
పోటెత్తుతున్న కృష్ణమ్మ
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంద.
కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.29 క్యూసెక్కులు వరకు ఉంది. ఇది 4.50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
మరో వైపు విజయవాడ ఇంద్రకీలాద్రి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా నదికి పెరుగుతున్న వరద ప్రవాహం ఆందోళనకరంగా మారింది. దుర్గమ్మ వారి దర్శనాల కోసం వచ్చే భక్తలు కృష్ణా నది తీరంలో ఏర్పాటు చేసిన ఘాట్లలోనే పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ క్రమంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అత్యవసర సహాయక చర్యల కోసం విజయవాడ ఘాట్లలో 5 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.
దసరా ఉత్సవాలు సందర్భంగా అధికార యంత్రాంగానికి ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. కృష్ణా నది ఘాట్ల వద్ద భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలి.. భద్రతా చర్యలకు పోలీసు, నీటిపారుదల, మునిసిపల్ సిబ్బంది ఘాట్ల దగ్గర ఉండాలి.. నది ప్రమాద స్థాయి తెలియజేసే బారికేడింగ్‌లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. భక్తులు అధికారులకు సహకరించాలని సూచించారు.
Next Story