లొంగిపోయిన టీడీపీ ఆఫీసుపై దాడిలో కీలక నిందితుడు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడు ఈ రోజు కోర్టులో లొంగి పోయాడు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఈ రోజు కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసులో పానుగంటి చైతన కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసుకు సంబంధించి వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన సోమవారం మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. పానుగంటి చైతన్య వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. అక్టోబరు 19, 2021లో జరిగిన ఈ దాడిలో టీడీపీ నేత దొరబాబుతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. కార్యాలయంలోని ఫర్నచర్‌ను ద్వంసం చేశారు. కార్యాలయం ప్రాంగణంలో ఉన్న కార్లపై కూడా దాడికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
వైఎస్‌ఆర్‌సీపీ విద్యా విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పానుగంటి చైతన్య ఈ దాడిలో ప్రత్యకంగా పాల్గొన్నాడని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి పానుగంటి చైతన్య ప్రధాన అనుచరుడని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పానుగంటి చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణలకు చెందిన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దాడుల వెనుక వీరి హస్తముందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరో వైపు ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.