కుంభమేళా గర్ల్‌ మోనాలిసా కొంప ముంచారుగా!
x

కుంభమేళా గర్ల్‌ మోనాలిసా కొంప ముంచారుగా!

వాడో తాగుబోతు.. వాణ్ణి నమ్మి ఈ అమాయకులు ఆ పిల్లను వాడితో పంపారు. వాళ్లను చూస్తుంటే జాలేస్తోంది అంటున్నాడు హాలివుడ్ నిర్మాత ఆ కథేంటో చదవండి


ఆమె అందాన్ని చూసి మురిసిపోయారు.. మోనాలిసా అని పేరు పెట్టారు. పొగిడారు.. సినిమా అన్నారు.. హాలివుడ్ అన్నారు.. 21లక్షల నగదన్నారు.. ముంబైలో ట్రైనింగ్ అన్నారు.. డైరెక్టర్ ఆ అమ్మాయి వాళ్ల ఇంటికెళ్లారు. కాంట్రాక్ట్ కుదిరిందన్నారు. ఇక ఆ అమ్మాయి సినీ హీరోయిన్ అయిపోయినట్టే అని టాంటాం వేశారు. ఇప్పుడంతా ఒట్టిదేనని తేల్చారు ఓ సినీ నిర్మాత. దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు- ఓరి మీ అమ్మకడుపులు మాడా.. మా పిల్లను ఎందుకు కాకుండా చేశారు కదరా అని తిట్టిపోస్తున్నారు.
అసలింతకీ ఏమైందంటే...
మహాకుంభమేళాలో పూసలమ్ముకునే ఓ పేదింట పిల్ల చాలా అందంగా కనిపించింది. ఓ వీడియో గ్రాఫర్ ఆమె ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి మోనాలిసా అని పేరు పెట్టారు. కొన్ని లక్షల మంది క్షణాల్లో చూశారు. చివరకు ఆ అమ్మాయి ఈ వీడియోగ్రాఫర్లు, యుట్యూబర్ల తాకిడికి తట్టుకోలేక ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఓ హాలివుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. ఆ అమ్మాయికి తాను తీయబోయే బాలివుడ్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నానని ప్రకటించారు. ఆ అమ్మాయి వాళ్ల ఊరికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పందపత్రంపై సంతకం కూడా చేయించుకున్నారు.
కుంభమేళా – ఇది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణమే కాకుండా, ఎన్నో మనుషుల జీవితాలను మార్చిన మాయాజాలం కూడా. అలాంటి మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునే ఓ సాధారణ అమ్మాయి, అనుకోని విధంగా ఒక సినిమా అవకాశాన్ని పొందడమే మహాభాగ్యమని జనం కూడా సంతోషపడ్డారు.

మోనాలిసా తల్లిదండ్రులు రఘునాథ్, సరస్వతి. వీరు గుజరాత్‌కు చెందిన చిన్న తరహా వ్యాపారస్తులు. వారి కుటుంబం తరతరాలుగా కుంభమేళాకు వస్తూ, అక్కడే పూసలు, పూసల దండలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రఘునాథ్ శ్రమజీవి. కస్టపడి కుటుంబాన్ని పోషించేవాడు. సరస్వతి హుందాతనానికి, వినయానికి ప్రతీక. అమ్మాయికి ధైర్యం, ధ్యేయం నేర్పిన వ్యక్తి. పూసల వ్యాపారం తప్ప విద్యకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన వారు కాదు. దీంతో మోనాలిసా జీవితమంతా పూసల చుట్టూ తిరిగింది. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటోంది.
అనుకోని అవకాశం...
ఓ సినిమా దర్శకుడు మహాకుంభమేళాలో ఆమె జీవితానికి కొత్త మలుపు తిప్పుతానని అక్కడికి వచ్చాడు. ఇటువంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నానని చెప్పారు. వెంటనే ఆమెను సినిమాకు ఛాన్స్ ఇస్తామని ప్రకటించాడు. కుంభమేళా కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, జీవితాలను మార్చగల ఒక వేదికగా కూడా నిలుస్తుందని అందరూ భావించారు.
బాంబు పేల్చిన ప్రొడ్యూసర్ జితేంద్ర..
ఇంతలో ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ జితేంద్ర నారాయణ్‌ సింగ్‌ అలియాస్‌ వసీం రిజ్వీ బాంబు పేల్చాడు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దర్శకుడు సనోజ్ మిశ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. "నాకు మోనాలిసా, ఆమె కుటుంబంపై చాలా జాలి, బాధ కలుగుతోంది. పాపం వాళ్లది పేద కుటుంబం. పైగా నిస్సహాయులు.

