తండా వాసులతో కేసీయార్ ‘చాయ్ పే చర్చా’
బస్సుయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలోకి ఎంటరవ్వగానే ఎల్లంపేట స్టేజి తండా దగ్గర ఆగారు. రోడ్డుపక్కనే ఉన్న చిన్న చాయ్ దుకాణం దగ్గర బస్సు దిగారు.
కేసీయార్ కూడా చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు కేసీయార్ ప్రజాపోరు, పోరుయాత్ర కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మే నెల 11వ తేదీవరకు ప్రచారంలో కారుపార్టీ అధినేత చాలా బిజీగా ఉండబోతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రచారం ముగించుకుని ఖమ్మంలోకి ఎంటరయ్యారు.
బస్సుయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలోకి ఎంటరవ్వగానే ఎల్లంపేట స్టేజి తండా దగ్గర ఆగారు. రోడ్డుపక్కనే ఉన్న చిన్న చాయ్ దుకాణం దగ్గర బస్సు దిగారు. బస్సు దిగగానే ఎదురుగా కనిపించిన చాయ్ దుకాణంలోకి వెళ్ళారు. దుకాణంలోకి అడుగుపెట్టిన కేసీయార్ ను చూసి యజమాని సోంధు ముందు షాక్ తిని తర్వాత ఆశ్చర్యపోయారు. వెంటనే తన కుటుంబసభ్యులందరినీ సోంధు పిలిపించి కేసీయార్ ముందు నిలబడ్డారు. హోటల్లో తినటానికి ఏముందని కేసీయార్ వాకాబుచేశారు. మిర్చిబజ్జీ ఉందని సోంధు చెప్పారు.
మిర్చిబజ్జి తిని చాలాకాలమైందని వెంటనే తీసుకురావాలని అడిగారు. కేసీయార్ మిర్చిబజ్జి కావాలని అడగ్గానే సోందు వేడిగా ఓ పదిప్లేట్లు వేసి కేసీయార్ కూర్చున్న టేబుల్ మీద తీసుకొచ్చిపెట్టారు. మిర్చిబజ్జితో పాటు ఉల్లిపాయ పకోడి కూడా తెచ్చిపెట్టారు. తర్వాత చాయ్ కూడా తెచ్చిచ్చారు. మిర్చిబజ్జి తిన్న కేసీయార్ ఛాయ్ తాగుతు కొద్దిసేపు కబుర్లుచెప్పారు. సోందు హోటల్ కు కేసీయార్ వచ్చిన విషయం తెలుసుకుని చుట్టుపక్కల జనాలంతా అక్కడికి చేరుకున్నారు. తమ తండా వాళ్ళతో పాటు సర్పంచ్ లాల్చింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు.
తండా కష్టాలను కేసీయార్ తో లాల్చింగ్ ఏకరువుపెట్టారు. తమకు రైతుబంధు రావటంలేదని, రుణమాఫీ కాలేదని, నీళ్ళందక పంటలు ఎండిపోయాయని, కరెంటు కూడా సరిగా రావటంలేదని బాధలను చెప్పారు. అలాగే వృద్ధులు, వికలాంగులు కూడా చేరుకుని తమ సమస్యలను వివరించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏమారి కాంగ్రెస్ కు ఓట్లేశామని బాధపడ్డారు. తమ కష్టాలు తీరాలంటే మళ్ళీ కేసీయారే అధికారంలోకి రావాలని తండావాసులు కోరుకున్నారు. కాంగ్రెస్ మాయమాటలు విని ఇక మోసపోవుడు లేదన్నారు.
వాళ్ళ సమస్యలు తెలుసుకున్న కేసీయార్ సమస్యలు పరిష్కారమయ్యేవరకు ప్రభుత్వంతో కొట్లాడుతానని హామీఇచ్చారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రజలకు న్యాయంజరిగేట్లు చూస్తానని భరోసా ఇచ్చారు. తర్వాత కొద్దిసేపు అక్కడివాళ్ళతో ముచ్చట్లు పెట్టుకున్నారు. తనను కలవటానికి వచ్చిన వాళ్ళని టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడిన కేసీయార్ తర్వాత అందరితో ముఖ్యంగా యువతతో సెల్ఫీలు దిగి అక్కడి నుండి ఖమ్మంకు చేరుకున్నారు.