
శాంతించిన కృష్ణా, గోదావరి–ఉపసంహరించుకున్న ప్రమాద హెచ్చరికలు
వరద నీటి ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు ఆయా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గత కొద్ది రోజులుగా వరద నీటి ప్రవాహంతో పరవళ్లు తొక్కిన కృష్ణా, గోదావరి నదులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు, లంక గ్రామాల వాసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వరద నీటి ప్రవాహంతో ఉరకలేస్తూ ఈ రెండు నదులు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. మరో వైపు వరద ప్రవాహం కాస్త తగ్గడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఎగువర వేసిన ప్రమాద హెచ్చరికలను కూడా అధికారులు ఉపసంహరించుకున్నారు.
శుక్రవారం అర్థరాత్రి వరకు దాదాపు 13లక్షల క్యూసెక్కుల గోదావరి వరద నీటిని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి అధికారులు విడిచిపెట్టారు. అదే అర్థరాత్రి మూడు గంటల నుంచి ఆ భారీ వదర నీటి ప్రవాహం 12.85 క్యూసెక్కులకు తగ్గడంతో అప్పటి వరకు ఎగువర వేసిన రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ఇక శనివారం రాత్రి ఏడు గంటల సమయానికి ఆ వరద ప్రవాహం ఇంకా తగ్గింది. 12.85లక్షల క్యూసెక్కుల నుంచి 9.83లక్షల క్యూసెక్కులకు తగ్గి పోయింది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు అప్పటి వరకు ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.70 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతోంది. మరో వైపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం చాలా వరకు తగ్గిపోయినప్పటికీ దవళేశ్వరం ఆనకట్టకు దిగువన వివిధ ఉప నదుల ఉంచి వరద ప్రవాహ ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. ధవళేశ్వరం ఆనకట్టకు దిగువన వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి నదీ పాలయ నుంచి మాత్రం ఫ్లడ్ ప్రవాహం కొనసాగుతోంది.
దీని వల్ల లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు, లంకభూములు, రహదారులపై వరద నీటి ప్రవాహ భయం వెంటాడుతూనే ఉంది. మరో వైపు కృష్ణా నది వరద ప్రవాహం కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతానికి నిలకడగా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.92లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగుర వేసిన మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. అయితే అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల వరద నీటి ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు ఆయా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు గ్రామాల ప్రజలు, లంకగ్రామాల వాసులు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.