
‘కృష్ణయ్య గారు..విశాఖలో కాలుష్యాన్ని తగ్గిస్తారా‘
విశాఖ కాలుష్యం గురించి కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఛైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్యకి, కేంద్ర ప్రభుత్వ పూర్వపు కార్యదర్శి ఈఏఎస్ శర్మ బహిరంగ లేఖ రాశారు.
విశాఖ కాలుష్యం గురించి కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఛైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్యకి, కేంద్ర ప్రభుత్వ పూర్వపు కార్యదర్శి ఈఏఎస్ శర్మ బహిరంగ లేఖ రాశారు.
లేఖలో శర్మ ఏమని పేర్కొన్నారంటే..
ప్రస్తుతం, విశాఖపట్నం నగరంలో గాలి కాలుష్యం సూచిక (AQI) 220 కి పైగా ఉండటం కారణంగా, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతున్నది. అందుకు కారణాలను పరిశీలించి, కాలుష్యాన్ని అరికట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా Air (Prevention and Control of Pollution) Act, 1981 క్రింద స్థాపించబడిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కి ఉందని గుర్తించాలి.
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా అధికారులు, నగరంలో గాలి కాలుష్యాన్ని అరికట్టే దిశలో ప్రయత్నిస్తున్నారని వార్తలు చూసాను. నా ఉద్దేశంలో, జిల్లా అధికారులు ఎంత కృషి చేసినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో, తగిన మార్పులు రాకపోతే, కాలుష్యం సమస్యకు పరిష్కారం ఉండదు.
గతంలో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వారు, విశాఖ పారిశ్రామిక ప్రాంతాన్ని, దేశంలో అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటి గా గుర్తించింది. ఆ విషయం తెలిసి కూడా, రాష్ట్ర ప్రభుత్వం, విచక్షణారహితంగా కాలుష్యం కలిగించే పరిశ్రమలను, ప్రజల ఉద్దేశాలకు విరుద్ధంగా, విశాఖ పరిసరాల్లో స్థాపించడం జరుగుతున్నది.
ఉదాహరణకు, రెండు నెలల క్రింద, మీ ఆధ్వర్యంలో, ఎంతో జనాభా ఉన్న గాజువాక ప్రాంతంలో, కాలుష్యం కలిగించే అదానీ కంపెనీ (అంబుజా సిమెంట్) ప్లాంట్ ను, ప్రజల అభ్యంతరాలను తోసి పెట్టి, స్థాపించడానికి ప్రయత్నాలు జరిగాయి. పోలీస్ బలగాల సహాయంతో, తప్పుడు EIA రిపోర్ట్ ఆధారంగా, "ప్రజాభిప్రాయ సేకరణ" చేయడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ సందర్భంగా, మీకు, 8-10-2025 న నేను రాసిన లేఖ క్రింద జత పరిచాను. ప్రజలు ఏకకంఠంతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని ఉండకపోతే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సిమెంట్ ప్లాంట్ కు అనుమతులు ఇచ్చి, విశాఖ నగర వాతావరణాన్ని మరింత కాలుష్యమయం చేసి ఉండేవారు.
APPCB వారి నియంత్రణ సరిగ్గా లేకపోవడం కారణంగా, ప్రస్తుతం పనిచేస్తున్న పరిశ్రమలు, విశాఖ పరిసరాలలో జలవనరులను, వాతావరణాన్ని కాలుష్యానికి గురి చేసి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి.
విశాఖ నగర సరిహద్దులలో, రెండు పోర్టులు, అంటే, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (VPT), గంగవరం పోర్టు ల లో జరుగుతున్న ఎగుమతి దిగుమతి కార్యకలాపాల కారణంగా కూడా, నగరంలో పర్యావరణం కాలుష్యానికి గురి అవుతున్నది.
