ఫిరాయింపులపై కేటీఆర్ పిచ్చి సమర్ధన ?
x

ఫిరాయింపులపై కేటీఆర్ పిచ్చి సమర్ధన ?

తమ హయాంలో జరిగిన ఫిరాయింపులు షెడ్యూల్ 10 ప్రకారం రాజ్యాంగబద్ధంగా జరిగాయట. తాము ఎంఎల్ఏలను చేర్చుకోవటం కాదు పార్టీల శాసనసభాపక్షాలనే చేర్చుకున్నట్లు చెప్పారు.


బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి వెళుతున్న ఎంఎల్ఏలను ఆపటం కష్టంగా ఉంది. అందుకని కాంగ్రెస్ ఫిరాయింపులపై కారుపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడపడితే మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే తమ హయాంలో జరిగిన వాటికి ఇపుడు జరుగుతున్న ఫిరాయింపులకు తేడా ఉంది అని సమర్ధించుకుంటున్నారు. ఫిరాయింపులే తప్పన్నపుడు ఒక్కొక్కళ్ళు వస్తే ఏమిటి ? హోలు మొత్తంమీద వస్తే ఏమిటి ? తాము చేసిన ఫిరాయింపులు సాంకేతికంగా, రాజ్యాంగబద్దంగా కరెక్టని సమర్ధించుకోవటానికి కేటీఆర్ నానా తంటాలు పడుతున్నారు. తాముచేసిన ఫిరాయింపులకు సాంకేతికతను అడ్డంపెట్టుకుంటున్న కేటీఆర్ నైతికతను గాలికొదిలేశారు.

ఒక టీవీ చర్చలో కేటీఆర్ ఏమంటారంటే తమ హయాంలో జరిగిన ఫిరాయింపులు వేరు ఇపుడు జరుగుతున్న ఫిరాయింపులు వేరట. తమ హయాంలో జరిగిన ఫిరాయింపులు షెడ్యూల్ 10 ప్రకారం రాజ్యాంగబద్ధంగా జరిగాయట. ఎలాగంటే తాము ఎంఎల్ఏలను చేర్చుకోవటం కాదు పార్టీల శాసనసభాపక్షాలనే చేర్చుకున్నట్లు చెప్పారు. ఒకపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో మూడింట రెండు వంతుల మధ్య పార్టీ మారితే అది ఫిరాయింపు కిందకు రాదన్నారు. ఆ పద్దతిని విలీనం అనంటారట. అందుకనే 18 మంది కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 12 మంది బీఆర్ఎస్ లో చేరిన తర్వాత అసెంబ్లీలో సీఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇదే పద్దతిలో బీఎస్పీ, టీడీఎల్పీ కూడా బీఆర్ఎస్ లో విలీనమైనట్లు కేటీఆర్ సమర్ధించుకున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేటీఆర్ చెప్పింది రాజ్యాంగబద్ధంగా, సాంకేతికంగా కరెక్టే అయ్యుండచ్చు. కాని కాంగ్రెస్ తరపున గెలిచిన 18 మంది ఎంఎల్ఏల్లో ఒకేసారి 12 మంది బీఆర్ఎస్ లోకి ఫిరాయించలేదు. అప్పుడప్పుడు ఒకళ్ళు, ఇద్దరు చొప్పున హస్తంపార్టీ ఎంఎల్ఏలను చేర్చుకున్నారు. గెలిచిన 18 మందిలో 12 మంది చేరిపోయిన తర్వాత అప్పుడు మూడింట రెండొంతులంటు డ్రామానడిపి సీఎల్పీని కారుపార్టీలో విలీనం చేసుకున్నారు. ఇదే పద్దతిలో టీడీఎల్పీని కూడా కేసీఆర్ విలీనం చేర్చుకున్నారు. ఇక బీఎస్పీ విషయానికి వస్తే గెలిచిన ముగ్గురు ఒకేసారి బీఆర్ఎస్ లో చేరిపోయారు కాబట్టి దాన్ని విలీనం అనటంలో తప్పులేదు. అంతేకాని కేటీఆర్ చెప్పిన విలీనం ప్రక్రియ కాంగ్రెస్, టీడీపీలకు వర్తించదు.

ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కూడా కాంగ్రెస్ లో అప్పుడుప్పుడు ఒకళ్ళు, ఇద్దరుగా చేరుతున్నారు. 38 మందిలో రెండొంతుల మంది ఎంఎల్ఏలు చేరిపోయారు అనుకున్న తర్వాత బహుశా బీఆర్ఎస్ఎల్పీని అప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటారేమో. కేటీఆర్ విలీనం ముచ్చటను రేవంత్ రెడ్డి తొందరలోనే తీర్చేస్తారని మంత్రులు, సీనియర్ నేతలు పదేపదే చెబుతున్నారు. ఒకపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏని రాజీనామా చేయించకుండానే పార్టీలోకి లాక్కోవటం తప్పు. అలాంటిది ఒక్కొక్కళ్ళని చేర్చుకోవటం అయితే ఏమిటి ? మూడింట రెండొంతుల మంది అయితే ఏమిటి ? ఏ పద్దతిలో చేసినా తప్పు తప్పే. ఒకవేళ పక్క పార్టీ ఎంఎల్ఏలను తీసుకోవాలని అనుకున్నపుడు రాజీనామా చేయించిన తర్వాత పార్టీలో చేర్చుకుని ఉపఎన్నికలో గెలిపించుకుంటే అప్పుడు హుందాగా ఉంటుంది. అప్పటివరకు ఫిరాయింపుల విషయంలో అధికారపార్టీ సమర్ధించుకుంటునే ఉంటుంది, ప్రతిపక్షం గోలచేస్తునే ఉంటుందంతే.

Read More
Next Story