Gandipet|మామసాని కుంటను బతికించండి..ప్లీజ్
చెరువులో నీళ్ళు లేవు, చెరువులోకి నీళ్ళు వచ్చే మార్గాన్నికూడా మూసేశారు. దాంతో చెరువులోకి నీళ్ళు వచ్చే మార్గం మూతపడిపోవటంతో చెరువు ఎండిపోయింది.
కొనఊపిరితో ఉన్న రోగిని బతికించటం కోసం ఆసుపత్రిలో డాక్టర్ ఎంతగా ప్రయత్నిస్తారు ? అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. మరణం అంచుల్లో ఉన్న రోగి తరపున డాక్టరే పెద్ద యుద్ధం చేస్తాడు. అదేపద్దతిలో నిర్జీవమైపోతున్న చెరువును పునరుజ్జీవింప చేయటం కోసం ఇపుడు పెద్ద పోరాటమే జరుగుతోంది. దయచేసి మామసాని కుంటను బతికించండని పదేపదే వేడుకుంటోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రంగారెడ్డి జిల్లా(RangaReddy District) గండిపేట(Gandipet) మండలంలోని పుప్పాలగూడ(Puppalaguda Village) గ్రామంలో మామసానికుంట(MamasaniKunta) అనే చెరువుండేది. ఒకపుడు అంటే సుమారు ఐదేళ్ళక్రితం వరకు నీటితో కళకళలాడిన ఈ చెరువు ఇపుడు వట్టిపోయింది. చెరువులో నీళ్ళు లేవు, చెరువులోకి నీళ్ళు వచ్చే మార్గాన్నికూడా మూసేశారు. దాంతో చెరువులోకి నీళ్ళు వచ్చే మార్గం మూతపడిపోవటంతో చెరువు ఎండిపోయింది.
కుక్కను చంపాలంటే ముందు దానికి పిచ్చిదనే ముద్రవేయాలి. అదేపద్దతిలో చెరువులో నీళ్ళు లేవుకాబట్టి ఈ ప్రాంతం మొత్తంలో నిర్మాణాలు చేసుకునేందుకు కంపెనీకి అధికారులు అనుమతులు ఎలాగ ఇచ్చారో అర్ధంకావటంలేదు. ఇందులో భాగంగానే కొంతకాలం క్రితం మామసానికుంటకు ఎగువన ఉన్న బాల్కంపూర్ నాలా మీద కొంత నిర్మాణం కూడా చేశారు. నాలామీద ఎలా నిర్మాణం చేశారు ? ఎలాగ చేశారంటే మామసానికుంటలో నీళ్ళుంటేనే వర్షాలు బాగా కురిసినపుడు కుంటలోని నీళ్ళు ఓవర్ ఫ్లో అయి బాల్కంపూర్ నాలాలోకి వచ్చి నాలాగుండా ఎగువ ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మామసానికుంటలోకి నీళ్ళు రాకుండా అడ్డుకున్నారో అదే సమయంలో బాల్కంపూర్ నాలాలోకి నీళ్ళు రావటం ఆగిపోయింది. మామసానికుంటను ఆక్రమించి నిర్మాణాలు చేసుకునే ముందు అంటే శాంపుల్ గా అనుకోవచ్చు బాల్కంపూర్ నాలాను ఆక్రమించి కొంతవరకు నిర్మాణాలు చేసుకున్నారు.
బ్రిటీషువాళ్ళు ఒకపుడు ఇండియాను ఎలాగైతే ఆక్రమించేసుకున్నారు బడాకంపెనీల యాజమాన్యం మెల్లిగా ఆక్రమణల పర్వానికి తెరలేపింది. ఇందులో భాగంగా ముందు బాల్కంపూర్ నాలా ఆక్రమణతో మొదలుపెట్టింది. నాలా ఆక్రమణలో స్ధానికుల నుండి, స్ధానికసంస్ధలు, ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకపోతే మెల్లిగా నాలామీద మరికొన్ని నిర్మాణాలు చేసి తర్వాత మామసానికుంట సంగతి చూడటానికి కంపెనీ యాజమాన్యం వెయిట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.
చివరిదశలో ఉన్న మామసానికుంటను ఆక్రమణల నుండి కాపాడాలంటే దానికి పైన గండిమైసమ్మ దేవాలయం వైపున్న వాటర్ సప్లై ఛానల్ ను పునరుద్ధరించాలి. మామసానికుంట పునరుజ్జీవనం కోసం, సప్లై ఛానల్ అడ్డుతొలగించాలని, బాల్కంపూర్ నాలాను బతికించాలనే డిమాండుతో సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ లుబ్నా సార్వత్ పెద్ద పోరాటమే చేస్తున్నారు. తన పోరాటంలో భాగంగా హైడ్రా(Hydraa) అధికారులను నెలరోజుల క్రితం కలిసి మామసానికుంట పరిస్ధితిని వివరించారు. ఒకపుడు కుంట ఎలాగుండేది, ఇపుడు దాని పరిస్ధితి ఏమిటనే విషయాన్ని గూగుల్ మ్యాపులతో సహా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ కు వివరించారు. అలాగే దిగువన నిర్మాణం కారణంగా మూతపడిన వాటర్ సప్లై ఛానల్ ను తిరిగి ఓపెన్ చేయించాలని, బాల్కంపూర్ నాలామీద కట్టిన నిర్మాణాన్ని తొలగించాలని లుబ్నా హైడ్రా కమిషనర్ కు మ్యాపులు, ఫొటోల ఆధారాలతో సహా వివరించారు.
