కొండపల్లి ఖిల్లాకు మహర్దశ
టూరిస్టులను ఆకర్షించేలా కొండపల్లి ఖిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. మౌలిక వసతులను కల్పించేందుకు ఉపక్రమించారు.
విజయవాడకు సమీపంలోని చారిత్రాత్మక కొండపల్లి ఖిల్లాను అభివృద్ధి చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కొండపల్లి ఖిల్లా ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా సాంస్కృతిక, పురావస్తు, మ్యూజియం, టూరిజం శాఖల సమన్వయంతో కొండపల్లి ఖిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా జీ లక్ష్మీశ తెలిపారు.
ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ఖిల్లాను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ప్రిన్సిపల్ సెక్రటరి జీ వాణీ మోహన్, ఇతర అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు తలమానికమైన కొండపల్లి ఖిల్లాను అభివృద్ధి చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొండపల్లి ఖిల్లా చరిత్రను సజీవంగా నిలిపేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు చెప్పారు. మరమత్తులు నిర్వహించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఖిల్లాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఫోటోను యాప్ ద్వారా అండ్రాయిడ్ ఫోన్‌లో స్కాన్ చేసుకుని ఆ చిత్రం యొక్క విశిష్టతను తెలుసుకునేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047లో విజన్ డాక్యుమెంట్‌లో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. కొండపల్లి పోర్టులో ఉన్న మౌలిక వసతులను డెవలప్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుండి విడుదల చేసే నిధులతో పాటు జిల్లా యంత్రాంగం పరంగా కొండపల్లి ఖిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ప్రిన్సిపల్ సెక్రటరి జీ వాణీ మోహన్ మాట్లాడుతూ.. దాదాపు 10వ శతబ్ధ కాలం నుండి స్వాతంత్య్రం సిద్ధించే వరకు అనేక మంది రాజులు కొండపల్లి కోట నుండి పరిపాలన సాగించేవారన్నారు. ఎంతో చారిత్రాత్మికమైన కొండపల్లి కోట దాదాపు శిధిలావస్థలోకి చేరుకున్న తరుణంలో 2019లో ఈ కోటను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించారని తెలిపారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొండపల్లి కోటను డెవలప్ చేశారన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతోను, సీఎస్‌ఆర్ నిధుల ద్వారా మరమత్తులు, మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. సహజసిద్ధమైన వాతావరణంలో శుభకార్యాలు నిర్వహించుకునేలా ప్రజలలో అవగాహన కల్పించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. తద్వారా కొండపల్లి కోటకు మరింత ప్రాచుర్యం ఏర్పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ వైవి ప్రసన్నలక్ష్మి, జిల్లా టూరిజం అధికారి ఏ శిల్ప, సహాయ టూరిజం అధికారి డీ గోపాల్, పురావస్తు శాఖ ఉపసంచాలకులు ఓ రామ సుబ్బారెడ్డి, పీ సురేష్, సహాయ సంచాలకులు స్వామినాయక్, నరసింహ నాయుడు, ఎస్ వెంకట్రావు, డీవీఎం చైతన్య, స్థానిక తహశీల్థార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Next Story