కోనసీమ ప్రభల తీర్థం ప్రత్యేకత ఏమిటీ, ప్రధాని మోదీ మెచ్చుకోవడమెందుకు?
x

కోనసీమ ప్రభల తీర్థం ప్రత్యేకత ఏమిటీ, ప్రధాని మోదీ మెచ్చుకోవడమెందుకు?

కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల తీర్థానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. శతాబ్దాలుగా జరుగుతున్నాయి. ఏటా సంక్రాంతికి నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రధాని ప్రశంసలు దక్కాయి.



ప్రభల ఊరేగింపు చాలాచోట్ల జరుగుతూ ఉంటుంది. భారీ సైజులో ప్రభలను ఊరేగించడం తెలుగు నాట చాలాచోట్ల ఆనవాయితీగా వస్తోంది.

శివరాత్రి సందర్భంగా పల్నాడులోని కోటప్పకొండ ప్రభలు అత్యంత ఆడంబరంగా ఉంటాయి. పోటాపోటీగా కనిపిస్తాయి. అయితే కోటప్పకొండ ప్రభలను ట్రాక్టర్లపై ఊరేగిస్తారు. రాజకీయంగానూ తమ సత్తా చాటేందుకు ఆ ప్రభల ఊరేగింపును ఉపయోగించుకుంటారు.

కృష్ణా జిల్లాలోనూ ప్రభల తీర్థం జరుగుతుంది. ఘంటశాల తదితర ప్రాంతాల్లో ప్రభల ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీరభద్ర స్వామి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ తో పాటుగా తమిళనాడులో కూడా ఇలాంటి ప్రభల ఊరేగింపు ప్రదర్శనలు జరుగుతుంటాయి.

కోనసీమ ప్రత్యేకత ఏంటి

ఏటా సంక్రాంతి చివరి రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం ఘనంగా జరుగుతుంది. మిగిలిన ప్రాంతాలకు విరుద్ధంగా ఇక్కడ ప్రభలను స్థానికులే భుజాన మోసుకుంటూ ఊరేగించడం అనే ప్రత్యేకత ఉంటుంది.

అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దానిని తిలకించేందుకు వేలాది మంది వస్తూ ఉంటారు. దాదాపు 200 గ్రామాల నుంచి తాము రూపొందించిన ప్రభలను మోసుకుంటూ తీసుకురావడం ఆసక్తిగా ఉంటుంది.

పొలాలు, కాలువలు, గట్లు దాటుకుంటూ కొబ్బరితోటల్లో సాగించే ఈ ప్రభల ఊరేగింపు చూసేందుక వేలాది మంది తరలివస్తారు. దాంతో జనం రద్దీ పెద్ద తీర్థాన్ని తలపిస్తుంది. అందరికీ సందడి కలిగిస్తుంది.

జగ్గన్నతోట ప్రభల తీర్థానికి గంగలకుర్రు, అగ్రహరం, పుల్లేటికుర్రు, ముక్కామల, ఇరుసుమండ, మొసలపల్లి, వక్కలంక, వ్యాఘ్రేశ్వరం, పాలగుమ్మి, నేదునూరు, పెదపూడి వంటి గ్రామాల నుంచి ప్రభలు తీసుకొస్తారు. యువకులు వాటిని మోస్తూ తీసుకువస్తున్న దృశ్యాలు సాహసక్రీడలను తలపిస్తాయి.

ప్రభలంటే ఏంటి

స్వామి వారి ఊరేగింపులో భాగంగా అందరికీ కనిపించేలా ఎత్తులో అందంగా తీర్చిదిద్దిన నిర్మాణాన్నే ప్రభలు అని పిలుస్తుంటారు. దానిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో తయారు చేస్తారు. కోనసీమవాసులు వెదురు, తాటి బద్ధలతో ప్రభలను తీర్చిదిద్దుతారు. వాటికి కొత్త బట్టలు, రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు. కొబ్బరితాళ్లతో వాటిని కట్టి గట్టిగా సిద్దం చేస్తారు. నెమలి పింఛాలు వంటివి అలంకరణకు వాడుతారు.

