్ బెస్ట్ టీచర్ అవార్డు, 2025లో ఉగాది పురస్కారం లభించాయి.
విద్య అంటే టెక్ట్స్ బుక్స్ మాత్రమే కాదు...
స్కూలు, స్థానికుల గురించి కల్యాణి చెప్పిన మాటలు ఆమె మానవీయతను చూపిస్తాయి. "ఒకప్పుడు కష్టాల్లో ఉన్న స్కూలు ఇప్పుడు గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్‌గా మారింది. విద్యార్థులు అకడమిక్‌గా రాణిస్తున్నారు. గ్రామస్తులు హెల్త్ ఇనిషియేటివ్‌లలో పాల్గొంటున్నారు. విద్య అంటే టెక్స్ట్‌బుక్స్ మాత్రమే కాదు, జీవితాలను రక్షించడం, భవిష్యత్తును రూపొందించడం, ఆత్మవిశ్వాసం నింపడం." అని స్థానికులు అర్థం చేసుకున్నారు. ఆమె ప్రయత్నాలు మారుమూల గ్రామాల్లో విద్యా విప్లవానికి స్ఫూర్తి. కల్యాణి లాంటి ఉపాధ్యాయులు సమాజానికి ఆశాకిరణాలు. మానవీయ విలువలతో మార్పును సాధించడం కష్టం కాదని నిరూపించారు.
ఉద్యోగ జీవితం ఎలా ప్రారంభమైందంటే...
కర్నాటక బార్డర్ లోని నాగర్ కన్వీ గ్రామంలో టీచర్ గా 2010 నవంబర్ లో మొదటి పోస్టింగ్ కల్యాణికి లభించింది. ఆ గ్రామం కూడా గిరిజన గ్రామం. అక్కడ తెలుగు భాష మాట్లాడే వారు లేరు. అంతా కన్నడ మాట్లాడతారు. సెల్ ఫోన్ సిమ్ లు కూడా ఏపీ నుంచి తీసుకున్నవి సరిగా పనిచేయవు. కర్నాటక రాష్ట్రంలో తీసుకున్న సిమ్ లే పనిచేస్తాయి. అక్కడ కొంతకాలం పనిచేసిన తరువాత అక్కడి నుంచి హలోంగ్వద మండలంలోని పొలుగుంద గ్రామానికి బదిలీ అయింది. పత్తికొండకు రోడ్డు పాయింట్ నుంచి రెండున్నర కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఐదు సంవత్సరాలు అక్కడ కల్యాణి పనిచేశారు. 5 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. ఆరు నెలల కాలం పత్తికొండ రోడ్డు పాయింట్ వద్ద బస్ దిగి రెండున్నర కిలో మీటర్లు నడిచి వెళ్లే వారు. ఆ తరువాత ఆమె స్కూటర్ కొనుక్కున్నారు. అక్కడ ఐదేళ్లు పూర్తయిన తరువాత జరిగిన బదిలీల్లో పత్తికొండలోని రాజీవ్ నగర్ స్కూలుకు బదిలీ చేశారు.
ఇటీవల జరిగిన రేషనలైజేషన్ లో అక్కడ పోస్టు పోయింది. దీంతో ఆమెను అక్కడి నుంచి జేఎం తాండా స్కూలుకు బదిలీ చేశారు. పత్తికొండ నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. రోడ్డు పాయింట్ నుంచి ఒక కిలో మీటర్ నడిచి వెళ్లాల్సిందే. గ్రామస్తులంతా ఆ కిలో మీటర్ దూరం నడిచే వెళుతుంటారు.
తాండాలో ఎక్కువ మంది అక్షరాస్యులు
జేఎం తాండాలో ఎక్కువ మంది అక్షరాస్యులు. సుమారు 20 సంవత్సరాల నుంచి అక్షరాస్యుల సంఖ్య పెరిగింది. పిల్లలు చదువుకుని ప్రయోజకులుగా మారుతూ వచ్చారు. చదువుకున్న వారంతా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉద్యోగాలు రావడంతో పట్టణాల్లోనే ఎక్కవ మంది ఉంటున్నారు. గ్రామంలో ప్రస్తుతం సుమారు 600 మంది జనాభా ఉన్నారు. అక్కడి సామాజిక వర్గం కేవలం సుగాలీలు (లంబాడీ). పొలం పనులు, కూలి పనులు చేస్తుంటారు. స్కూలు సరిగా పనిచేయని రోజుల్లో ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించే ఆర్థిక స్తోమత లేని వారు తమతో పాటు పనులకు తీసుకెళ్లే వారు.
గతంలో స్కూలు ఎలా ఉండేదంటే...
