కర్నూలు ప్రమాదం కలచివేసింది..నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని
x

కర్నూలు ప్రమాదం కలచివేసింది..నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

కర్నూలు బస్సు ప్రమాదం చాలా బాధాకరమని రాష్ట్రపతి ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో స్లీపర్ బస్సు (సుమారు 40 మంది ప్రయాణికులతో) ఒక బైక్‌ను ఢీకొట్టడంతో ముందు భాగంలోని ఇంధన ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది, దీంతో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, నష్ట పరిహారం ప్రకటన

ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. బాధితులు, వారి కుటుంబాలతో నా ఆలోచనలు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని జాతీయ ఆపదా రక్షణ నిధి (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

రాష్ట్రపతి ముర్ము సంతాపం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. " ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ సి.పి. రాధాకృష్ణన్ కూడా "ఈ దుర్ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి" అని స్పందించారు.

Read More
Next Story