సినిమా టికెట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
x

సినిమా టికెట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమాల హీరోలు సీఎం, డిప్యూటీ సీఎం బంధువులు కావడంతో అధిక షోలు, రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చిందని హైకోర్టులో పిల్‌ వేశారు.


ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్న చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావమర్ధి, వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘డాకు మహరాజ్‌’ సినిమాల టికెట్ల «పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పందించింది. పెంచిన టికెట్ల ధరల అంశంలోను, ఎన్ని రోజులు వరకు పెంచుకోవచ్చనే అంశంపైనా స్పందించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గేమ్‌ ఛేంజర్, డాకు మహరాజ్‌ సినిమాలకు కోసం పెంచిన టికెట్ల ధరలను కేవలం పది రోజులకే పరిమితం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇది వరకు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేశామని, ప్రస్తుత సినిమాలకు అవి కూడా వర్తిస్తాయని వెల్లడించింది.

సినిమాల టికెట్ల పెంచేది లేదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌–సంధ్యా థియేటర్‌ ఘటన తర్వాత ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని సినీ పెద్దలకు అవకాశం కల్పించింది. డిమాండ్‌ అండ్‌ సప్లై ఆధారంగా టికెట్లు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రి గేమ్‌ ఛేంజర్‌ మెగా ఈవెంట్‌లో బహిరంగానే ప్రకటించారు. హీరో అభిమానులు, ప్రేక్షకులు ఎక్కువ మంది తొలి రోజు చూసేందుకు ఆకస్తి కనబరుస్తారని, అంటే డిమాండ్‌ పెరిగినట్టేనని, తక్కిన వస్తువులు మాదిరిగానే సినిమాకు కూడా డిమాండ్‌ అండ్‌ సప్లైని ఆధారంగా టికెట్లు పెంచుకోవచ్చని, ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం సినిమా టికెట్లు పెంచుకునేందుకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. పైగా టికెట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి లాస్‌ ఏమీ లేదని, దాని వల్ల ప్రభుత్వానికి 18 శాతం జీఎస్‌టీ ద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు.
సినిమాకు సంబంధించిన మరో వివాదాస్పాద అంశమైన ప్రీమియర్, బెనిఫిట్‌ షోలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్‌ షోలను వేసుకోవచ్చని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వేళ కాని వేళల్లో బెనిఫిట్‌ షోలను వేయడం, వాటికి సినీ ప్రముఖులు రావడం, దీని వల్ల తొక్కిసలాటలు చోటు చేసుకోవడం, దీంతో ప్రమాదాలు జరగడాన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్‌ షోలను నిలిపి వేసింది. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకోని ఏపీ ప్రభుత్వం కేవలం సినీ పెద్దల వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి లాభం చేకూర్చేందుకు బెనిఫిట్‌ షోలు వేసుకోవచ్చని అనుమతులు ఇచ్చేసింది. అంతేకాకుండా సినిమా ప్రదర్శనల సంఖ్యను కూడా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. రోజుకు ఆరు షోలు, ఐదు షోలు వేసుకోవచ్చనే వెసులుబాటును కూడా సినీ వాప్యారులకు కల్పించింది.
ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన అరిగెల శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్‌ను ఆశ్రయించారు. గేమ్‌ ఛేంజర్, డాకు మహరాజ్‌ సినిమాలకు అధిక షోల ప్రదర్శన, టికెట్‌ ధరల పెంపును అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో ఆయన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ జరిపింది. పిటీషనర్‌ తరపున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. టికెట్‌ ధరలను పెంచుకునేందుకు సినీ పెద్దలకు లాభాలు చేకూర్చుకునేందుకు 14 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవకాశం కల్పించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ సినిమాలు, అందులోని హీరోలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు సొంత బందువులు కావడంతో అధిక షోలు, అధిక ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం అనుమతిచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా రాజమండ్రిలో జరిగిన గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ మెగా ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని కోర్టుకు వివరించారు. వేళ కాని అర్థరాత్రి వేళల్లో సినిమాల ప్రీమియర్‌ షోలు, బెనిఫిట్‌ షోలు ప్రదర్శించడం వల్ల ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో ప్రీమియర్‌ షోలు, బెనిఫిట్‌ షోలను నిలపి వేయాలని పిటీషనర్‌ తరపున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. దీనిపైన స్పందించిన హై కోర్టు ధర్మాసనం విచిత్రమైన వ్యాఖ్యలు చేసింది. సంబంధం లేని పోలిక పెట్టి వ్యాఖ్యలు చేసింది. సినిమాల ప్రదర్శనకు, రాకెట్‌ ప్రయోగాల ప్రదర్శనకు లింకు పెట్టి వ్యాఖ్యలు చేసింది. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తులు మరణించారనే కారణంతో శ్రీహరికోటలో ప్రయోగాలు నిలిపివేయాలని అన్నట్లుగా మీ అభ్యర్థన ఉందని పిటీషనర్‌ తరపున న్యాయవాదిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. అయితే ఈ పిల్‌పైన తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.
Read More
Next Story