కేసీఆర్ ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టిన రేవంత్
x

కేసీఆర్ ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టిన రేవంత్

కేసీయార్ హయాంలో కేంద్రప్రభుత్వంతో చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని బయటపెట్టారు.


కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన కీలకమైన విషయాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివారం రేవంత్ సభలో మాట్లాడుతు కేసీయార్ హయాంలో కేంద్రప్రభుత్వంతో చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని బయటపెట్టారు. వ్యవసాయ విద్యుత్ కు స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం ఎన్నిసార్లు అడిగినా తాము ఒప్పుకోలేదంటు ఇంతకాలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కో పదే పదే చెబుతున్నారు. బహిరంగసభల్లో కేసీఆర్ మాట్లాడినపుడల్లా విద్యుత్ రంగం గురించి మాట్లాడేవారు. స్మార్ట్ మీటర్లను బిగించే విషయంలో కేంద్రప్రభుత్వం తన మెడమీద కత్తిపెట్టినా తాను అంగీకరించలేదని గొప్పలు చెప్పుకునేవారు. అయితే సభకు రేవంత్ అందించిన ఒప్పంద కాగితాలను చూసిన తర్వాత ఇంతకాలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ చెప్పిదంతా అబద్ధమే అని తేలిపోయింది.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం 2017, జనవరి 4వ తేదీన కేంద్రప్రభుత్వంతో రాష్ట్రప్రభుత్వం, డిస్కంలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రేవంత్ బయటపెట్టారు. ఒప్పందంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మార్లు, విద్యుత్ ఫీడర్ల దగ్గర 2017, జూన్ 30కి, 500 యూనిట్లు వాడే ఇళ్ళ కనెక్షన్లకు 2018 చివరికి, 200 యూనిట్లు వాడే ఇళ్ళకు 2019 చివరకల్లా స్మార్ట్ మీటర్లను బిగిస్తామని విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావులు సంతకాలు చేశారన్నారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే డిస్కంలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉన్నట్లుగా ఒప్పందంలో ఉందని రేవంత్ చెప్పారు. ఒప్పందాలను అమలుచేసే విషయంలో ఇపుడు డిస్కంలపై కేంద్రప్రభుత్వం కత్తి వేలాడుతోందని రేవంత్ ఆందోళన వ్యక్తంచేశారు. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెడతామంటే రైతులు బీఆర్ఎస్ కు ఉరేస్తారని భయపడి కేసీఆర్ నిజాలు దాచినట్లు రేవంత్ ఆరోపించారు.



ఎన్నికల సమయంలో ఇదే విషయమై ప్రచారం చేసుకునేటపుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తాము వ్యతిరేకించామని, మెడపై కత్తిపెట్టినా అంగీకరించలేదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ పదేపదే అబద్ధాలు చెప్పినట్లు రేవంత్ సభలో మండిపడ్డారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర 100 శాతం స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఒప్పందంలో ఉందన్నారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల కారణంగా ఇపుడు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పనిస్ధితి ఏర్పడిందని రేవంత్ ప్రెకటించారు.

స్మార్ట్ మీటర్లు బిగించే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను, సంతకాలు చేసిన పత్రాలను రేవంత్ సభముందు ఉంచినా హరీష్ అయితే వాటిని అంగీకరించలేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించే విషయంలో అప్పట్లో తమ ప్రభుత్వం అంగీకరించలేదని హరీష్ ఎదురుదాడికి దిగారు. ఒప్పందపత్రాలను రేవంత్ సభలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా హరీష్ అదే వాదనను వినిపించటమే ఆశ్చర్యంగా ఉంది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర 100 స్మార్ట్ మీటర్లను బిగిస్తామని ఒప్పందంలో సంతకాలు చేయటమంటేనే వ్యవసాయ మోటార్లకు కూడా మీటర్లు బిగించటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించినట్లే. ఎలాగంటే ఇళ్ళ కనెక్షన్లకు, కమర్షియల్ కనెక్షన్లకు, వ్యవసాయ కనెక్షన్లకైనా విద్యుత్ సరఫరా అయ్యేది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల ద్వారానే. కాబట్టి అప్పట్లో కేసీయార్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కారణంగా ఏదో రోజు వ్యవసాయ మోటార్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పదు.

Read More
Next Story