హైడ్రా కమిషనర్ ను కలిసి వివరించి సుమారు నెలరోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ మొదలవ్వలేదు. అలాగే ఇరిగేషన్, రెవిన్యు శాఖల అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఉపయోగంకనబడలేదు. అందుకనే మామసానికుంటను బతికించటంకోసం ప్రభుత్వయంత్రాంగంతో పెద్ద పోరాటమే చేస్తున్న లుబ్నా(Lubna Sarwat) ముఖ్యమంత్రి రేవంత్(Revanth) రెడ్డికి కూడా కుంట పరిస్ధితిని వివరించారు. రేవంత్ ను నేరుగా కలవకపోయినా వాట్సప్, మెయిల్ ద్వారా మామసానికుంట ఇప్పటి పరిస్ధితిని, ఒకపుడు ఎలాగుండేడి, చెరువును కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఎదురవ్వబోయే సమస్యలను వివరించారు.
ఇదే విషయాన్ని లుబ్నా ‘తెలంగాణా ఫెడరల్‘ తో మాట్లాడుతు ‘మామసానికుంటను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవ’ని హెచ్చరించారు. ‘జలవనరులను కాపాడుకోలేకపోతే భవిష్యత్ తరాలు నీటికోసం చాలా ఇబ్బందులు పడటం ఖాయమ’ని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మామసానికుంటను ఆక్రమించుకునేందుకు స్పీనిక్స్ కంపెనీ ప్రయత్నాలకు అధికారులు కూడా ఊతమిస్తున్నార’ని మండిపడ్డారు. లేకపోతే ‘నీళ్ళతో కళకళలాడే మామసానికుంటను పూడ్చేసి కుంటపైనుండే రోడ్లు వేస్తుంటే అధికారులు ఏమిచేస్తున్నార’ని నిలదీశారు. కుంటను పూడ్చేసి రోడ్లు వేస్తున్న విషయం ప్రభుత్వయంత్రాగానికి తెలీకుండానే ఉంటుందా అని ప్రశ్నించారు.
‘2017-18 వరకు కూడా చెరువులో నీళ్ళుండేవని దీని ఆధారంగా సుమారు 50 ఎకరాల్లో సాగు కూడా జరిగేదని స్ధానికులు తనతో చెప్పి’నట్లు లుబ్నా వివరించారు. ‘కుంటలోకి నీళ్ళు రాకుండా దిగువన ఉన్న కట్టమైసమ్మ దేవాలయం దగ్గర కంపెనీ పెద్దగా నిర్మాణం చేసి అడ్డుకున్న’ట్లు ఆరోపించారు. ఎప్పుడైతే సప్లై ఛానల్ మూతపడిపోయిందో అప్పటినుండి కుంటలోకి నీళ్ళు రావటం ఆగిపోయిందన్నారు. ‘కుంటలోకి నీళ్ళు రావటంలేదు కాబట్టి ఎగువన బాల్కంపూర్ నాలాలోకి కూడా నీళ్ళు వెళ్ళటంలేద’ని చెప్పారు. మొత్తంమీద ‘ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేటు కంపెనీ కలిసే మామసానికుంటను చంపేస్తున్న’ట్లు లుబ్నా ఆవేధనతో చెప్పారు. ‘ఇపుడు గనుక మామసానికుంటను పునరుజ్జీవింప చేసుకోకపోతే భవిష్యత్తులో చుట్టుపక్కల జనాలు నీటికోసం చాలా కష్టపడాల్సుంటుంద’న్నారు.
ఆ పరిస్ధితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం అర్జంటుగా మేల్కోవాలన్నారు. దిగువన నీళ్ళు రాకుండా ఆపేసిన వాటర్ సప్లై ఛానల్ ను పునరుద్ధరించాలని, పూడ్చేసిన కుంటను తిరిగి పూడికంతా తీయాలన్నారు. అలాగే బాల్కంపూర్ నాలామీద చేసిన నిర్మాణాలను తొలంగించాలని డిమాండ్ చేశారు. వాటర్ సప్లై ఛానల్ ను పునరుద్ధరించి, కుంటలో పూడికను తీస్తే వర్షంపడినపుడు మళ్ళీ కుంటలో నీళ్ళు నిండి గతంలో లాగ నీటితో కళకళలాడుతుందన్నారు. కుంట నీటితో కళకళలాడితే ఓవర్ ఫ్లై అయినపుడు ఆ నీళ్ళు బాల్కంపూర్ నాలాలోకి వస్తుందని లుబ్నా సర్వాత్ చెప్పారు. మరి మామసాని కుంట పునరుజ్జీవనానికి లుబ్నా సార్వత్ చేస్తున్న పోరాటం ఫలిస్తుందా ?