టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటర్ పోల్ జోక్యం
x

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటర్ పోల్ జోక్యం

ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రభాకరరావు, శ్రవణ్ రావును ఇండియాకు పిలిపించేందుకు సీబీఐ అమెరికాలోని ఇంటర్ పోల్ కు లేఖ రాసింది.


టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చెబుతున్న ప్రభాకరరావు, శ్రవణ్ రావును ఇండియాకు పిలిపించేందుకు సీబీఐ అమెరికాలోని ఇంటర్ పోల్ కు లేఖ రాసింది. బీఆర్ఎస్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)కి ప్రభాకరరావు చీఫ్ గా పనిచేశారు. అలాగే శ్రవణ్ రావు ఒక మీడియాకు అధిపతి. బీఆర్ఎస్ పెద్దతలకాయలతో ఉన్న సన్నిహితంతో పై ఇద్దరు టెలిఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో బయటపడింది. ఎప్పుడైతే ట్యాపింగ్ అంశం వెలుగుచూసిందో వెంటనే ప్రభాకరరావు అమెరికాకు పారిపోయారు. శ్రవణ్ కూడా దుబాయ్ పారిపోయినట్లు అనుమానించిన పోలీసులు ఇపుడు ఆయన కూడా అమెరికాలోనే ఉన్నారని అనుకుంటున్నారు.

ట్యాపింగ్ విచారణలో భాగంగా పై ఇద్దరి తరపున కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతిరావు, ప్రదీప్ రావు, రాధాకిషన్ రావుతో పాటు మరికొందరిని సిట్ అరెస్టుచేసి విచారించింది. ఈ విచారణలోనే ప్రభాకరరావు చెప్పినట్లే తాము నడుచుకున్నట్లు అరెస్టయిన పోలీసు అధికారులు చెప్పారు. అయితే ఎవరు చెబితే ప్రభాకరరావు తన కిందపనిచేసిన సిబ్బందితో టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారన్న విషయం బయటకు రాలేదు. ప్రభాకరరావు, శ్రవణరావులను సిట్ విచారిస్తే కాని పెద్ద తలకాయల విషయం బయటకురాదు. వీళ్ళేమో అమెరికాలో కూర్చున్నారు. వీళ్ళని హైదరాబాదుకు రప్పించేందుకు సిట్ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అమెరికా నుండి వీళ్ళని పిలిపించాలన్నా లేదా అక్కడ అరెస్టుచేసి రప్పించాలన్నా పెద్ద తతంగం ఉంది.

ఇపుడు విషయం ఏమిటంటే సిట్ అధికారులు ఇదే విషయమై సీబీఐ సాయాన్ని కోరారు. హైదరాబాద్ పోలీసు కమీషనర్ గా పనిచేసిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఢిల్లీకి వెళ్ళి సీబీఐ ఉన్నతాధికారులను కలిశారు. అమెరికాలో ఉన్న ప్రభాకరరావు, శ్రవణ్ ను హైదరాబాదుకు రప్పించాల్సిన అవసరాన్ని సీబీఐ ఉన్నతాదికారులకు వివరించారు. దాంతో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సహకరించేందుకు సీబీఐ అంగీకరించింది. అంగీకరించటమే కాకుండా అమెరికాలోని ఇంటర్ పోల్ ఉన్నతాధికారులకు కేసు వివరాలను వివరిస్తు ఒక లేఖ రాసింది. అమెరికాలో ఉంటున్న నిందితులిద్దరిపైనా వెంటనే రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసి వాళ్ళని ఇండియాకు పంపేట్లుగా రిక్వెస్టు చేసింది.

సీబీఐ రిక్వెస్టుకు ఇంటర్ పోల్ సానుకూలంగా స్పందిస్తే వెంటనే రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఇండియాకు అప్పగించే అవకాశముంది. నిందితులు అమెరికాలోనే కాదు 196 దేశాల్లో ఎక్కడున్నా ఇంటర్ పోల్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుంటుంది. ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసును చాలెంజ్ చేస్తు నిందితులిద్దరు కోర్టుకు వెళ్ళే అవకాశముంది. కోర్టులో గనుక ఊరట లభించకపోతే వెంటనే ఇంటర్ పోల్ ఇద్దరినీ బలవంతంగా ఇండియాకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇంటర్ పోల్ ఇద్దరిపైనా రెడ్ కార్నర్ నోటీసులు ఎప్పుడు జారీచేస్తుందో చూడాలి.

Read More
Next Story