తాండా కావడంతో ఇక్కడ సారా కూడా ఎక్కువగానే ఉంటుంది. మారుమూల గిరిజన గ్రామం కావడం వల్ల తాగటానికి పట్టణం, ఇతర గ్రామాల నుంచి ఎక్కువ మంది వచ్చే వారు. మద్యం మత్తులో చాలా మంది స్కూలు ముందు పడిపోయే వారు. మత్తు నుంచి తేరుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయే వారు. కల్యాణి స్కూలుకు టీచర్ గా వచ్చిన మొదటి రోజుల్లో ఆమెకు ఇవే దృశ్యాలు రోజూ దర్శన మిచ్చేవి. ఇద్దరు పిల్లలు మాత్రమే స్కూలుకు వచ్చే వారు. మిగిలిన పిల్లలు పత్తికొండలోని ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్లే వారు.
పిల్లల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచి...
ప్రైవేట్ స్కూల్స్ కు పోకుండా మీ గ్రామంలోని స్కూల్లోనే చదువు చెప్పించాలని తల్లిదండ్రుల వద్దకు రోజూ వెళ్లి కల్యాణి చెప్పటం మొదలు పెట్టింది. ఆ విధంగా తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను ప్రైవేట్ స్కూలు నుంచి మాన్పించడానికి సుమారు ఏడాది కాలం పట్టింది. ప్రభుత్వం ఇచ్చే డ్రస్ ను రోజూ ఉతికించి పిల్లలు స్నానం చేసి స్కూలుకు వచ్చేలా తల్లిదండ్రుల్లో మార్పు తీసుకు రాగలిగారు. స్నానం చేయకుండా స్కూలుకు వస్తే దోమలు, దుర్వాసన వారిలో ఎక్కువవుతుందని, దీని ద్వారా పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ప్రతి రోజూ స్నానాలు చేయించాలని తల్లిదండ్రులకు నచ్చ జెప్పింది. ఆ మేరకు ఆమె వారికి కావాల్సిన సబ్బులు కొనుగోలు చేసి ఇవ్వటం మొదలు పెట్టారు.
ప్రైవేట్ స్కూలుకు పుల్ స్టాఫ్...
టీచర్ పై నమ్మకం పెంచుకున్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించడం ఆపివేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూలుకు రావడం మొదలు పెట్టారు. అప్పటి వరకు తాగి స్కూలు ముందు పడిపోయే వారు తగ్గిపోయారు. స్థానికులే స్కూలు ముందు ఎవ్వరూ తాగవద్దని పట్టుబట్టి తాగే వారిని అక్కడికి వెళ్లకుండా చేశారు. స్కూలు ముందు తాగుతుంటే టీచరమ్మకు, పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అక్కడికి మద్యం ప్రియులను పోకుండా తండా వాసులు నిరోధించారు. దీంతో ఆ స్కూలు పిల్లల్లో వెలుగులు మొదలయ్యాయి. మా స్కూలుకు వచ్చే జెఎం తాండా పిల్లలు ఎందుకు రావటం లేదని తండాకు కొంత మంది ప్రైవేట్ స్కూల్స్ వారు వచ్చారు. ప్రభుత్వ స్కూలు జరుగుతున్న తీరును చూసిన తరువాత మరు మాట్లాడకుండా అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు.
సెలవు పెడితే ముందురోజే చెప్పేవారు..
ఈరోజు నేను స్కూలుకు సెలవు పెడుతున్నాను. వేరే టీచర్ వస్తారు. మీరంతా స్కూలుకు క్రమం తప్పకుండా రావాలని చెప్పేవారు. తల్లిదండ్రులకు కూడా తాను సెలవు పెడుతున్న విషయం చెప్పేవారు. పిల్లలకు కుర్చీలో కూర్చుని చదువు చెప్పటం కాకుండా వారితో పాటే కింద కూర్చుని చదువు చెప్పేవారు. వారు తప్పకుండా పలికేలా చేసే వారు. ఒకటో తరగతిలోనే వారి పేరు వారు రాసుకునేలా చేసే వారు. ఒక రోజు ఆర్డీవో రాజ్యలక్ష్మి ఆ స్కూలుకు విజిట్ కు వచ్చారు. అందరూ ఏదేదో చెబుతున్నారు. అది ఎంతవరకు నిజం అని తెలుసుకునేందుకు వచ్చారు. ఆమె పిల్లలను ప్రశ్నించడం మొదలు పెట్టారు. కొందరిని ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. దానికి అర్థం చెప్పాలని ఆర్డీవో ప్రశ్నిస్తే మేము తెలుగులో చెబుతామని ఒక విద్యార్థి చెప్పిన సమాధానానికి ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నేను ఒక స్కూలుకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రశ్నిస్తే కనీసం చదవటం కూడా సరిగా రాలేదని ఆమె స్కూలులో చెప్పి ఆశ్చర్య పరిచారు. స్కూలుపై ప్రత్యేక రిపోర్టును కలెక్టర్ కు ఆర్డీవో పంపించారు.
