
ఎస్సీల వర్గీకరణకు ఆంధ్రా ఆర్డినెన్స్ బాగుంది, కానీ...
అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాల వారికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే సుప్రీమ్ కోర్టు జడ్జిమెంట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్ మెంట్ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లరాదు...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణ పై నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసు చేసిన రోస్టర్ పాయింట్ల విధానం,అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాల వారికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే సుప్రీమ్ కోర్టు జడ్జిమెంట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్ మెంట్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ అన్నారు.
ఎస్సీ కులాలలో మొదటి గ్రూప్ అయిన రెల్లి అనుబంధ కులాల వారికి ఒక్క (1) శాతం,రెండవ గ్రూప్ మాదిగ అనుబంధ కులాల వారికి ఏడు (7) శాతం, మూడవ గ్రూప్ అయిన మాల అనుబంధ కులాల వారికి ఏడు (7) శాతం వచ్చేటట్టుగా వెంటనే సవరించాలని రాజీవ్ రంజన్ మిశ్రా కమీషన్ కు,రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ దీనిని సవరించని పక్షంలో జరిగే అన్యాయాన్ని సరిదిద్దించుకోవడానికి మాదిగలు న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుందని కృపాకర్ మాదిగ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి బుధవారం నాడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ చెయ్యడానికి నిర్ణయించడాన్ని స్వాగతించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న రోజు ఇది అనీ, రెల్లి,మాదిగ అనుబంధ కులాల విద్యార్థినీ, విద్యార్థులు, నిరుద్యోగులు ఈ వర్గీకరణ ఆర్డినెన్సు ద్వారా వచ్చే విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనీ కృపాకర్ మాదిగ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
ఈ ఆర్డినెన్సు సాధన వెనక ఎంతో మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ప్రాణ త్యాగాలు ఉన్నాయి.వేలాది మంది కార్యకర్తల,నాయకులు వృత్తి,ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు దూరమై దశాబ్దాల తరబడి చేసిన కృషీ,త్యాగాలు ఉన్నాయి.ఈ విజయం వీరందరిదీ.మరీ ముఖ్యంగా మాదిగ ప్రజలది, ఎస్సీల్లోని సంచార,అర్ధ సంచార కులాల వారందరిదీ అని ప్రకటిస్తున్నాము.
వర్గీకరణ కోసం 1997 జూన్ లో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం 68-69 నంబర్ల జీవోలను జారీ చేసింది.కాగా, జాతీయ ఎస్సీ కమీషన్ ను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలను జారీ చెయ్యడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ఉల్లంఘనలకు పాల్పడటమేనని వర్గీకరణ వ్యతిరేకులు రాష్ట్ర హైకోర్టు లో ఈ జీవోలను కొట్టి వేయించారు.కాగా,ఈ జీవోల పరిరక్షణ కోసం 1997లోనే, నాటి చంద్రబాబు ప్రభుత్వము సుప్రీమ్ కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.ఏక నాయకత్వం పేరుతో ఉన్న మందకృష్ణ ఈ స్పెషల్ లీవ్ పిటీషన్ ను ఉపసంహరించుకునేలా నాటి ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి ఉండకపోతే,మాదిగలకు అప్పుడే న్యాయం జరిగి ఉండేది.ఇన్ని దశాబ్దాల సమయము,త్యాగాలు చెయ్యాల్సిన అవసరం మాదిగ,రెల్లి అనుబంధ కులాల వారికి లేకపోయి ఉండేది.మాదిగలను లబ్దిదారులు కానీయకుండ నిత్యం ప్రతిపక్షంలో ఉంచి,వర్గీకరణ అంశాన్ని అంతులేని కథగా మార్చి,ఒక్కడి పబ్బం గడుపుకునే మంద కృష్ణ కుట్రలకు కార్యకర్తలు, నాయకులు,లక్షలాది మాదిగ ప్రజలు బలై,దశాబ్దాలుగా వారి విద్య,ఉద్యోగ, సంక్షేమ హక్కులకు దూరమయ్యానీ ఈ సందర్భంగా కృపాకర్ మాదిగ మంద కృష్ణ పై నిప్పులు చెరిగారు.