KCR Assembly|అడ్రస్ లేని కేసీఆర్
సమావేశాలు ముగిసేందుకు ఇంకా నాలుగురోజులు గడువున్నా సభలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే సమావేశాలకు చీఫ్ హాజరుకారనే అందరు డిసైడ్ అయిపోయారు.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. అసెంబ్లీ శీతాకాల సమవేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమవేశాలకు కేసీఆర్ హాజరవుతారా ? హాజరవ్వరా ? అనే అయోమయం పార్టీ ఎంఎల్ఏలతో పాటు నేతలు, క్యాడర్లో కనబడింది. అయితే సమావేశాలు(Assembly Session) మొదలై రెండురోజులు అవుతున్నా సభలో కేసీఆర్(KCR) కనబడలేదు. దాంతో బీఆర్ఎస్(BRS) పార్టీతో పాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఎంఎల్ఏల(BJP MLAs)కు క్లారిటి వచ్చేసింది. ఈ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు లేవని అందరికీ అర్ధమైపోయింది. సమావేశాలు ముగిసేందుకు ఇంకా నాలుగురోజులు గడువున్నా సభలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే సమావేశాలకు చీఫ్ హాజరుకారనే అందరు డిసైడ్ అయిపోయారు.
సమావేశాలు మొదలైన దగ్గరనుండి అధికార, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదాలు జరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే. లగచర్ల(Lagacharla Farmers) రైతుల భూములను ఫార్మా పరిశ్రమల ఏర్పాటుపేరుతో సేకరించాలని ప్రభుత్వం అనుకున్నపుడు గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి జరిగింది. ఆ దాడికి కారకులని పోలీసులు 41 మందిని అరెస్టుచేశారు. వారంతా ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే జైలులో అనారోగ్యంగా ఉన్న హీర్యానాయక్(Hirya Naik Hand cuffs) చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఈ రెండు ఘటనలపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టి సభలో పెద్ద గలబానే చేశారు. అలాగే సంక్షేమహాస్టళ్ళల్లో కలుషితాహారం కారణంగా అస్వస్ధతకు గురవుతున్న విద్యార్ధుల విషయంపై సభలో చర్చించాల్సిందే అని కారుపార్టీ ఎంఎల్ఏలు పట్టుబట్టారు. సభకు చేతులకు బేడీలు వేసుకుని, నల్లచొక్కాలు ధరించి నిరసనగా వచ్చారు.
హీర్యానాయక్ చేతులకు బేడీలు వేసిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అధికారిని సస్పెండ్ చేసి విచారణ జరుపుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం సభలో ప్రకటించినా కారుపార్టీ సభ్యులు వినిపించుకోకుండా చర్చ జరగాల్సిందే అని పట్టుబట్టారు. అలాగే జైలులోఉన్న రైతులందరినీ వెంటనే విడుదలచేయాల్సిందే అని నానారచ్చచేస్తున్నారు. ఇక హాస్టళ్ళల్లో కలుషితాహారంపైన కూడా కేటీఆర్(KTR) అండ్ కో బాగా గోల చేస్తున్నారు. బీఆర్ఎస్ గోల కారణంగా కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు రైతుల అరెస్టులు, చేతులకు బేడీలు వేసిన ఘటనలను కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తారు. అలాగే సంక్షేమహాస్టళ్ళ ప్రస్తుత దుస్ధితికి బీఆర్ఎస్ పదేళ్ళ పాలనే కారణమని ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తదితరులు ఎదురుదాడులకు దిగారు. భట్టి మాట్లాడుతు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఇచ్చిన హామీలు తదితరాలతో పాటు విద్యార్ధుల మెస్ ఛార్జీలు పెంచకపోవటం, మౌళికసదుపాయాలను కల్పించకపోవటంతో సమస్యలు పెరిగిపోయినట్లు భట్టి ఘాటుగా సమాధానం చెప్పారు. దాంతో అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికిపోతోంది.
అలాగే పంచాయితీలకు పెండింగులో ఉన్న బిల్లుల సంగతిని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పదేపదే ప్రస్తావిస్తు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నంచేశారు. అయితే ఇపుడు పెండింగులో ఉన్న పంచాయితీల బిల్లుల్లో చాలావరకు బీఆర్ఎస్ హయాంలో ఉన్న బకాయిలే అని మంత్రి సీతక్క(Minister Seethakka) ఘాటుగా సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయితీలకు ఏ మేరకు బిల్లులు పెండింగులో ఉన్నది, ఎన్నిసంవత్సరాలు బిల్లులు పెండింగులో పెట్టింది, పంచాయితీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యంచేసిందనే విషయాలను సీతక్క వివరిచటంతో సభలో పెద్ద గొడవలే అవుతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో సమావేశాలకు హాజరైతే అధికారపార్టీ సభ్యులు మొత్తం కేసీఆర్ నే టార్గెట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పులు, పాలనాతీరువల్ల జరిగిన నష్టాలు తమ ప్రభుత్వానికి వారసత్వంగా సంక్రమించినట్లు రేవంత్ రెడ్డి (Revnth reddy)పదేపదే చెబుతున్నారు. కేసీఆర్ సమావేశాలకు హాజరైతే అదే పాయింట్ మీద సభలో పెద్ద రచ్చవటం ఖాయమని కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ సభ్యులకు అర్ధమైంది. అందుకనే మంగళవారం కూడా కేసీఆర్ సమావేశాలకు హాజరవ్వలేదని సమచారం. పై కారణాల వల్ల కేసీఆర్ మిగిలిన రోజుల్లో కూడా సమావేశాలకు హాజరయ్యేది అనుమానమే. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.