ఇంటిపేరులోనే ‘కూన’.. దూకుడులో ఎందాకైనా!
x
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఇంటిపేరులోనే ‘కూన’.. దూకుడులో ఎందాకైనా!

కూన వివాదం పార్టీకి నష్టం తెచ్చే ప్రమాదాన్ని ఊహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన నుంచి వివరణ కోరారు.


అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన ఆగడాలు ఆగవంటారు.. ఆయన గురించి తెలిసిన వారు. పవర్‌తో పనిలేకుండా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ప్రత్యర్థి రాజకీయ నేతలను సైతం అదుపు తప్పి విమర్శలు గుప్పిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, దూషించడం, బూతు పురాణం అందుకోవడం వంటివి ఎప్పట్నుంచో అలవాటు చేసుకున్నారు. అలా దూకుడు, దుందుడుకు స్వభావంతో పాటు తరచూ వివాదాస్పదుడిగా మారుతూ తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌. తాజాగా ఆ జిల్లా పొందూరు మండలం లోలుగు కేజీబీవీ ప్రిన్సిపాల్‌ ఆర్‌.సౌమ్య వ్యవహారం ఎమ్మెల్యే కూనను డిఫెన్స్‌లో పడేసింది. అమె మహిళ, పైగా దళితురాలు కావడంతో ఈ వివాదం సున్నితంగా మారి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పట్నుంచి వివాదాస్పద నాయకుడిగా పేరు తెచ్చుకున్న కూన.. గతంలో చేసిన ఆగడాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. వాటిలో మచ్చుకు కొన్ని..


శ్రీకాకుళం సీఐపై విరుచుకుపడుతున్న కూన రవికుమార్‌ (ఫైల్‌)

రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పొందూరు విద్యుత్‌ శాఖ ఏఈ ఒకరిని ఆయన ఫోన్‌లో బెదిరించారు. ‘కాస్త మర్యాదగా ఉద్యోగం చేయడం నేర్చుకో. నీకు సర్వీసు లేదా? ఉద్యోగం చేయవా? నాకే రూల్సు చెబుతావా? తమాషాలు దొబ్బుతున్నావా? విద్యుత్‌ మీటర్‌ విసయంలో నా మనిషికి నోటీసిస్తావా? డిస్కనెక్ట్‌ చేయ్‌.. జీవితంలో ఇంత పెద్ద తప్పు చేశానా? అని బాదపడే రోజు వస్తుంది నీకు. ఎవడా డీఈ? నా కొడుకు.. ఆడికి చెప్పు. మళ్లీ నీకు చెబుతున్నా.. వెధవ్వేషాలేశావా? మళ్లీ జీవితంలో కోలుకోలేవు..’ అంటూ రెండేళ్ల క్రితం అప్పటి ఏఈ దుర్గా ప్రసాద్‌పై దూషణల పర్వం అందుకున్నారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కూన రవి.
2021 నవంబరులో తన అనుచరులతో కూన రవికుమార్‌ టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నిరసనకు దిగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ‘నా ఇంటి లోపలకు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు విరగ్గొడతా. రేప్పొద్దున్న నీ యూనిఫాం లేకుండా చేస్తా. ఆఫ్టర్‌ టూ అండ్‌ ఆఫ్‌ ఇయర్స్‌ నీ ఉద్యోగం ఉండదు. గుర్తు పెట్టుకో.. నీ అంతు చూస్తా ఏమనుకుంటున్నావో? అంటూ శ్రీకాకుళం సీఐ ఆర్‌ఈసీహెచ్‌ ప్రసాద్‌పై రెచ్చిపోయారు.
గతంలో పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలో సరుబుజ్జిలి ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీలకు వార్నింగ్‌ ఇచ్చారు. ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తా.. నన్నెవరూ ఆపలేరు.. చెట్టుకు కట్టేసి కాల్చేస్తా’ అని హెచ్చరించారు.
పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా లాక్కుని వచ్చి తన్నుతా’నంటూ పంచాయతీ కార్యదర్శులను భయపెట్టారు.
ఇంకా ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్‌చార్జి ఈవోపీఆర్‌డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
మట్టి అక్రమంగా తరలించిన వాహనాలను విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దారు తామరాపల్లి రామకృష్ణపై బెదిరింపులకు దిగారు. పట్టుకున్న వాహనాలను వదలకపోతే లంచం డిమాండ్‌ చేశావని కంప్లైంట్‌ చేస్తా. చెప్పు ఎంతకావాలి? పదివేలా? లక్షా?’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేజీబీవీ ప్రిన్సిపాల్‌ సౌమ్య

తాజాగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు కేజీబీవీ కళాశాల ప్రిన్సిపాల్‌ సౌమ్య వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆమె మీడియా ముందుకు రావడం పెను దుమారాన్ని రేపుతోంది. ఇన్నాళ్లూ కూన ఆగడాలకు భయపడి అధికారులు ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయడానికి సాహసించలేదు. సౌమ్య మాత్రం తెగించి కూన ఆగడాలను మీడియా ఎదుట ఏకరువు పెట్టారు. జిల్లా కలెక్టర్‌ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర, జాతీయ ఎస్సీ కమిషన్‌ల దృష్టికీ తీసుకెళ్లారు. దీంతో ప్రిన్సిపాల్‌ సౌమ్యపై టీడీపీ సానుభూతిపరులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌమ్య సోమవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడామె శ్రీకాకుళం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
ఎమ్మెల్యే ‘కూన’ ఏమి చెబుతారో మరి!
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. కేజీబీవీ ప్రిన్సిపాల్‌ వ్యవహారంపై తాను వచ్చాక అన్ని విషయాలు మీడియాకు చెబుతానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఆమె తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకుని మంగళవారం తన నియోజకవర్గానికి రానున్నారు. సౌమ్య ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే కూన ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కూన వివాదం పార్టీకి నష్టం తెచ్చే ప్రమాదాన్ని ఊహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన నుంచి వివరణ కోరారు. దీంతో ఆయన ఆగమేఘాల మీద అమెరికా నుంచి తిరిగి వస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సౌమ్యకు దళిత సంఘాలు అండగా నిలిచాయి. ఆమె తరఫున ఎందాకైనా పోరాడటానికి సిద్ధమని ప్రకటించాయి.
Read More
Next Story