
కాలువలో పడిపోయిన కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్
ఈతగాళ్లు, విపత్తు నిర్వహణ సిబ్బంది తక్షణమే నీటిలోకి దూకి కలెక్టర్‌ను, మరొక వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
సంక్రాంతి వేడుకల ఉత్సాహంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద శుక్రవారం (జనవరి 2, 2026) ఉదయం నిర్వహించిన పడవ పోటీల ట్రయల్ రన్‌లో ఆయన ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయారు. సిబ్బంది తక్షణమే స్పందించడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
అసలేం జరిగింది?
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోనసీమ జిల్లాలో ఘనంగా పడవ పోటీలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీల సన్నద్ధతను పరిశీలించేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లారు. పులిదిండి వద్ద గోదావరి కాలువలో ఏర్పాటు చేసిన కయాకింగ్ పడవను ఆయన స్వయంగా నడిపి చూశారు.
అదుపు తప్పిన కయాకింగ్
కలెక్టర్ మహేష్ కుమార్ పడవ నడుపుతుండగా, కొంత దూరం వెళ్లిన తర్వాత కయాకింగ్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో కలెక్టర్ మహేష్ కుమార్, ఆయన వెనుక ఉన్న మరో వ్యక్తి నీళ్లలో పడిపోయారు. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్న అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
రక్షించిన లైఫ్ జాకెట్.. అప్రమత్తమైన సిబ్బంది
అదృష్టవశాత్తూ కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటంతో నీటిలో మునిగిపోకుండా తేలారు. అక్కడే సిద్ధంగా ఉన్న గజ ఈతగాళ్లు, విపత్తు నిర్వహణ సిబ్బంది తక్షణమే నీటిలోకి దూకి కలెక్టర్‌ను, మరొక వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ముందస్తు భద్రతతోనే క్షేమం
ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న కలెక్టర్, భద్రతా ప్రమాణాలు పాటించడం వల్లే ప్రమాదం నుంచి బయటపడగలిగామని పేర్కొన్నారు. పండగ పోటీల సమయంలో ప్రజలు, సందర్శకులు కూడా ఇలాంటి భద్రతా చర్యలు కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Next Story

