చక్రం తిప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. తంబళ్లపల్లిలో మారిన సీన్‌..
x

చక్రం తిప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. తంబళ్లపల్లిలో మారిన సీన్‌..

రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఒక పార్టీ వారు మరో పార్టీ వారిని శాశిస్తున్నారు. చంద్రబాబును బిజెపి వారు ముప్పు తిప్పలు పెడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ రంగులు రోజు రోజుకు మారుతున్నాయి. రంగులు మారుతున్నాయనే కంటే పార్లమెంట్‌ అభ్యర్థి గెలుపు కోసం అసెంబ్లీ అభ్యర్థుల మార్పును పార్లమెంట్‌ అభ్యర్థి కోరుకుంటున్నారు. పార్లమెంట్‌ అభ్యర్థి బిజెపి వారు, అసెంబ్లీ అభ్యర్థి టీడీపీ వారు.. అలాంటప్పుడు ఎవరిపని వారు చూసుకోవాలి. కానీ ఏపీలో అలా లేదు. నేను చెప్పిన అభ్యర్థిని నా పార్లమెంట్‌ నియోజకవర్గంలో పెట్టాలని బిజెపి వారు కోరుతున్నారు. ఇదీ అసలు విషయం. పైగా పార్టీలు, నాయకులు పేరుకు మాత్రమే. వ్యక్తులు, వారి మధ్య ఉండే సంబంధాలు రాజకీయ మార్పులకు కారణం అవుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల బిజెపిలో చేరి రాజంపేట పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయం సాధించారు. తిరిగి ఇక్కడి నుంచి మిథున్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తుండగా ఈ సారి తన రాజకీయ భవిష్యత్‌ను పరీక్షించుకునేందుకు ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపి తరపున రంగంలోకి దిగారు.
రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, రాజంపేట, రాయచోటి పుంగనూరు ఉన్నాయి. పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉండగా మిగిలిన ఆరు నియోకజవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రంగంలో ఉన్నందున ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత పెరిగింది.
తంబళ్లపల్లిలో అభ్యర్థి మార్పు
తంబళ్లపల్లి నియోజకర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం జయచంద్రారెడ్డి ఉన్నారు. ఈయన కాంట్రాక్టర్‌. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహకర్త రాబిన్‌శర్మ సూచన మేరకు ఈయనకు నారా లోకేష్‌ చంద్రబాబు ద్వారా టిక్కెట్‌ ఇప్పించారు. టిక్కెట్‌ తీసుకునేటప్పడు డబ్బులు కనీసం రూ. 30 కోట్లు డిపాజిట్‌ చూపించాలని పార్టీ వారు కోరారు. దీంతో హైదరాబాద్‌లో కొందరు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి ఒక్క రోజు వడ్డీకి తీసుకొని రూ. 30 కోట్లు డిపాజిట్‌ చూపించారు. ముప్పై కోట్లు ఉన్నప్పుడు మరో రూ. 20 కోట్లు ఈజీగా చూసుకుంటారనే భావనలో జయచంద్రారెడ్డికి టిక్కెట్‌ ఇచ్చారు. ప్రస్తుతం డబ్బులకు ఇబ్బంది ఎందుకొచ్చిందని ఆరా తీస్తే ఆయన వద్ద డబ్బు లేదు. గతంలో రోజు వడ్డీకి తెచ్చి చూపించారని తేలిపోయింది.
దీంతో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా జయచంద్రారెడ్డిపై సదాప్రాయం లేదు. అభ్యర్థిని మార్చాలని కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన సూచన మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శంకర్‌ యాదవ్‌ను రంగంలోకి దించుతున్నారు. నియోజకవర్గంలో శంకర్‌యావ్‌కు ఓట్లు కూడా బాగానే వచ్చే అవకాశం ఉన్నట్లు టీడీపీ భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. పొత్తులో భాగంగా శంకర్‌ యాదవ్‌కు సీటు ఇవ్వాలని కిరణ్‌కుమార్‌రెడ్డి కోరటం వల్ల శంకర్‌యావ్‌కు సీటు సులభంగా వచ్చిందని చెప్పొచ్చు. ఇవ్వాళో, రేపో అభ్యర్థిగా శంకర్‌ యాదవ్‌ పేరు ప్రకటించే అవకాశం ఉంది. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి శంకర్‌యాదవ్‌ టిక్కెట్‌ సంపాదించారు. అయితే అప్పుడు ఓటమి చెందారు. తరువాత 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి గెలిచారు. తిరిగి 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో టీడీపీ వారు సీటు ఇవ్వలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి శిశ్యుడు కావడం వల్ల ఆయన కోరికమేరకు ఇప్పుడు టిక్కెట్‌ సంపాదిస్తున్నారు.
Read More
Next Story