ఆర్ఎస్ఎస్ నుంచి కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రస్థానం
x

ఆర్ఎస్ఎస్ నుంచి కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రస్థానం

సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. కిషనన్న అని అభిమానులు పిలుచుకునే కిషన్ రెడ్డి ప్రస్థానంపై స్టోరీ


రంగారెడ్డి జిల్లాకు చెందిన మధ్య తరగతి రైతు కుటుంబం అయిన గంగాపురం స్వామిరెడ్డి, అండాళమ్మ దంపతులకు 1960వ సంవత్సరంలో కిషన్ రెడ్డి జన్మించారు.ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడైన కిషన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి క్రియాశీలంగా పాల్గొన్నారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. జనతాపార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించారు.

- 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా చేరారు. నాటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ బీజేపీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించారు.
- 2002వసంవత్సరంలో కిషన్ రెడ్డిని భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కిషన్ రెడ్డి వరల్డ్ యూత్ కౌన్సిల్ అగెనెస్ట్ టెర్రరిజం సంస్థను స్థాపించి ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సీమా సురక్షా జాగరణ్ యాత్రను చేపట్టారు. పాక్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్ దేశాల సరిహద్దుల గుండా 1200కిలోమీటర్ల దూరం 45 రోజుల పాటు యాత్ర చేశారు.
అంచెలంచెలుగా ఎదిగి...
కిషన్ రెడ్డి బీజేవైఎంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో బీజేపీవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనరుగా, 1982లో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా బాధ్యతలను కిషన్ రెడ్డి నిర్వర్తించారు. 1983లో బీజేవైఎం కార్యదర్శిగా, 1986లో బీజేవైఎం రాష్ట్రఅధ్యక్షుడిగా, 1990లో బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా , 192లో బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా, 1994లో జాతీయ ప్రదానకార్యదర్శిగా పనిచేశారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, అధికార ప్రతినిధిగా , బీజేపీ కార్యాలయ ఇన్ చార్జీగా పనిచేశారు. 2010 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ప్రస్థానం
2004వ సంవత్సరంలో మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.విపక్ష పార్టీల నేతలు ఓడి పోవడంతో కిషన్ రెడ్డి అసెంబ్లీలో ప్రజాసమస్యలపై గళమెత్తారు. అసెంబ్లీ చర్చల్లో పాల్గొని చేసిన ప్రసంగాలతో ప్రజల మన్ననలు పొందారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ బీజేపీ వాణిని వినిపించారు.
బీజేపీ శాసనసభా పక్ష నేతగా...
2004 నుంచి 2018వ సంవత్సరం వరకు హిమాయత్ నగర్, అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి బీజేపీ శాసనసభా పక్ష నేతగా పనిచేశారు.

చిన్నారులకు గుండె ఆపరేషన్ల కోసం ఉద్యమం
చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసి వారి ప్రాణాలు కాపాడాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ చేసిన ఉద్యమంలో కిషన్ రెడ్డి చొరవ తీసుకొని పాల్గొన్నారు. దీని వల్ల ఎందరో చిన్నారులకు ఉచితంగా సర్కారు ఆపరేషన్లు చేయించింది.తన జీవితంపై స్వామి వివేకానందుడి ప్రభావం ఉందని, ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లో ముందుకు సాగుతున్నానంటారు కిషన్ రెడ్డి.

కేంద్రమంత్రిగా...
2019వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి 2019లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా, 2021 నుంచి కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2023 జులైలో నాలుగో సారి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

మోదీతో కలిసి అమెరికా యాత్ర
అమెరికన్ కౌన్సిల్ ఫర్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానం మేరకు నరేంద్రమోదీతో కలిసి 1994వ సంవత్సరంలో అమెరికాలో కిషన్ రెడ్డి పర్యటించారు. బీజేవైఎం ప్రతినిధిగా ఇజ్రాయెల్ దేశంలో పర్యటించారు. 2020లో వాషింగ్టన్ డీసీలో జరిగిన వరల్డ్ విజన్ 2020 సదస్సులో పాల్గొన్నారు. చైనా, యూకే, ఫ్రాన్స్, కెనడా, నేపాల్ దేశాల్లో కిషన్ రెడ్డిి పర్యటించి అక్కడి యూత్ పాలసీలపై అధ్యయనం చేశారు. ఆస్ట్రేలియాలో నో మనీ ఫర్ టెర్రర్ సదస్సులో, న్యూయార్క్ లో పర్యాటక సంస్థ నిర్వహించిన సమావేశంలో ఈయన పాల్గొన్నారు.

ఎన్నెన్నో అవార్డులు
కిషన్ రెడ్డికి పలు అవార్డులు లభించాయి. చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయాలని ఉద్యమించిన కిషన్ రెడ్డికి యునిసెఫ్ ‘ఛైల్డ్ ఫ్రెండ్లీ లెజిస్లేటర్ ’ అవార్డును ప్రదానం చేసింది. 2009లో అమెరికాలోని మేరీలాండ్ ఇండియా బిజినెస్ టేబుల్ నుంచి ఔట్ స్టాండింగ్ యూత్ లీడర్ షిప్ అవార్డును కిషన్ రెడ్డి పొందారు. బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన సభలో బల్గేరియన్ కమాండోల నుంచి ప్రపంచ శాంతి మెడల్ పొందారు.

తెలంగాణ పోరుయాత్ర

తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కృష్ణా నది నుంచి గోదావరి నది దాకా 25 రోజుల పాటు తెలంగాణ పోరుయాత్రను కిషన్ రెడ్డి చేశారు. ఈ యాత్రలో భాగంగా 333 సమావేశాల్లో ప్రసంగించారు. తెలంగాణ హోంగార్డుల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా పోరాడి వారికి వేతనాలు పెంచడానికి కృషి చేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఛైర్మన్ గా, అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ జాతీయ కార్యదర్శిగా, వరల్డ్ యూత్ కౌన్సిల్ అగెనెస్ట్ టెర్రరిజం అంతర్జాతీయ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.


Read More
Next Story