VPT కాలుష్యం మీద, చైతన్య స్రవంతి అనే స్వచ్చంధ సంస్థ NGT లో దాఖలు చేసిన కేసు (No.68/2015) లో, NGT వారు 5-8-2020, 3-1-2022 న, NGT కాలుష్య నియంత్రణ విషయంలో జారీ చేసిన ఉత్తర్వులను, VPT ఈరోజు వరకు పూర్తిగా అమలు చేయకపోవడం వలన కూడా, వాతావరణంలో కాలుష్యం తగ్గలేదు. అందుకు VPT, మరియు APPCB, ప్రజలకు జవాబు ఇవ్వవలసిన అవసరం ఉంది.
నగరంలో వాతావరణం విషమించడానికి ఇంకొక కారణం, విపరీతంగా ట్రాఫిక్ నుంచి వెలువడుతున్న రసాయన పదార్థాలు. నగరంలో ప్రజల రవాణా సౌకర్యం కోసం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో, అందరికీ అందుబాటులో ఉండే బస్ లను ప్రవేశపెడితే, ఇతర వాహనాల కదలిక తగ్గి, గాలిలో కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. నా ఉద్దేశంలో, మెట్రో రైలు కన్నా, అటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యానికి, ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి.
నగరంలో, వాతావరణం, ఏ కారణాల వలన కాలుష్యానికి గురి అవుతున్నదనే విషయాన్ని, విపులంగా, శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం అవసరం. ఉదాహరణకు Urban Info Vision వారు, ప్రత్యేకంగా విశాఖనగరం విషయంలో, ఆ విధంగా పరిశీలించడం జరిగింది.
అదే విధంగా, విశాఖ నగర వాతావరణం కాలుష్యం మీద, ఇతరులు కూడా శాస్త్రీయ పద్ధతుల్లో, పరిశోధన చేయడం జరిగింది (Air quality status of Visakhapatnam (India)--indices basis) నగరం పరిసరాల్లో, రెండు బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ లు ఉన్నాయి (సింహాద్రి, హిందుజా). వాటినుంచి గాలిలోకి వదలబడిన సల్ఫర్ డయాక్సైడ్ వలన, PM 2.5 కాలుష్యం వ్యాపిస్తుంది అని, పరిశోధనల ద్వారా తెలిసిన విషయం (Large share of India’s PM2.5 not emitted directly, but chemically formed in the atmosphere: CREA Study). ISRO/ IISc ల పరిశోధనల ద్వారా తెలిసిన ఇంకొక విషయం, దేశంలో వాతావరణంలో అత్యధికంగా ఏరోసోల్ (pollutants) సాంద్రత ఉన్న నగరాల్లో విశాఖ ఒకటి ఇటీవల జరిగిన పరిశోధనల ద్వారా తెలిసిన ఇంకొక విషయం, అన్ని నగరాల్లో, ఎన్నో కారణాల వలన, వెదజల్లబడుతున్న కాలుష్యం కారణంగా, వాతావరణం లో ఏరోసోల్ ల సాంద్రత పెరిగి, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ("Transported dust modulates aerosol pollution domes over rapidly urbanizing Indian cities). అటువంటి కాలుష్య సమస్యకు పరిష్కారం కావాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవడం అవసరం.
రాష్ట్ర ప్రభుత్వం, APPCB, మీద సూచించిన పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని, నిపుణుల సహాయం తో, కాలుష్యాన్ని తగ్గించే దిశలో ప్రయత్నం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో, క్షుణ్ణంగా పరిశోధనలు జరిపించి, తమ విధానాల్లో మార్పులు చేయడం అవసరం.
రాష్ట్రంలో జలవనరులు, వాతావరణం కాలుష్యానికి గురి అవ్వడం కారణంగా, ప్రజల ఆరోగ్యానికి కలుగుతున్న హాని విషయంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ప్రచురించిన రిపోర్ట్ ( ను, రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలి. ఆ విషయాన్ని గుర్తించి, ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తగిన చర్యలు చేపట్టడం అవసరం. ఆ విషయంలో APPCB, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, ఒక సమగ్రమైన ప్రణాళికను చేపట్టాలి. అని తన లేఖలో ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు.
Next Story