తమ కుమారుడుకు బాంబే ఐఐటీలో సీటు వచ్చింది. ఆ సందర్భంగా మా ఇంటి ముందుకు గుర్తుగా ఒక చెట్టు నాటాము. ఇప్పుడు పెద్దైంది. ఆ చెట్టు గురించి పిల్లలకు చెప్పాము. తండాలో ప్రది ఇంటి ముందూ ఒక మొక్క చొప్పున 50 మొక్కలు నాటించాము. పిల్లలు నాటిన మొక్కలుకు నీళ్లు పోసే బాధ్యత వారి తల్లిదండ్రులదేనని చెప్పారు. వారు క్రమం తప్పకుండా ఆ మొక్కలు పెంచుతున్నారు అని కల్యాణి చెప్పారు. పర్యావరణం గురించి చెబుతుంటే తండా వాసులు ఆశ్చర్యంగా వినే వారని ఆమె తెలిపారు.
కంప్యూటర్ ద్వారా రైమ్స్ చెప్పించే వారు...
ల్యాప్ టాప్ ను కల్యాణి రోజూ స్కూలుకు తీసుకొచ్చి రైమ్స్ చెప్పేవారు. ఇంటర్ నెట్ ద్వారా ఎలా చదువుకోవాలి. క్రమశిక్షణ ఎలా ఉండాలనేది నిత్యం కంప్యూటర్ లో చూపించే వారు. కంప్యూటర్ ద్వారా చూపించి నిత్యం వారిలో ఎలా ఉండాలో మార్పు తీసుకొచ్చారు. జెఎం తాండా కు ఇద్దరు అనంతపురం విద్యార్థులు వచ్చారు. తాండాలో బాగా చదువు చెబుతున్నారని తెలుసుకున్న జెఎం తాండా వాసుల బంధువులు తమ ఇద్దరు పిల్లలను జెఎం తాండాలో బంధువుల వద్ద ఉంచి చదివిస్తున్నారు. అక్కడికి సమీపంలోని బాట తాండా నుంచి కూడా ఇద్దరు పిల్లలు నిత్యం జెఎం తండా స్కూలుకు వస్తున్నారు. ఇలా స్కూలులో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ప్రైవేట్ స్కూల్స్ లాగే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు హోం వర్కు ఇచ్చి రాయించే వారం అందువల్ల విద్యార్థులు ఎక్కడంటే అక్కడ తిరగటం మానేసి చక్కగా హోం వర్క్ రాసుకొచ్చే వారు. ఎవరైనా రాసుకు రాకుంటే స్కూలులోనే వారి చేత హోంవర్క్ రాయించే దానిని దాని వల్ల కూడా విద్యార్థుల్లో చదువుకోవానే ధ్యాస పెరిగిందని ఆమె తెలిపారు. విద్యార్థి పుట్టిన రోజును గుర్తు చేస్తూ బోర్డుపై వారి పేరు టీచర్ రాసే వారు. పుట్టిన రోజుకు చాక్లెట్స్ కాకుండా ఒక సబ్బు కొనుగోలు చేసి విద్యార్థికి ఇచ్చే వారు అందరి చేత హ్యాపీ బర్తడే చెప్పించే వారు. దీంతో విద్యార్థుల్లో మంచి స్నేహభావం కూడా పెరిగింది. ఆర్డీటీ వాళ్లు నిర్వహించే క్విజ్ పోటీల్లో మా స్కూలు పిల్లలకు తప్పకుండా ప్రైజులు వచ్చేవని టీచర్ తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం గురించి వారికి పూర్తిగా వివరించి చెప్పేదానిని, అందుకే పిల్లలకు ప్రభుత్వ పథకాల గురించి బాగా తెలుసునని కల్యాణి చెప్పారు.
పుచ్చకాయమాడ కు బదిలీ
కల్యాణి కుమారి జెఎం తాండా నుంచి పుచ్చకాయమాడ స్కూలుకు బదిలీ అయ్యారు. ఇంకా జెఎం తాండా నుంచి రిలీవ్ కాలేదు. ఈ విషయం తెలుసుకున్న తండా వాసులు ఎలాగైనా కలెక్టర్ ను కలిసి కల్యాణి టీచర్ ను మా స్కూలు నుంచి ట్రాన్స్ ఫర్ చేయొద్దని, వెంటనే ఆపివేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వారికి కల్యాణి నచ్చజెప్పారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు బదిలీలు తప్పవని, వచ్చే టీచర్ తో పిల్లలకు చదువు చెప్పించుకునే బాధ్యత మీపైనే ఉందని ఆమె తండా వాసులకు చెబుతున్నారు.