కేటీఆర్ హైజాక్ చేశారా ?
x

కేటీఆర్ హైజాక్ చేశారా ?

చర్చలో రేవంత్ మాట్లాడకుండా మంత్రి దుద్దిళ్ళతో మాట్లాడించారంటేనే నరేంద్రమోడి అంటే భయపడుతున్నారా ?


తెలంగాణా అసెంబ్లీ చర్చను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సక్సెస్ ఫెల్లుగా హైజాక్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024లో తెలంగాణాకు జరిగిన అన్యాయంపై చర్చను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చర్చపై అనర్ఘళంగా మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో చేసిన అన్యాయాలపై మండిపడ్డారు. బడ్జెట్ కు ముందు తెలంగాణా ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి నరేంద్రమోడిని కలిసి చేసిన విజ్ఞప్తులను సభలో మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలుచేసినా కేంద్రం పట్టించుకోని వైనాన్ని వివరించారు.

తర్వాత చర్చలో పాల్గొనమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ను కోరారు. కేటీఆర్ మొదలుపెట్టడమే రేవంత్ ను రెచ్చగొట్టారు. చర్చలో రేవంత్ మాట్లాడకుండా మంత్రి దుద్దిళ్ళతో మాట్లాడించారంటేనే నరేంద్రమోడి అంటే భయపడుతున్నారా ? లేక ఇంకేమైనా కారణముందా అని అనుమానాన్ని వ్యక్తంచేశారు. దాంతో రేవంత్ జోక్యంచేసుకుని కేసీయార్, కేటీయార్ వ్యవహారశైలిపై ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చ జరిపి, తీర్మానం చేయాల్సొస్తుందన్న భయంతోనే కేసీయార్ సభకు రాలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. దానిపై కేటీయార్ మళ్ళీ రేవంత్ ను కార్నర్ చేస్తు మాట్లాడారు.

ఇటు రేవంత్ అటు కేటీయార్ ఇద్దరూ ఒకళ్ళపై మరొకరు పై చేయి సాధించుకునేందుకు ఆరోపణలు, ప్రత్యారోపణలతో చాలాసేపు మాట్లాడారు. ఇదే సమయంలో తమ హయాంలో నరేంద్రమోడి ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏ విధంగా వ్యతిరేకించారు ? కేంద్రానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలపైన చాలాసేపు మాట్లాడారు. మంత్రులు, డిప్యుటి సీఎం భట్టి విక్రమార్కతో పాటు స్పీకర్ ఎన్నిసార్లు వారించినా కేటీయార్ మాత్రం అసలు విషయం కాకుండా తనిష్టమొచ్చిన పద్దతిలోనే మాట్లాడారు. తెలంగాణా ఏర్పడిన దగ్గర నుండి రాష్ట్రాభివృద్ధికి కేసీయార్ చేసిన కృషిని, రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా నిలబెట్టడానికి పడిన తపనను ఉదాహరణలుతో వివరించారు. బడ్జెట్లో తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని, జరిగిన అన్యాయాన్ని అధిగమించాల్సిన విషయాలపై మాట్లాడమని, సూచనలు చేయాలని స్పీకర్, మంత్రులు ఎన్నిసార్లు చెప్పినా కేటీయార్ పట్టించుకోలేదు. తన పంథాను మార్చుకోకపోగా తాను ఐదుసార్లు గెలిచిన ఎంఎల్ఏనని సభలో ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలన్న విషయం బాగా తెలుసంటు ఎదురుదాడికి దిగటమే విచిత్రం. మొత్తంమీద రెండుగంటల పాటు సభలో సబ్జెక్టుపైన కాకుండా తాను అనుకున్నట్లే కేటీఆర్ మాట్లాడారు.

చివరకు ఓపిక నశించిన రేవంత్ మళ్ళీ జోక్యం చేసుకుని కేటీయార్ ను గట్టిగా మందలించాల్సొచ్చింది. అలాగే మోడి ప్రభుత్వానికి పదేళ్ళల్లో కేసీయార్ అందించిన సహకారాన్ని, బిల్లులకు ఇచ్చిన మద్దతును ఉదాహరణలతో పాటు తేదీలతో సహా ప్రస్తావించారు. బడ్జెట్లో జరిగిన అన్యాయంపై చర్చించి తీర్మానం చేస్తారా చేయండి లేకపోతే ఇంకోళ్ళతో మాట్లాడించండి అని డిప్యుటి సీఎం గట్టిగా చెప్పిన తర్వాత చివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించి కూర్చున్నారు.

Read More
Next Story