ఆడారికి ‘ఆనందం’!
x
పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరుతున్న ఆడారి ఆనందకుమార్‌

ఆడారికి ‘ఆనందం’!

వైసీపీ నుంచి బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనందకుమార్‌కు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది.


రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయించడం, ఏ ఎండకా గొడుగు పట్టడం సహజమే. చాలామంది రాజకీయ నేతలు వ్యాపారాలు, కాంట్రాక్టులు వంటివి చేసుకుంటారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ వారికి ఏ ఇబ్బందులూ ఉండవు. అధికారం కోల్పోయాక కొత్తగా పవర్‌లోకి వచ్చిన వారితో తలెత్తే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పగలతో పాటు ప్రతీకారాలు తీర్చుకుంటారు. అందుకే కొంతమంది నేతలు అప్పటివరకు ఉన్న పార్టీకి గుడ్‌ బై చెప్పేసి అధికార పార్టీలోకో, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీలోకో జంప్‌ చేస్తారు. దీంతో తమ వ్యాపారాలకు, వ్యవహారాలకు ఎలాంటి ఢోకా లేకుండా నిశ్చింతగా ఉండగలుగుతారు. ఇదంతా ఇప్పుడెందుకంటే? విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనందకుమార్‌ పరిస్థితి ఇందుకు దర్పణం పడుతోంది.

విశాఖ డెయిరీ

విశాఖ డెయిరీని 1973లో ఆడారి తులసీరావు స్థాపించారు. అప్పట్నుంచి ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల రైతుల పశువుల నుంచి పాల సేకరణ చేపట్టారు. అనంతరం ఈ డెయిరీని 1999లో శ్రీ విజయ విశాఖ జిల్లా పాల ఉత్పత్తిదారుల మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో–ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌గా రిజిస్టర్‌ చేశారు. ఆపై 2006లో దీనిని శ్రీ విజయ విశాఖ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌గా మార్చారు. 1973 నుంచి 2023 వరకు 50 ఏళ్ల పాటు తులసీరావే విశాఖ డెయిరీ చైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత ఆయన తనయుడు ఆనంద్‌కుమార్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు.
టీడీపీ నుంచి వైసీపీలోకి..
విశాఖ డెయిరీ ఆవిర్భావం నుంచి ఆడారి తులసీరావు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 2019లో అప్పటి ప్రతీకార రాజకీయ పరిస్థితులతో ఆయన కుమారుడు ఆనందకుమార్, కుమార్తె రమాకుమారిలు వైసీపీలో చేరారు. అప్పట్నుంచి 2024 వరకు వైసీపీలోనే కొనసాగారు. 2024 ఎన్నికల్లో ఆనందకుమార్‌ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ డెయిరీకి, చైర్మన్‌ ఆనందకుమార్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఈ డెయిరీలో అనేక అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సహా మరికొందరు బహిరంగంగా ఆరోపణలు గుప్పించారు. అవసరమైతే చైర్మన్‌ను మారుస్తామని, అరెస్టు చేయిస్తామని కూడా చెప్పారు. అనంతరం విశాఖ డెయిరీపై విచారణకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో హౌస్‌ కమిటీని నియమించారు. ఆ కమిటీ చైర్మన్, సభ్యులు డెయిరీకి వచ్చి విచారణ కూడా చేపట్టారు.
వైసీపీని వీడి.. బీజేపీలో చేరి..
ఈ నేపథ్యంలో వైసీపీలో కొనసాగితే తనకు రాజకీయంగానే కాదు.. డెయిరీ పరంగానూ ఇబ్బందులు ఖాయమన్న భావనకొచ్చిన చైర్మన్‌ ఆనందకుమార్‌.. తన సోదరి రమాకుమారి గత డిసెంబరులో వైసీపీకి రాజీనామా చేశారు. తొలుత టీడీపీ/జనసేనలో చేరాలనుకున్నారు. అయితే టీడీపీలో చేరేందుకు స్పీకర్‌ అయ్యన్న ససేమిరా అనడంతో ఆ యోచనను విరమించుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని ఆ దిశలో రహస్యంగా పావులు కదిపారు. అపై రాజమండ్రిలో ఆడారితో పాటు 12 మంది డైరెక్టర్లు, ఆయన సోదరి, యలమంచిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి అప్పటి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆడారిని బీజేపీలో ఎలా చేర్చుకుంటారంటూ టీడీపీ నేతలు అనకాపల్లి ఎంపీ (బీజేపీ) సీఎం రమేష్‌ను ప్రశ్నించారు. అయితే ఆడారి చేరికకు ఒక రోజు ముందే పురందేశ్వరి తనకు ఫోన్‌ చేశారని ఆయన సమాధానమిచ్చారు. చాన్నాళ్లుగా విశాఖ డెయిరీపైన, చైర్మన్‌ ఆడారి ఆనందకుమార్‌పైన గుర్రుగా ఉన్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆడారిని బీజేపీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన వ్యతిరేకతను తెలియజేశారు. విశాఖ డెయిరీపై వచ్చిన ఆరోపణలపై హౌస్‌ కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో చైర్మన్‌ను బీజేపీలో చేర్చుకోవడం సమంజసం కాదని చెప్పారు. అది బీజేపీ వ్యవహారం కాబట్టి అందులో తలదూర్చలేమని అయ్యన్నకు సీఎం స్పష్టం చే సినట్టు తెలిసింది.
వ్యూహం ఫలించింది.. కీలక పదవి దక్కింది..
బీజేపీలో చేరాలన్న విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనందకుమార్‌ వ్యూహం ఫలించింది. ఆ పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నందుకు ఆయనకు మేలే జరిగింది. శుక్రవారం ప్రకటించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఆనందకుమార్‌కు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది. దీంతో విశాఖ డెయిరీకి, ఆయన రాజకీయ భవిష్యత్తుకు రక్షణ లభించినట్టయింది. ఇప్పటికే ఆడారి తన పరివారంతో బీజేపీలో చేరికతో విశాఖ డెయిరీపై హౌస్‌ కమిటీ దూకుడు తగ్గింది. బీజేపీలో ఆడారికి కీలక పదవి దక్కడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ప్రాధాన్యతనిస్తుండడంతో విశాఖ డెయిరీ ఇక సేఫ్‌ జోన్‌లోకి వెళ్లినట్టేనన్న అభిప్రాయం డెయిరీతో పాటు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
Read More
Next Story