రూటు మార్చిన కేసీయార్
x

రూటు మార్చిన కేసీయార్

పోలింగ్ తేదీ దగ్గరపడే సమయంలో కేసీయార్ రూటు మార్చారు. ఎన్నికల ప్రచారంలో కేసీయార్ చాలా జోరుమీదున్న విషయం తెలిసిందే.


పోలింగ్ తేదీ దగ్గరపడే సమయంలో కేసీయార్ రూటు మార్చారు. ఎన్నికల ప్రచారంలో కేసీయార్ చాలా జోరుమీదున్న విషయం తెలిసిందే. పోరుబాట పేరుతో ఏప్రిల్ 24వ తేదీన మొదలైన బస్సు యాత్ర మే 10వ తేదీవరకు నిర్విరామంగా జరుగుతోంది. మొత్తం 17 రోజులు జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా బహిరంగసభలు నిర్వహించారు. అయితే వాటివల్ల పెద్దగా ఉపయోగం కనబడలేదని నిర్ధారించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొన్ని తప్పులు జరిగాయని, అవేమిటనే విషయంలో కేసీయార్ స్వీయ విశ్లేషణ చేసుకున్నారు. అందుకనే రూటు మార్చి బహిరంగసభల కన్నా బస్సుయాత్రకే బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

యాత్ర ఎలా సాగుతోంది

బస్సుయాత్ర కూడా ఎలా సాగుతోందంటే ప్రతి ఊరిలోను కేసీయార్ ఆగుతున్నారు. స్ధానిక నేతలు, జనాలను పెద్దఎత్తున పార్టీ యంత్రాంగం సమీకరిస్తోంది. ఒకవైపు పార్టీ నేతలు జనాలను సమీకరిస్తున్నా మరోవైపు జనాలు కూడా కేసీయార్ ను చూసేందుకు వస్తున్నారు. ఊరి మొదట్లో డప్పులు కొట్టడం, బతుకమ్మలు ఆడటం, ఆడోళ్ళు మంగళహారతులు పట్టడం లాంటివాటితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా కనబడుతోంది. యాత్రసాగే ప్రాంతంలోని రైతులు, మహిళలు, యువకులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. ఇదే సమయంలో రూటు మధ్యలో కేసీయార్ కూడా బస్సులో నుండి బయటకు వచ్చి టీ, కాఫు షాపుల దగ్గర కూర్చుంటున్నారు. హోటళ్ళు, టీ బంకుల దగ్గర స్ధానికులతో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, మెదక్ ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం చేసినా ఇదే స్టైల్ ను ఫాలో అవుతున్నారు.

స్ధానికులతో ముచ్చట్లు

లోకల్ జనాలతో మాట్లాడేటప్పుడు అక్కడి పరిస్ధితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఒకపుడు కేసీయార్ మామూలు జనాలతో మాట్లాడింది చాలా తక్కువ. అధికారంలో ఉన్న పదేళ్ళు హెలికాప్టర్లలో తప్ప తిరిగిందే లేదు. ఎక్కడినుండి ఎక్కడికైనా హెలికాప్టర్లలో వెళ్ళటం, బహిరంగసభల్లో మాట్లాడటం అక్కడినుండి వెళ్ళిపోవటం. అధికారం పోయేసరికి కేసీయార్ కు మళ్ళీ జనాలు గుర్తుకొచ్చారు. పైగా తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆశించినస్ధాయిలో పార్టీ పార్లమెంటు సీట్లు గెలవకపోతే మొదటికే మోసం రావటం గ్యారెంటీ. ఇపుడున్న తొమ్మిది సీట్లను అయినా గెలుచుకోకపోతే పార్టీలో నేతలను పట్టిపెట్టుకోవటం కేసీయార్ కు చాలా కష్టమైపోతుంది. జనాలు కేసీయార్ ను నమ్మటంలేదనే భావన నేతల్లో వస్తే పార్టీ చాలావరకు ఖాళీ అయిపోవటం ఖాయమనే ప్రచారం తెలిసిందే.

రోడ్డుపక్కనే చాయ్

రోడ్డుపక్కన ఉన్న హోటళ్ళల్లో కేసీయార్ చాయ్ తాగటాన్ని జనాలు గతంలో పెద్దగా చూసిందిలేదు. ఇపుడు ప్రతి నియోజకవర్గంలోను ఎక్కడో ఒకచోట హోటల్లో కూర్చుని టీ తాగుతున్న కేసీయార్ ను కలిసేందుకు, సెల్ఫీలు దిగేందుకు యువత ఎక్కువగా పోటీపడుతున్నారు. అలాగే గతంలో రోజంతా ఎన్ని సభల్లో పాల్గొన్నా రాత్రికి వీలున్నంతలో హైదరాబాద్ కు వచ్చేసేవారు. పెద్ద సెంటర్లలో సభ ముగిసేసమాయినికి రాత్రయిపోతే మాత్రం అక్కడే బసచేసేవారు.

ఊర్లలోనే రాత్రిళ్ళు బస

అయితే గతానికి భిన్నంగా ఇపుడు రాత్రుళ్ళు ఊర్లలోనే పడుకుంటున్నారు. రాత్రిళ్ళు భోజనంచేసేటపుడు కూడా స్ధానికంగా ప్రముఖులతో భేటీ అవుతున్నారు. వారితోనే కలిసి భోజనం చేస్తున్నారు. అవసరం అనుకుంటే తానే స్వయంగా కొందరు ప్రముఖుల ఇళ్ళకు వెళ్ళుతున్నారు. ఇపుడు కేసీయార్ డైలీ షెడ్యూల్ చాలా భిన్నంగా జరుగుతోంది. ఒకపుడు ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్లో కూర్చుంటే రోజుల తరబడి బయటకు వచ్చేవారు కాదు. అలాంటిది పార్లమెంటు ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నాడనే నానుడిని నిజంచేస్తు కేసీయార్ ఊరు ఊరు తిరుగుతుంటే చూసే జనాలకు చాలా విచిత్రంగా ఉంది. మొత్తానికి ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేసీయార్ మార్చిన రూటుతో పార్టీకి ఏమేరకు లాభం జరుగుతుందన్నది చూడాలి.

Read More
Next Story