
కోలుకున్న కొడాలి నాని..వివాహ వేడుకలో ప్రత్యక్షం
విదేశాలకు పారిపోకుండా కొడాలి నానిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు కొడాలి నాని చాలా రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యారు. గుండెకు సంబంధించిన సమస్యలతో ఇన్ని రోజులు ఇబ్బందులు పడిన కొడాలని నాని హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకల్లో ప్రత్యక్షమయ్యారు. అనారోగ్యం నుంచి కొడాలి నాని పూర్తిగా కోలుకున్నట్లు ఉన్నారని ఆయనను చూసిన వాళ్లు చర్చించుకుంటున్నారు. కార్యక్రమంలో చాలా హుషారుగానే కనిపించారు.
కొడాలి నాని గత కొద్ది నెలలుగా గుండెకు సంబంధించిన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయనను చికిత్సల కోసం తొలుత హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పూర్తి స్థాయిలో గుండె సమస్యలు నయం కాకపోవడంతో ముంబాయికి తరలించారు. హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబాయికి తరలించారు. అక్కడ చికిత్సల అనంతరం కొడాలి నానిని తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌లోనే ఉంటున్న కొడాలి నాని అక్కడ గచ్చిబౌలీలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పడు నెట్టింట వైరల్‌గా మారింది. చాలా రోజుల తర్వాత కొడాలి నాని బయటకు రావడంపైనా, ప్రజల మధ్య కనించడంపైనా చర్చగా కూడా మారింది.
అనారోగ్య పరిస్థితుల కారణంగా విశ్రాంతి కోసం కొడాలి నాని అమెరికా వెళ్తారని ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. గత ఐదేళ్లల్లో కొడాలి నాని అక్రమాలు, అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలో కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్నారి, ఆయన విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని టీడీపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కొడాలి నానిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని వివాహ కార్యక్రమం కోసం బయటకు రావడం, దాని తాలూకు ఫొటో వైరల్ కావడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
Next Story