కిడ్నీకి రూ.30 లక్షలు ఇస్తామని చెప్పి.. భారీ మోసం
‘కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తాం’ అంటూ ఆశచూపి గుంటూరుకు చిందిన ఓ వ్యక్తిని మోసం చేసింది విజయవాడలోని కిడ్నీ రాకెట్. విజయవాడలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.
‘కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తాం’ అంటూ ఆశచూపి గుంటూరుకు చిందిన ఓ వ్యక్తిని మోసం చేసింది విజయవాడలోని కిడ్నీ రాకెట్. విజయవాడలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. విజయవాడలో ఇంత పెద్ద కిడ్నీ దందా జరుగుతుందా అని అక్కడి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను వెంటనే నివారించాలని, పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తామని పరికొందరు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తాం అంటూ కిడ్నీ ముఠా ఓ వ్యక్తిని అప్రోచ్ అయింది. ఆర్థిక ఇబ్బందుల వల్లో, అంత మొత్తం అనడంతో ఆశపడో ఓకే చెప్పేశాడా వ్యక్తి. తీరా ఆపరేషన్ పూర్తయ్యి కిడ్నీ తీసేసుకున్న తర్వాత డబ్బు లేదు ఏం లేదు పో అంటూ మోసం చేయడమే కాకుండా, బెదిరింపులకు కూడా పాల్పడిందా ముఠా. దీంతో ఏం చేయాలో తోచని బాధితుడు తన చివరి ప్రయత్నంగా పోలీసులను ఆశ్రయించాడు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో తనకు జరిగిన ఘటనను వివరించి ఫిర్యాదు చేశాడు. అంతే కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగు చూసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు అనే వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అతనికి సోషల్ మీడియాలో విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. మధుబాబుకు ఉన్న ఆర్థిక అవసరాన్ని బాషా తన అవకాశంగా మార్చుకున్నాడు. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి నమ్మించాడు. అంత డబ్బు వస్తే తన సమస్యలన్నీ తీరిపోవడమే కాకుండా.. తాను కూడా సెటిల్ అయిపోవచ్చని భావించిన మధుబాబు.. అందుకే ఓకే చెప్పాడు.
కిడ్నీ ఇవ్వడానికి మధుబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూలై మొదటి వారంలోనే ఆపరేషన్ షెడ్యూల్ చేశారు. విజయవాడలోని విజయ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు. కిడ్నీ ఇచ్చిన తర్వాత మధుబాబుకు రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా బాషా కేవలం రూ.1.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. మిగిలిన డబ్బు ఇవ్వాలని మధుబాబు అడగడంతో.. బాషా తన అసలు రూపం చూపాడు. స్నేహితుడిగా కిడ్నీ దానం చేశావ్.. అదే విధంగా సంతకం కూడా చేశావ్.. కాబట్టి నీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదంటూ దబాయించాడు. అప్పుడు తాను మోసపోయాన్న నిజం మధుబాబుకు అవగతమైంది. దీంతో బాధతో కుంగిపోకుండా గుంటూరు ఎస్పీని ఆశ్రయించాడు. డాక్టర్ శరత్‌బాబు, మధ్యవర్తి బాషాపై ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. తీగ లాగితే డొంక కదిలన మాదిరిగా ఈ కేసు విచారణలో దీని వెనక ఓ పెద్ద ముఠా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ముఠా గుట్టు రట్టు చేసే విధంగా దర్యాప్తును సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.