
‘హైకోర్టు’ కావాలంటూ కర్నూలులో న్యాయవాదుల బైక్ ర్యాలీ
డిఆర్ వొకు వినతిపత్రం
కర్నూలు హై కోర్టు సాధన సమితి (KHSS) ఆధ్వర్యంలో శ్రీ బాగ్ ఒప్పందం (Sribagh Pact) ప్రకారం కర్నూలులో ఏపీ హై కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా కోర్టు నుండి కలెక్టర్ కార్యాలయానికి బైక్ ర్యాలీ సాగింది. అక్కడ నిరసన చేపట్టి చాలా కాలంగా పెండింగులో ఈ హామీని అమలుచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిఆర్ వో కి వినతి పత్రం అందచేశారు.
కర్నూలు పట్టణం రాజకీయ బాధితురాలు. ఎవరికీ పెద్దగా పట్టని చక్కటి నగరం. ఈ పట్టణానికి జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరి చేయాలని, పట్టణాన్ని అభివృద్ధి చేయాలని గతంలోనే కాదు ఇప్పటి ప్రభుత్వాలకు లేదు. పార్టీలకు అతీతంగా అంతా కర్నూలుకు అన్యాయం చేస్తూనే ఉన్నారు.
1953లో ఆంధ్రరాష్ట్ర ఏర్పడినపుడు కర్నూలు రాజధాని గా ఉండింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పిడినపుడు తెలుగు వాళ్ల ఐక్యత కోసం రాజధాని హైదరాబాద్ కు మార్చేందుకు ఈ ప్రాంత ప్రజలు అంగీకరించారు. దీనికి పరిహారంగా అపుడే ఒక హైకోెర్టునో బెంచ్ నో ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఎవరూ ఆ విషయం ఆలోచించలేదు.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినపుడు రాజధానిని కర్నూలు తీసుకురావాలని యోచించి ఉండవచ్చు. అసలు అది పెద్ద చర్చనీయాంశమే కాలేదు. కొంత మంది అరిచినా అది పెద్దగా వినిపించలేదు. రాష్ట్రానికి మధ్యలో కొత్త రాజధాని అనే సాకుతో ఎక్కడో గుంటూరు జిల్లా కృష్ణాతీరానికి రాజధాని తరలించారు. అపుడు వెంటనే కర్నూలుకు హైకోర్టు కేటాయించివుండవచ్చు. అధమం హైకోర్టు బెంచ్ కేటాయించి ఉండవచ్చు. అయితే, 2104-19 మధ్య హైకోర్టు ఇచ్చి కర్నూలుకు న్యాయం చేయాలన్న చర్చేలేదు. అమరావతి దగ్గిర రాజధాని అని అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నపుడు అధికార పార్టీ గాని, ప్రతిపక్ష పార్టీగాని కర్నూలును గుర్తుచేసుకోలేదు.
తర్వాత 2019-2024 మధ్య కర్నూలు న్యాయ రాజధాని అనే టాక్ వచ్చింది. దానికి చాలా అడ్డంకులు వచ్చాయి. కాకపోతే, కర్నూలు వార్తల్లోకెక్కిందని సంతోషించాలి. ఇపుడు బెంచ్ గురించి అపుడపుడు వినబడుతున్నది తప్ప ఫైల్ కదులుతున్న దాఖలాలేదు
ఇలా ప్రతిప్రభుత్వ హయాంలో కర్నూలు అన్యాయానికి గురవుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో కర్నూలు న్యాయవాదులు చిన్నగా నైనా బైక్ ర్యాలీ తీసి కర్నూలు పట్టణం ఒకటుంది. దానికి ఈ రాష్ట్రం బాగారుణ పడి ఉంది, రాజధానిని కోల్పోయిన ఈ అమాయక రాయలసీమ నగరానికి హైకోర్టును కేటాయించండం న్యాయం అని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ వినతి పత్రం డిఆర్ ఒ టేబుల్ మీది నుంచి ముఖ్యమంత్రి పేషీదాకా వెళ్తుందని అందరి ఆశ.