కూన రవి కుమార్‌ నన్ను వేధించారు..ఇవిగో ఆధారాలు: కేజీబీవీ ప్రిన్సిపల్‌ సౌమ్య
x

కూన రవి కుమార్‌ నన్ను వేధించారు..ఇవిగో ఆధారాలు: కేజీబీవీ ప్రిన్సిపల్‌ సౌమ్య

ఎమ్మెల్యే మీద చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను ఆమె వేడుకున్నారు.


తనను మానసికంగాను, శారీరకంగాను వేధించాడని ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేజీబీవీ ప్రిన్సిపల్‌ రెజిటీ సౌమ్య తీవ్ర ఆరోపణలు గుప్పించారు. శనివారం ఆమె మీడియా ముందు మాట్లాడూ.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తనపై వేధింపులకు పాల్పడినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. తనపై ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులకు పాల్పడటంపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తనపై చేసిన ఆరోపణలపైన ఎంక్వయిరీ చేయించాలని, ఎలాంటి విచారణ చేయకుండా తనపై ఎలా ఆరోపణలు చేస్తారని సౌమ్య నిలదీశారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని, అందుకే ధైర్యంగా విచారణ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

2013 నుంచి కేజీబీవి ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న తనపై ఎలాంటి ఎలాంటి రిమార్క్స్‌ లేవని సౌమ్య స్పష్టం చేశారు. తాను ప్రతి రోజు స్కూల్‌ వెళ్తున్నా.. కూన రవికుమార్‌ మాత్రం తాను సరిగా స్కూల్‌ వెళ్లడం లేదని అబద్దాలు చెబుతున్నారని, తన టెండెన్స్‌ను సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఉందన్నారు. మెనూ ప్రకారం పిల్లలు ఆహారం పెట్టడం వంటి రిపోర్టులన్నీ తమ పై అధికారులకు కూడా పంపుతున్నట్లు చెప్పారు. తాను ఓ సాధారణ మహిళనని, రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. గత రెండు నెలలుగా తనను కూన రవికుమార్‌ వేధింపులకు గురి చేస్తూ.. అందులో భాగంగానే తనను బదిలీ చేసినట్లు తెలిపారు. పేరెంట్స్‌ నుంచి తాను డబ్బులు వసూలు చేసినట్లు తనపై ఆరోపణలు చేయించారని, తాను అలా ఎప్పడు చేసింది లేదన్నారు. ఎఎంసీ చైర్మన్‌ పరం నాయుడు ఎప్పుడు కేజీబీవీకి వచ్చినా.. ఆడపిల్లలు ఉన్న క్లాస్‌రూమ్‌లకు వెళ్లి ఇబ్బంది పెడుతుంటారని ఆరోపించారు.
తన వృత్తికి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలపైన కూడా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తనపై తప్పడు ఆరోపణలు చేశారని, తన పెళ్లి గురించి కూడా తప్పుగా మాట్లాడారని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే మహిళలకు రాత్రిపూట వీడియో కాల్‌ చేయాల్సిన అవసరం ఏంటని ఆమె నిలదీశారు. పొందూరులో రాత్రి 10 గంటల వరకు కూడా కూన రవికుమార్‌ మీటింగ్‌లు పెట్టారని తెలిపారు. కూన రవికుమార్‌ వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని తెలిపారు. కొన్ని కేజీబీవీలలో అవినీతి అక్రమాలు జరిగాయని, కానీ వారు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ నియోజక వర్గం పరిధిలోని వారు కావడంతో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తనపై జరుగుతున్న వేధింపులు చూసి తనకు మద్దతు తెలిపిన వారిపైన కూడా దాడులు చేస్తున్నారని విమర్శించారు.
తనపై ఎలాంటి విచారణ చేయకుండా బదిలీ చేశారని ఆ రోజు రాత్రి కూడా వీడియో కాల్‌ చేయమని కూన రవికుమార్‌ తనపై ఒత్తి తెచ్చారని పేర్కొన్నారు. ఈ వేధింపులపై గతంలో జిల్లా కలెక్టర్‌కి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అన్ని రకాలుగా తనపై వేధింపులకు గురిచేసిన కూన రవికుమార్‌ మీద స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను ఆమె వేడుకున్నారు.
Read More
Next Story