కృష్ణా లో తిరకాసు రాజకీయం.. అభ్యర్థుల ’ క్రాస్‌’ ఫీల్డింగ్‌!
x

కృష్ణా లో తిరకాసు రాజకీయం.. అభ్యర్థుల ’ క్రాస్‌’ ఫీల్డింగ్‌!

గత ఎన్నికల్లో వాళ్లిద్దరూ ప్రత్యర్థులు, ఇప్పుడు వేర్వేరు చోట్ల ఒకే పార్టీ అభ్యర్థులు.. ఇంకోచోట వాళ్లిద్దరూ ప్రత్యర్థులు...


గత ఎన్నికల్లో వాళ్లిద్దరూ ప్రత్యర్థులు, ఇప్పుడు వేర్వేరు చోట్ల ఒకే పార్టీ అభ్యర్థులు.. ఇంకోచోట వాళ్లిద్దరూ ప్రత్యర్థులు ఇప్పుడు పార్టీలు మారినా మళ్లీ వాళ్లే అభ్యర్థులు.. సీట్లు రాక పాట్లు పడుతున్న వారు మరికొందరు.. ఏమైతేనేం కృష్ణా జిల్లా రాజకీయం రంజుగా సాగుతోంది. వీళ్లందరిలో ఒకే ఒక్కడు మండలి బుద్ధ ప్రసాద్‌ భవితవ్యం మాత్రం ఇంకా త్రిశంఖు స్వర్గంలోనే వేలాడుతోంది.

2019లో ప్రత్యర్థులుగా తలపడిన ఇద్దరు 2024 ఎన్నికల్లోనూ రెండు చోట్ల ప్రత్యర్థులుగా ఉన్నారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన శ్రీరాం తాతయ్య, సామినేని ఉదయభాను, తంగిరాల సౌమ్య, మొండితోక జగన్మోహనరావు ఈసారి కూడా ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కనికరిస్తే అవనిగడ్డ నియోజకవర్గంలోనూ పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ తరఫున సింహాద్రి రమేశ్‌ బరిలో ఉండగా గత ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసిన మండలి బుద్ధ ప్రసాద్‌ ఈసారి జనసేన అభ్యర్థిగా పోటీకి దిగే ఛాన్స్‌ ఉంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలను గమనిస్తే.. 2019లో వైసీపీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారు ఈవేళ టీడీపీ తరఫున పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున పోటీ చేసిన వారు వైసీపీ పంచన చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా పోరాడిన పలువురు నేతలు నేడు ఎన్నికల బరికి దూరంగా ఉండిపోయారు.
వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు నడుమ చిత్రమైన పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వంశీ టీడీపీ తరఫున, వెంకట్రావు వైసీపీ తరఫున పోటీ చేశారు. వంశీ 993 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అదే గన్నవరం నుంచి వంశీ వైసీపీ తరఫున పోటీ చేస్తుంటే వెంకట్రావు టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. కొడాలి నాని, దేవినేని అవినాశ్‌ వీరిద్దరూ గత ఎన్నికల్లో ప్రత్యర్థులు. ఈసారి ఒకే పార్టీ తరఫున వేర్వేరు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. 2019లో గుడివాడ నుంచి వైసీపీ తరఫున నాని, టీడీపీ తరఫున అవినాశ్‌ పోటీ చేశారు. ఈసారి గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా నాని బరిలో ఉంటే విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా అవినాశ్‌ పోటీలో ఉన్నారు.
గత ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున పోటీ చేసిన నేతలు నేడు ప్రత్యర్థి పార్టీ తరఫున బరిలో నిలవడం గమనార్హం. గత ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలశౌరి నేడు టీడీపీ, బీజేపీ బలపర్చిన జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఈసారి వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసి గెలుపొందిన వసంత కృష్ణప్రసాద్, కొలుసు పార్థసారథి నేడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన బొప్పన భవకుమార్‌ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి మంచి మెజారిటీతో గెలుపొందిన నేతలు కొందరు ఈ ఎన్నికల్లో పోటీలో లేరు. కొందరు కనుమరుగైపోగా మరికొందరు తమ పార్టీ గెలుపు కోసం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో తిరువూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొక్కిలిగడ్డ రక్షణనిధి 11647 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ లేకుండాపోయింది. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేసి కేవలం 13 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మల్లాది విష్ణుకి ఈసారి టికెట్‌ లేదు. గత ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేసిన పేర్ని
నాని ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
ఈసారి తాను తప్పుకొని తన కుమారుడు పేర్ని కిట్టుని పోటీలో పెట్టారు. నాడు తండ్రితో నేడు తనయుడితో తలపడే ప్రత్యర్థిగా మాత్రం కొల్లు రవీంద్రే ఉన్నారు. పామర్రు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పులేటి కల్పన ఈ ఎన్నికల్లో అసలు జాడే లేకుండా పోయారు. విజయవాడ పశ్చిమ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన షబానా ఖాతూన్‌ది అదే పరిస్థితి. మైలవరం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని ఉమా ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బొప్పన భవకుమార్‌ ఈసారి ఎన్నికల బరిలో నిలవకున్నా టీడీపీ తరఫున క్రియాశీలకంగా ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కొనకళ్ల నారాయణ ఈసారి ఎన్నికల బరిలో లేరు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్‌ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఒకప్పుడు మంత్రిగా పని చేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు ఈసారి ఇంటికే పరిమితమయ్యారు.
సీపీఐ, సీపీఎంకి ఒకప్పుడు మంచి పట్టున్న కృష్ణాజిల్లాలో ఈసారి వారు కలిక్కానికి కూడా కానరావడం లేదు.



Read More
Next Story