వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం..రంగంలోకి సిట్‌
x

వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం..రంగంలోకి సిట్‌

సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఎప్పటికి మిస్టరీ వీడుతోందనేది ప్రశ్నార్థకంగా మారింది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు తాజాగా మరో సారి తెరపైకొచ్చింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా మృత్యువాత పడుతుండంతో మిస్టరీగా మారింది. దీనిపైన కూటమి ప్రభుత్వం అలెర్ట్‌ అయ్యింది. వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఎందుకు మరణిస్తున్నారనే దానిపై నిగ్గుతేల్చేందుకు సిట్‌ను రంగంలోకి దింపింది. గత కొన్ని రోజులుగా కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తూ, విచారణ జరుపుతున్న సిట్‌ బృందం తాజాగా వివేకా హత్య కేసులో సాక్షుల్లో ఒకరైన కసుమూరు పరమేశ్వరరెడ్డిని శనివారం సిట్‌ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారణకు పిలుస్తారని పరమేశ్వరరెడ్డి సిట్‌ అధికారుల మీద సీరియస్‌ అయ్యారు. అయినా పరమేశ్వరరెడ్డి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

మరో వైపు వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఈ నేపథ్యంలో రంగన్న భార్య సుశీలమ్మను కూడా శనివారం సాయంత్రం సిట్‌ అధికారులు విచారించనున్నారు. అయితే పరమేశ్వరరెడ్డికి నోటీసులు ఇవ్వకుండానే విచారణ చేపట్టిన సిట్‌ అధికారులు, దీనిపై విమర్శలు వినిపించిన నేపథ్యంలో రంగన్న భార్య సుశీలమ్మకు ముందుగానే నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారి బంధువులను, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను కూడా సిట్‌ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులు ఇప్పటి వరకు మృత్యువాత పడ్డారు. అయితే ఇటీవల రంగన్న అనారోగ్యంతో మరణించడంతో కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో రంగన్న కేసును సిట్‌ అధికారులు తిరగదోడుతున్నారు. అంతకు ముందు చనిపోయిన ఐదుగురు సాక్షుల మరణాలపై కూడా ఎందుకు చనిపోయారనే కోణంలో సిట్‌ దర్యాప్తు చేపట్టింది.
Read More
Next Story