టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాలుగో సారి ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11: 27 గంటలకు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కేసరపల్లి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికగా ముస్తాబైంది. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ, హోమ్ మంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ఇతర కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి సమస్యలు తలెత్తకూడదని, కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖలు, వీఐపీలు రాకపోకలకు అనువుగా ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో కేసరపల్లిలో జాతీయ రహదారి 16కు పక్కనే ఉన్న ఐటీ పార్కు ప్రాంగణం వద్ద ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 11.18 ఎకరాల ప్రైవేటు భూమిలో ఈ వేదికను సిద్ధం చేశారు. వర్షం కురిసినా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పై కప్పును తీర్చిదిద్దారు.
ప్రముఖులు, వీఐపీలకు ప్రత్యేకంగా సీటింగ్ అరేంజ్‌మెంట్లు ఏర్పాటు చేశారు. వీరి కోసం నాలుగు గ్యాలరీలు కేటాయించారు. మిగిలిన ప్రాంగణంలో ప్రజలు, పార్టీ శ్రేణులు కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాట్లు చేపట్టారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ ప్రాంగణంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు, సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. విశ్రాంతి గదులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. సుమారు 7వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా ఎన్‌ఎస్‌జీ ఆధీనంలోకి వెళ్లింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్వంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కార్యక్రమానికి హాజరయ్యే వాహనాల కోసం దాదాపు 56 ఎకరాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు.
చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే సభా స్థలం ఉండటంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులపై ఇప్పటికే ఆంక్షలు విధించారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఇవి కొనసాగుతాయి.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 8:20గంటలకు ఢిల్లీలో బయలు దేరి 10:40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా 10:55 గంటలకు కేసరపల్లి ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యహ్నం 12:30 గంటల వరకు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. తిరిగి 12:40 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి బయలుదేరి భువనేశ్వర్‌కు వెళ్తారు.
ఈ కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన బాధితులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 104 మంది గత ప్రభుత్వ బాధిత కుటంబాలను ఆహ్వానించారు. వీరిలో పల్నాడు జిల్లాకు చెందిన వారే 90 మంది బాధితులు ఉన్నారు. పోలింగ్ సమయంలో పిన్నెల్లిని అడ్డుకొని గాయపడ్డ నంబూరి శేషగిరిరావు కుటుంబం, చేరెడ్డి మంజుల కుటుంబాలు ఉన్నాయి.
కలవని జగన్ ఫోన్
ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించాలని నిర్ణయించారు. చంద్రబాబు నాయుడు నేరుగా జగన్‌కు ఫోన్ చేసి మాట్లాడి ఆహ్వానించాలని మంగళవారం ప్రయత్నించారు. అయితే జగన్ ఫోన్ అందుబాటులో లేక పోవడం, లైన్ కలవక పోవడంతో కుదరలేదు.
విశిష్ట అతిధిగా చిరంజీవి
చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిధిగా పాల్గొననున్నారు. విశిష్ట అతిధిగా ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మంగళవారమే తన కుటుంబ సమేతంగా విజయవాడ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి గన్నవరం చేరుకున్నారు. ఎన్‌డీఏ భాగస్వాములైన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలు వేదిపై ఉంటారు.