నారా లోకేష్ ఇలాకాలో ఇంటర్ అమ్మాయి కిడ్నాప్ కలకలం
x
A.I. Image

నారా లోకేష్ ఇలాకాలో ఇంటర్ అమ్మాయి కిడ్నాప్ కలకలం

ఓ ప్రేమ ఉన్మాది తన స్నేహితులతో కలిసి యువతి ఇంటిపై దాడి చేసి ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని ఎత్తుకెళ్లాడు.


మంత్రి నారా లోకేష్ ఇలాకాలో దారుణం చోటుచేసుకుంది. కన్నవారి కళ్లముందే కన్నకూతురిని బలవంతంగా ఎత్తుకెళ్లిన దుశ్చర్య మంగళగిరిలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారిన ఓ యువకుడు, గ్యాంగ్‌తో వచ్చి బాలిక ఇంటిపై దాడి చేసి పట్టపగలే కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. పోలీసులు కేవలం 12 గంటల వ్యవధిలోనే మెరుపు వేగంతో స్పందించి, నిందితుడిని సచివాలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పట్టణంలోని గండాలయపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.
అసలేం జరిగింది?
గండాలయపేటకు చెందిన ఓ బాలిక విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 2వ తేదీన బాలిక కాలేజీకి వెళ్లకుండా కురగల్లుకు చెందిన రవితేజ అనే యువకుడితో కలిసి బయటకు వెళ్లింది. కాలేజీ యాజమాన్యం సమాచారంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. తమ కుమార్తెను మందలించి ఇంట్లోనే ఉంచారు.
ఇంటిపై దాడి.. బలవంతంగా కిడ్నాప్
బాలికను ఇంటికి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేని రవితేజ, మరికొందరు యువకులతో కలిసి బాలిక ఇంటిపై దాడి చేశాడు. అడ్డువచ్చిన తల్లిదండ్రులను నెట్టివేసి, బాలికను బలవంతంగా లాక్కెళ్లాడు. దీంతో బాధితులు వెంటనే మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు.
12 గంటల్లోనే చేధించిన పోలీసులు
ఘటన తీవ్రతను గుర్తించిన పట్టణ సీఐ వీరాస్వామి వెంటనే రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టెక్నాలజీ సాయంతో నిందితుడి ఆచూకీని వెలికితీశారు. ఆదివారం ఉదయానికి వెలగపూడి సచివాలయం వద్ద రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకుని బాలికను సురక్షితంగా రక్షించారు.
నిందితులపై కఠిన చర్యలు
ముఖ్య నిందితుడు రవితేజపై కిడ్నాప్, దాడి కేసులతో పాటు మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో (POCSO) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అతనికి సహకరించిన విజయవాడ, కురగల్లుకు చెందిన మిగిలిన యువకులను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. కాగా, బాలిక తన తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను ప్రస్తుతం 'మేయర్స్ హోం'కు తరలించారు.
Read More
Next Story