మహాకుంభ్‌లో ఆమె వైరల్‌ ఫొటోలు మేము కూడా చూశాం. కానీ సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్‌ వారి ఇంటికి వెళ్లినపుడు, ఆ డైరెక్టర్ గురించి ఏమీ తెలియకుండానే ఆ కుటుంబం తమ అమ్మాయిని అతని చేతికి అప్పగించారు. ఇది నన్ను బాధ పెడుతోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
జితేంద్ర నారాయణ్‌ సింగ్‌ అలియాస్‌ వసీం రిజ్వీ ఎవరు?
జితేంద్ర నారాయణ్‌ సింగ్‌ అలియాస్‌ వసీం రిజ్వీ ఒక సినీ నిర్మాత. ఆయన సనోజ్ మిశ్రాతో కలిసి "బెంగాల్‌ డైరీ", "రామ్‌ కి జన్మభూమి", "కాశీ టు కశ్మీర్" వంటి మూడు చిత్రాలు రూపొందించారు. ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, "సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ఇప్పటి వరకు ఏ చిత్రమూ విడుదల కాలేదు. అతను మితిమీరిన మందుబాబు. మద్యానికి బానిస. షూటింగ్ సెట్స్‌లో మద్యం తాగి మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు" అని ఆరోపించారు. ఇంకా, "సనోజ్ మిశ్రాకు మద్యం తాగిన తర్వాత యువతుల అవసరం ఉంటుంది" అని తీవ్ర విమర్శలు చేశారు.
ఫైనాన్స్‌ లేకుండా సినిమా ఎలా తీస్తాడు?
వసీం రిజ్వీ మరో సంచలన ఆరోపణ చేస్తూ, "సనోజ్ మిశ్రాకు ఫైనాన్సర్‌ లేడు. సొంత డబ్బు కూడా లేదు. అలాంటప్పుడు అతను సినిమా ఎలా తీస్తున్నాడు? 'మణిపుర్ డైరీ' సినిమా అసలు తీసే అవకాశం లేదు. అతను ఆ అమాయకమైన అమ్మాయి పేరును వాడుకుని అన్ని చోట్ల తిరుగుతున్నాడు. మేము కూడా చాలా నష్టపోయాం. ఈ వ్యక్తి చాలా మంది నిర్మాతలను మోసం చేశాడు. ఇప్పుడు అతని నిజస్వరూపం బయటపడింది" అని చెప్పారు.
ట్రాప్‌లో పడిపోయిన మోనాలిసా?
వసీం రిజ్వీ "మోనాలిసా కుటుంబ సభ్యులు సనోజ్ మిశ్రా గురించి ముందే తెలుసుకుని ఉంటే, తమ అమ్మాయిని అతని వెంట పంపేవారు కాదు. సినిమా తీయడానికి డబ్బు అవసరం. ఇప్పుడు సనోజ్ మిశ్రాపై ఎవరూ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా లేరు. అతను ప్రకటించిన సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? దాని బడ్జెట్ ఏమిటి? అతను మార్కెట్‌ నుంచి అప్పు తీసుకుని తప్పించుకున్నాడు. ఇప్పటి పరిస్థితిలో అతనిపై ఒక్క రూపాయి పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు" అని తెలిపారు.
మోనాలిసా ఫ్యాన్స్‌ ఆందోళన
ఈ ఇంటర్వ్యూలో వచ్చిన విషయాల తర్వాత మోనాలిసా ఫ్యాన్స్‌ ఆమె భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ఆమెను తిరిగి ఆమె కుటుంబానికి అప్పగించాలంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఒక యూజర్‌ "మోనాలిసాను కాపాడి, ఆమెకు మద్దతుగా నిలబడాలి" అని రాశారు. మరో వ్యక్తి "భగవంతుడు మోనాలిసాను రక్షించాలి" అని కామెంట్‌ చేశారు. రేఖా చౌహాన్‌ అనే మహిళ "మోనాలిసా తల్లిదండ్రులు ఇంత త్వరగా నమ్మకూడదు. ఓ ముక్కూమొహం తెలియని వ్యక్తిపై నమ్మకం ఉంచి, తమ బిడ్డను అతనికి అప్పగించడం తప్పు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More
Next Story