సంక్రాంతికి కొన్ని నెలల ముందు నుంచే ఆయా గ్రామాల్లో ప్రభలను సిద్ధం చేసే ప్రక్రియ సాగుతుంది. గ్రామస్తులంతా ఇందులో భాగస్వాములవుతారు. సంక్రాంతి సమయంలో మకర సంక్రాంతి నాడు కొత్తపేట, కనుమ నాడు జగ్గయ్యపేటలో వాటిలో ఊరేగింపు జరుగుతుంది.

మేళతాళాలు వాయిస్తూ, సంప్రదాయ నృత్యాలు చేస్తూ ప్రభలను తీసుకొస్తారు. బాణసంచా కాల్చడం, గరగనృత్యాలతో సందడి కారణంగా ప్రభల ఊరేగింపు కోలాహలంగా మారుతుంది.

శతాబ్దాల కాలంగా..

ఒకరిని మించి ఒకరు పెద్ద ప్రభలను తయారు చేయడం అనేది పోటీ. 17వ శతాబ్దంలో ఈ ప్రభల తీర్థం మొదలయినట్టు ఆధారాలున్నాయి. 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రుల పేరుతో ప్రభలను భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకొస్తారు.

గతంలో వాకలగరువు గ్రామస్తులు రూపొందించిన 52 అడుగుల ఎత్తుండే ప్రభ అత్యంత భారీ ప్రభగా గుర్తింపు పొందింది. తొండవరం గ్రామస్తులు సిద్ధం చేసిన 51 అడుగుల ప్రభ దాని తర్వాత స్థానంలో ఉంది. ఈ ఏడాది కూడా 50 అడుగుల వరకూ ఎత్తున ఉండే ప్రభలు సిద్ధం చేసినట్టు చెబుతున్నారు.

"ప్రభలను మోయాలంటే చాలా బరువు ఉంటాయి. ఎదురు, తాడి బద్ధలతో కడతారు. వాటి బరువును యువకులే మోయాలి. సుమారుగా 200 కేజీల వరకూ కూడా కొన్ని ప్రభలుంటాయి. వాటిని మోసుకుంటూ కాలువలు దాటాలి, కొబ్బరి చెట్లు అడ్డంగా వస్తే పొలాల్లో మోకాలి లోతు వరకూ దిగబడిపోతుంటే, అందులో దిగి వెళ్ళాలి. కష్టంగానే ఉంటుంది. కానీ చాలామంది పోటీ పడుతుంటారు. ఎంత శ్రమతో కూడిన పని అయినా ఖాతరు చేయరు" అంటూ అంబాజీపేటకు చెందిన కుసుమ సత్యప్రసాద్ వివరించారు.

అందరూ బాగుండాలని నిర్వహించే ప్రభల తీర్థానికి కుల, మతాలకు అతీతంగా వస్తుంటారని ఆయన తెలిపారు.

మోదీ నుంచి ప్రశంసలు

కోనసీమ ప్రభల ఉత్సవాన్ని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అభినందించారు. నిర్వాహకులకు ఆయన నేరుగా లేఖ కూడా రాశారు.

2023 రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరేడ్ శకటం ప్రభల తీర్థం నమూనాలోనే రూపొందించి. అందరినీ ఆకట్టుకుంది. 400 ఏళ్లుగా సాగుతున్న ప్రభల ఉత్సవాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం పట్ల అంబాజీపేటకు చెందిన సామాజికవేత్త నేలపూడి స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు.

వ్యవసాయదారుల సామర్థ్యానికి పరీక్షగా నిలిచే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ఉన్న ప్రాధాన్యతను మరింత విస్తృతపరిచే కార్యక్రమాలు తాము చేపట్టబోతున్నట్టు ఆయన వివరించారు.

Read More
Next Story