
ఖాకీల వేధింపులు..స్టేషన్‌లోనే చెయ్యి కోసుకున్న మహిళ
తన భర్తను స్టేషన్‌లో నిర్బంధించి, సుమారు రూ. 10 కోట్ల విలువైన ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారని ఆమె ఆరోపించారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక జ్యోతి అనే మహిళ పోలీస్ స్టేషన్‌లోనే చెయ్యి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, కొందరు రాజకీయ నాయకులు కలిసి తమను వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.
రూ. 10 కోట్ల ఆస్తి వివాదం
బాధితురాలు జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వేదికగా సివిల్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. తన భర్తను స్టేషన్‌లో నిర్బంధించి, సుమారు రూ. 10 కోట్ల విలువైన ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారని ఆమె ఆరోపించారు. అంతటితో ఆగకుండా, మరికొన్ని ఆస్తులు కూడా రాయాలని తమపై ఒత్తిడి తెస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి నిర్బంధాలు.. దుర్భాషలు
"20 రోజుల క్రితం నన్ను, నా కుమార్తెను అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించారు. మహిళ అని చూడకుండా సీఐ నన్ను అత్యంత అసభ్య పదజాలంతో దూషించారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో మళ్లీ పోలీసులు ఇంటికి వచ్చి బలవంతంగా నన్ను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సీఐ మరోసారి దుర్భాషలాడటంతో ప్రాణభయం వేసి ఆత్మహత్యకు ప్రయత్నించాను" అని జ్యోతి కన్నీటి పర్యంతమయ్యారు.
న్యాయం కోసం వేడుకోలు
సీఐ వెంకట్రావు వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమను ఆస్తి కోసం వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను వేడుకున్నారు. కాగా, పోలీస్ స్టేషన్ లోపలే మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Next Story

